Abn logo
Sep 30 2020 @ 01:37AM

ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించిన జో బైడెన్

Kaakateeya

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ తాజాగా తన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించారు. ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు కొద్ది గంటల ముందే ఆయన తన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించడం విశేషం. జో బైడెన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన, తన భార్య కలిపి 2019లో 2,99,346(రూ. 2 కోట్ల 20 లక్షల 68 వేలు) డాలర్ల ఆదాయ పన్నును చెల్లించారు. జో బైడెన్ తన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించడంతో అధ్యక్షుడు ట్రంప్ ఆదాయ పన్ను వివరాలపై చర్చ మొదలైంది. నిజానికి అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కానీ రిచర్డ్‌ నిక్సన్‌ నుంచి మొదలుకొని ప్రతి అధ్యక్షుడు ఆ వివరాలు వెల్లడించారు. 

ట్రంప్‌ మాత్రం తన ఆదాయపు వివరాలు వెల్లడించలేదు. దీనికి సంబంధించి ఆయన కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. బిలియనీర్ వ్యాపారవేత్తను అని ట్రంప్ చెప్పుకుంటున్నప్పటికి.. 2016లో ఆయన చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం 750 డాలర్లు(రూ. 55,291) మాత్రమే. ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ట్రంప్‌ ఇచ్చిన నివేదికల ప్రకారం ఏడాదికి వందల మిలియన్ల డాలర్లు సంపాదించే వ్యాపారవేత్త. అదే సందర్భంలో ఆయన పన్నులు ఎగ్గొట్టేందుకు దీర్ఘకాలిక నష్టాలను చూపిస్తారని మీడియా పేర్కొన్నది. అయితే ఈ వార్తలను మాత్రం ట్రంప్ ఖండిస్తున్నారు.

కాగా.. మంగళవారం జో బైడెన్, ట్రంప్ మధ్య మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. వీరిద్దరి మధ్య మొత్తంగా మూడు డిబేట్లు జరగనున్నాయి. తొలి డిబేట్ మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 నిమిషాలకు) జరగనుంది. ‘సూపర్‌ బౌల్‌ ఆఫ్‌ అమెరికన్‌ డెమోక్రసీ’ అని పిలిచే ఈ కీలక చర్చకు ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, అదే నెల 22న టెన్నెసీలోని నష్‌విల్లేలో రెండో, మూడో విడత డిబేట్లు జరుగుతాయి. ఇక అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

Advertisement
Advertisement
Advertisement