Abn logo
May 4 2021 @ 14:18PM

ఆ భూములు కొల్లగొట్టింది టీఆర్ఎస్ నేతలే.. :జీవన్‌రెడ్డి

హైదరాబాద్: దేవరయంజాల్ భూములు కొల్లగొట్టిన వారిలో అంతా టీఆర్ఎస్ నేతలే ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ను దోషిగా చూపడం కోసం అసైన్డ్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. అసైన్డ్ భూముల అన్యాక్రాంతం అయిన వాటిని అన్ని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ వర్గాలు నిరుపేదలు కావడంతో భూములు నిలబెట్టుకోలేకపోయారని జీవన్‌రెడ్డి చెప్పారు. 2018లో తీసుకొచ్చిన నూతన పట్టాదారు విధానంతో అసైన్డ్ భూముల మార్పిడి చేశారని జీవన్‌రెడ్డి తెలిపారు.

అసైన్డ్ భూముల వ్యవహారంపై ఒక కమిటీ వేస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క అడుగు పడట్లేదన్నారు. అన్యాక్రాంతం అయిన అసైన్డ్ భూములను గుర్తించి అసలు పట్టాదారుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దేవాలయ భూములన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. వక్ఫ్‌బోర్డు‌కు జ్యూడీషరీ పవర్స్ కల్పించాలని జీవన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement