కరోనా లాక్డౌన్ సమయంలో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న ‘మాస్టర్’ చిత్రం తరహాలోనే ‘కబడదారి’ విజయం సాధించాలని హీరో విజయ్ ఆంటోనీ ఆకాంక్షించారు. యువ హీరో శిబి సత్యరాజ్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ‘కబడదారి’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం చెన్నై నగరంలో జరిగింది. క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంతో జి.ధనుంజయన్, లలితా ధనుంజయన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా నిర్మించగా, తెలుగు(కపటధారి)లో హీరోగా సుమంత్ నటించారు. సైమన్ కె.కింగ్ సంగీత దర్శకత్వం వహించగా, జి.ధనుంజయన్, జాన్ మహేంద్రన్, హేమంత్ రావ్ కథను సమకూర్చిన ఈ చిత్రంలో జయ ప్రకాష్, కేఎస్.సతీష్ కుమార్ తదితరులతో పాటు సీనియర్ నటుడు నాజర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, మాస్టర్ చిత్రంలా కబడదారి కూడా సూపర్‌హిట్ కావాలని, ఇందుకోసం మీడియా కూడా తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రేక్షకులు థియేటర్‌కు రావాలని, పెద్ద చిత్రాల తరహాలోనే చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలని కోరారు. కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తమిళంలో కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
అంతకుముందు నిర్మాతల్లో ఒకరైన జి ధనుంజయన్ మాట్లాడుతూ, కన్నడంలో ఈ చిత్రాన్ని చూసిన తర్వాత హీరో శిబి సత్యరాజ్ తనను సంప్రదించి, ఈ మూవీ రైట్స్ ఇవ్వాలని లేనిపక్షంలో ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఒక హీరోనే స్వయంగా నిర్మాతను సంప్రదించి తాను నటిస్తానని చెప్పడం చాలా చాలా అరుదని, అందుకే ఆయన మాటలు నచ్చి, మరో హీరోతో తీయదలచుకున్న ఈ మూవీని శిబి సత్యరాజ్‌తో పూర్తిచేసినట్టు చెప్పారు. హీరో శిబి సత్యరాజ్ మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ తర్వాత ఒక సినిమా ఫంక్షన్లో పాల్గొనడం ఇదే తొలిసారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ధైర్యం ఇచ్చింది మాస్టర్ మూవీ అని చెప్పారు. ఈ విషయంలో హీరో విజయ్, తన స్నేహితుడు శింబు కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో తాను చేసిన రెండో చిత్రమని, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని శిబి సత్యరాజ్ కోరారు.