Abn logo
Jul 11 2020 @ 05:05AM

ఆయ‘కట్‌’

జూరాల ఎడమ కాలువ, భీమా లిఫ్ట్‌-2కు జరగని నీటి విడుదల

పది రోజులుగా ప్రాజెక్టుకు వస్తున్న వదర

గతేడాది కూడా నీటి విడుదల చేయడంలోనూ జాప్యం

ఇప్పటికే నెట్టెంపాడు, భీమా లిఫ్ట్‌-1కు పంపింగ్‌ ప్రారంభం

బోర్లు ఉన్న రైతులు మాత్రమే తుకాలు పోసుకుంటున్న వైనం


వనపర్తి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఎగువ నుంచి ఆశించిన మేర వరద నీరు వస్తుందనే అంచనాల మేరకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు అధికారులు ఇప్పటికే పంపింగ్‌ మొదలు పెట్టారు. అదే సమయంలో జూరాల కింద ఏళ్లుగా స్థిరీకరణలో ఉన్న ఆయకట్టుకు ప్రతీ ఏటా కాలువల ద్వారా నీటి విడుదలలో జాప్యం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో జూరాల డెడ్‌ స్టోరేజీలో ఉండగా, జూలై చివరి వారం వరకు ఒక్క చుక్క నీరు కూడా ప్రాజెక్టులోకి చేరలేదు. తర్వాత ఒక్కసారిగా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరకు వరద రాగా, ఏకంగా 1,200 టీఎంసీలు సముద్రంలో కలిసింది. 


అయితే, గతేడాది కంటే ఈసారి మెరుగైన నీటి నిల్వలు జూరాలలో ఉండటంతో పాటు, ప్రస్తుతం 3,300 పైచిలుకు క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే జోగుళాంబ గద్వాల జిల్లాలో జవహార్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. భీమా లిఫ్ట్‌-1కు కూడా 560 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. త్వరలో కోయిల్‌సాగర్‌ ఆయకట్టుకు కూడా నీటి పంపింగ్‌ చేయనున్నారు. కానీ, వనపర్తి జిల్లాకు దాదాపు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే జూరాల ఎడమ కాలువ, భీమా లిఫ్ట్‌-2కు మాత్రం నీళ్లు విడుదల చేయడం లేదు. గతేడాది వరదలు ఆలస్యం కావడం వల్ల వీటికి నీటి విడుదల చేయకపోగా, ఈ ఏడాది వరద మోస్తరుగా ప్రారంభమై, ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నా నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సన్నాల సాగుకు ఇబ్బంది

జూరాల ఎడమ కాలువకు డిస్ర్టిబ్యూటరీలతో పాటు కాలువ వెంట ఉన్న చెరువులు నింపడం ద్వారా వాటి ఆయకట్టుకూ నీరందుతోంది. జూరాల కింద దాదాపు 180 చెరువులు, భీమా లిప్ట్‌-2 కింద దాదాపు 70 చెరువుల్లో నీటిని నింపుతున్నారు. ప్రస్తుతం చెరువులు కూడా ఖాళీ అయ్యాయి. వరద వస్తేనే వాటి కింద ఆయకట్టు సాగవుతుంది. ఈ ఏడు ప్రభుత్వం సన్న రకాలను సాగు చేయాలని సూచించగా, సన్నరకాల పంట కాలం తుకం వేసిన దగ్గర నుంచి కోత వరకు దాదాపు ఆరు నెలల పడుతుంది.


ఇప్పుడున్న సమయంలో వానాకాలంలో జిల్లాలో 60 శాతం సన్నాలు సాగు కావాలంటే కాలువల ఆధారంగా ఉన్న ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. వనపర్తి జిల్లాలో సన్నరకాలు సాగుచేసే అమరచింత, ఆత్మకూరు, పెబ్బేరు, వీపనగండ్ల, కొత్తకోట, మదనాపూర్‌ మండలాలు జూరాల ఆధారంగానే ఉన్నాయి. కాబట్టి అధికారులు తాత్సారం చేయకుండా ఎత్తిపోతల పథకాలతోపాటు జూరాల ఎడమ కాలువ, సమాంతర కాలువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement