Abn logo
Sep 18 2021 @ 01:40AM

బీజేపీ శ్రేణుల్లో జోష్‌

కమలం శ్రేణులను హుషారెత్తించిన అమిత్‌షా ప్రసంగం

నేతల ఉద్వేగ ప్రసంగాలకు జై కొట్టిన జనం

ఎల్లపెల్లి సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు 

సభ సక్సెస్‌తో పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం

నిర్మల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్ర శివారులోని ఎల్లపెల్లి వద్ద చేపట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో బీజేపీ శ్రేణుల్లో ఫుల్‌జోష్‌ కనిపించింది. పార్టీ ప్రముఖులంతా ఉహించిన దాని కంటే అధిక సంఖ్యలో జనం హాజరుకావడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, తదితరులు సభికులను ఆకట్టుకునే విధంగా ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేసీఆర్‌ నిర్వహించకపోవడానికి కారణం ఎంఐ ఎంతో ఉన్న భయమేనన్నారు. కేసీఆర్‌ ఎందుకో.. ఎవరికో భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఆయన సమాధానం చెప్పాలంటూ అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్‌ కుటుంబ పాలనకు బీజేపీ చరమగీతం పాడబోతోందని ధ్వజమెత్తి సభికులను ఆకట్టుకున్నారు. అలాగే బండి సంజయ్‌ పాదయాత్రను పొగుడుగూ ఆ పాదయాత్ర సీఎం కేసీఆర్‌లో వణుకుపుట్టిస్తోందని, బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న సంకేతాలను పంపుతోందని స్పష్టం చేశారు. బీజేపీ ఎవరికి భయపడదంటూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ప్రయ త్నం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ‘ఆగే ఆహో’ అంటూ పిలిచి వేదికపైనే హూజూరాబాద్‌లో ఆయన గెలవబోతున్నారంటూ, ఆయనకు మద్దతుగా అందరూ చేతులెత్తాలని కోరారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా స్థానిక సమస్యలను లేవనెత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భైంసాలో జరిగిన అల్లర్ల సంఘటనను బండి సంజయ్‌ ప్రస్థావించడమే కాకుండా అక్కడి బాధితులందరికీ బీజేపీ అండగా నిలిచిందని స్పష్టం చేశారు. భైంసాలో జరిగిన సంఘటనపై సీఎం స్పందించకపోవడం శోచనీయమంటూ ఆయన సెంటిమెంట్‌ను అస్త్రంగా మలిచాడు. జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలొచ్చారు. దీంతో నిర్మల్‌ పట్టణమంతా కాషాయవర్ణంతో నిండిపోయింది.

ఫలించిన ఎంపీ సోయం ప్రయత్నాలు..

మొదటి నుంచి అమిత్‌ షా సభపై దృష్టి కేంద్రీకరించిన ఎంపీ సోయం బాపూరావు జిల్లా నేతలందరినీ ఒకే తాటిపై నిలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు కూడా ఇక్కడే మకాం వేసి ఎంపీ సోయంతో సమన్వయంగా ముందుకు సాగారు. అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను టార్గెట్‌గా పెట్టుకున్నారు. వారం రోజుల నుంచి ఎంపీ సోయం బాపురావు జిల్లా స్థాయి నేతలందరినీ సమన్వయం చేస్తూ జన సమీకరణ లక్ష్యాన్ని ఛేదించగలిగారు. సభకు జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో బీజేపీ నేతల పది రోజుల కృషి ఫలించింది. ఎంపీ సోయం బాపూరావుతో పాటు బీజేపీ జిల్లా అధ్య క్షురాలు రమాదేవి, జిల్లాకు చెందిన పార్టీ నాయకులు రావుల రాంనాథ్‌, అప్పాల గణేష్‌ చక్రవర్తి, మెడిసమ్మె రాజు, సామ రాజేశ్వర్‌ రెడ్డి, అయ్యన్న గారి భూమయ్య, శ్రావణ్‌ రెడ్డి, అంజు కుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన జిల్లా అధ్యక్షులు పాయల శంకర్‌, ముథోల్‌కు చెందిన మోహన్‌ రావు పటేల్‌, ఖానాపూర్‌కు చెందిన రమేష్‌ రాథోడ్‌లతో పాటు తదితరులంతా పెద్ద సంఖ్యల జనాన్ని సభకు తరలివచ్చేట్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 

యూత్‌లో ఉత్సాహం..

అమిత్‌ షా సభకు యువకులే పెద్ద సంఖ్యలో తరలిరావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుం టోంది. అన్ని ప్రాంతాల నుంచి పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు యువకులు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా తరలివచ్చారు. దారి పొడగునా తమ బైకులకు, కార్లకు, ఆటో రిక్షాలకు బీజేపీ జెండాలను పెట్టుకొని నినాదాలు చేసుకుంటూ వారంతా సభకు తరలివచ్చారు. అలాగే బహిరంగ సభలో నేతలు చేసే ప్రసంగాలకు వారంతా పోటాపోటీగా చప్పట్లతో జై కొట్టడం మరింత ఉత్సాహం నిం పింది. అడుగడుగునా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, అమిత్‌ షా, బండి సంజయ్‌కి జై కొడుతూ వారు చేసిన నినాదాలు మిన్నంటాయి. తమ నేతలు ఉద్వేగపూరితంగా ప్రసంగాలు చేస్తున్నంత సేపు ఆ ప్రసంగాలను వారంతా మౌనంగా విని ఆ తరువాత చప్పట్లతో మారుమోగించారు. కాగా, అమిత్‌ షా సభకు యువకులు భారీ సంఖ్యలో తరలిరావడం పట్ల ఉమ్మడి జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురపడుతున్నారు.

బహిరంగ సభ హైలెట్స్‌..

2:49 గంటలకు మంత్రి హెలీక్యాప్టర్‌ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంది.

2:57 గంటలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా స్టేజీ పైకి వచ్చారు.

2:58 గంటలకు అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

3:03 గంటలకు కేంద్ర మంత్రికి ఎంపీ సోయం బాపూరావు గిరిజన సంప్రదాయం ప్రకారం గుస్సాడీ తలపాగను బహూకరించారు.

3:48 గంటలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రసంగం ప్రారంభమై 4:14 గంటలకు ముగిసింది.

అమిత్‌ షాకు ఘన స్వాగతం 

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబరు17: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిర్మల్‌కు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద ఘన స్వాగ తం లభించింది. సెప్టెంబరు 17 విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు హేమంత్‌, రాంబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికారు.

పటిష్ఠ బందోబస్తు

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబరు 17: జిల్లాలో నిర్వహించిన అమిత్‌ షా బహిరంగ సభకు కనివిని ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. అమిత్‌ షా ఢిల్లీ నుంచి నిర్మల్‌ వరకు ఎలా వస్తారన్న విషయాన్ని కూడా గురువారం సాయంత్రం వరకు సంబంధిత వర్గాలు వెల్లడించలేదు. గురువారం రాత్రి ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ వెల్లడించారు. అమిత్‌ షా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకున్నారు. నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బహిరంగ సభా స్థలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వచ్చారు. జడ్‌ప్లస్‌ భద్రత కేటగిరి ఉన్న కారణంగా అమిత్‌ షా పర్యటనను పోలీస్‌ యంత్రాంగమంతా సీరియస్‌గా తీసుకుంది. పోలీసు శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు నిర్మల్‌లోనే మకాం వేసి భద్రత చర్యలను చేపట్టారు.