Abn logo
Aug 8 2020 @ 19:05PM

వ్యక్తిగతంగా వింగ్ కమాండర్ నాకు తెలుసు: పవన్

అమరావతి: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో అశువులు బాసిన వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇరువురు పైలెట్లు, 17 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం చివరి నిమిషాలలో ఊహించని ప్రమాదం జరగడం విధి వైపరీత్యమన్నారు. గల్ఫ్ నుంచి ప్రయాణం చేసినవారు మాతృభూమిపై కాలు మోపే లోపలే మృత్యువు ప్రమాదం రూపంలో కాటు వేసిందన్నారు.


విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్  అఖిలేష్ కుమార్‌లు విమాన పయానంలో ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ విమానం ప్రమాదానికి గురవడం దురదృష్టకరమని చెప్పారు. ముఖ్యంగా వింగ్ కమాండర్  దీపక్ వసంత్ సాథే గతంలో భారత వాయుసేనలో చిరస్మరణీయ సేవలు అందించారని కొనియాడారు. వ్యక్తిగతంగా కూడా తనకు ఆయన తెలుసన్నారు. ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. వాయుసేనలో  సాథే అందించిన సేవలు, చూపిన ధైర్య సాహసాలు ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement