Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుదిబండ

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి స్పందన నామమాత్రమే

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ముందుకురాని లబ్ధిదారులు 

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ అంటూ ప్రచారం

పేదలపై రూ.10 వేలు, రూ.20 వేల భారం

జిల్లాలో ట్యాగ్‌ చేసిన లబ్ధిదారులు 2,40,264 మంది

దరఖాస్తు చేసుకుంది 3,876 మందే..

రూ.340 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పథకం రూపకల్పన

ఇప్పటివరకు వచ్చింది రూ.3.34 కోట్లే..


ప్రభుత్వ ప్రణాళిక ఇదీ..

2,80,012 మంది లబ్ధిదారులు.. 

2,40,264 మందికి ట్యాగింగ్‌.. 

రూ.340 కోట్ల ఆదాయమే లక్ష్యం..


వాస్తవంగా జరిగేది ఇదీ..

దరఖాస్తు చేసుకుంది 3,876 మంది

వచ్చిన ఆదాయం రూ.3.34 కోట్లు


ప్రభుత్వం తెచ్చిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం జిల్లాలో బోర్లా కొట్టింది. పేరుకు పేదల పథకమని చెబుతూ రూ.300 కోట్లు లాగేద్దామనుకున్న ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) పేరుతో సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్‌ కల్పించగా, జిల్లాలో స్పందన నామమాత్రంగానే వస్తోంది. కరోనా అనంతర పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయంపై సందేహాల కారణంగా లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం : ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు, ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు, ప్రభుత్వ సబ్సిడీలతో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి వారి వారసులు కానీ.. ప్రస్తుతం ఉంటున్న వారు కానీ.. ఎవరు హక్కుదారులైతే వారికి శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే  ఉద్దేశంతో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని తీసుకొచ్చారు. హక్కుదారుడు ప్రస్తుతం ఆ ఇంట్లో నివసిస్తే రూ.10 వేలు, చేతులు మారి ప్రస్తుతం హక్కుదారులుగా వేరే వారుంటే రూ.20 వేలకే శాశ్వత భూ హక్కులు కల్పించాలన్నది దీని ఉద్దేశం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సహాయం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు కూడా హక్కు వస్తుందని, బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని సచివాలయాల ద్వారా నిర్వహించాలని, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను కూడా వాటిలోనే నిర్వహించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. సచివాలయ కార్యదర్శికి సబ్‌ రిజిస్ర్టార్‌ హోదాను కల్పించారు. కానీ, పేదలకు ఉచిత సేవలు అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తే బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాను నింపటం కోసం తెచ్చిన ఈ పథకం పట్ల ప్రజల్లో కూడా అంత ఆసక్తి కనిపించట్లేదు. 

రూ. 340 కోట్ల ఆదాయమే లక్ష్యం

జిల్లాలో 2.80 లక్షల మంది పేదలపై రూ.340 కోట్ల పైబడి భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారు, ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో రుణ సహాయంతో ఇళ్లను కట్టుకున్నవారు, సొంత స్థలంలో ప్రభుత్వ సహాయంతో ఇంటిని నిర్మించుకున్నవారు, ప్రభుత్వ ఇంటిని పొందినవారు 2.80 లక్షల మందిని గుర్తించారు. వీరంతా ఎలాంటి రెగ్యులైజేషన్‌ చేయించుకోనివారు. వీరికి శాశ్వత గృహహక్కు కల్పించేందుకు ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఒక్కొక్కరి దగ్గర వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన రూ.280 కోట్లు పేదల నుంచి ప్రభుత్వం లాగనుంది. ఇదే క్రమంలో చేతులు మారిన ఇళ్లకు సంబంధించి అయితే రూ.20వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇలా చేతులు మారిన ఇళ్లకు సంబంధించిన వారు 30వేల మందికి పైగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రూ.60 కోట్ల మేర వసూలు కానుంది. అంటే స్థూలంగా రూ.340 కోట్లను ప్రభుత్వం ఆర్జించనుంది. 

స్పందన నిల్‌

జిల్లావ్యాప్తంగా సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)లో భాగంగా 2,80,012 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇప్పటి వరకు 2,40,264 మందిని జిల్లా యంత్రాంగం గ్రామ సచివాలయాల ద్వారా ట్యాగ్‌ చేసింది. ఇలా ట్యాగ్‌ చేసిన వారికి గృహహక్కు కల్పిస్తామని సమాచారం ఇస్తోంది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 3,876 మందే దరఖాస్తు చేసుకున్నారు. అంటే గుర్తించిన లబ్ధిదారుల్లో  3 శాతం మంది కూడా ముందుకు రాలేదు. ఆసక్తి చూపిన వారి నుంచి రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వానికి రూ.10వేలు, రూ.20వేలు కట్టే పరిస్థితిలో ప్రస్తుతం పేదలు లేరు. దీంతో స్పందన నామమాత్రంగానే ఉంది. 

అనేక అనుమానాలు.. ఆందోళనలు..

రెగ్యులైజేషన్స్‌ స్కీమ్‌లలో చాలావరకు చట్టబద్ధ సమస్యలు ఎదురవుతుండటం వల్ల ఈ ఓటీఎస్‌పై కూడా అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఇలా క్రమబద్దీకరించటానికి వీరు ఎంచుకున్న విధానం చట్టబద్ధం కాదని చాలామంది లబ్ధిదారులు భావిస్తున్నారు. దీనికితోడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్‌ విధానం ప్రయోగాత్మక దశలో ఉండటం కూడా లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ దశలో సచివాలయ వ్యవస్థలో తెచ్చిన ఈ పథకం పట్ల ఆసక్తి చూపట్లేదు. దీనికితోడు గ్రామ సచివాలయ కార్యదర్శిని సబ్‌ రిజిస్ర్టార్‌గా హోదా కల్పించటం ఎవరైనా కోర్టులో సవాల్‌ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలోనూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు రూ.10 వేలు ప్రభుత్వానికి సమర్పించుకుంటే ఎలాంటి వివాదాలు చోటుచేసుకున్నా నష్టపోతామని భావిస్తున్నారు. ఈ కారణం వల్ల కూడా ఓటీఎస్‌కు స్పందన తగ్గింది. 


పట్టాభూమిలో ఇల్లు కట్టినా.. రిజిస్ట్రేషన్‌ చేయాలంటున్నారు

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 31వ డివిజన్‌లో మా కుటుంబం నివాసం ఉంటోంది. 2006లో నా పేరున పక్కా గృహం మంజూరైంది. నా భర్తకు వారసత్వంగా వచ్చిన, రిజిస్ర్టేషన్‌ అయిన ఇంటిస్థలంలో పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. రెండు విడతల్లో రూ.9వేల చొప్పున ఇచ్చారు. 50 సిమెంటు బస్తాలు కూడా ఇచ్చారు. ఇటీవల వలంటీర్‌, మరో అధికారి వచ్చి మీరు రూ.20 వేలు కడితే ఈ ఇల్లు మీ పేరున రిజిస్టర్‌ అవుతుందని చెప్పారు. మా పేరున గతంలోనే రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే మళ్లీ రిజిస్ర్టేషన్‌ ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. నా భర్త ఇటీవలే గుండెపోటుకు గురైతే అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకున్నాం. ఈ పరిస్థితుల్లో ఒకేసారి రూ.20 వేలు ఎలా చెల్లించగలం. - డొక్కు లలితకుమారి


పింఛన్‌ సొమ్ముతో బతుకుతున్నాం..

శివగంగ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. 2006లో ప్రభుత్వ సహకారంలో ఇల్లు కట్టుకున్నాం. నా భర్తకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ ఆధారంగానే బతుకుతున్నాం. మగపిల్లలు లేకపోవడంతో మా ఆర్థికపరిస్థితి అంతంతమాత్రమే. ఇటీవల వలంటీర్‌, ఒక అధికారి వచ్చి మీ పేరున ప్రభుత్వం ఇల్లు నిర్మించింది. మీరు రూ.20 వేలు కట్టాలని చెప్పారు. ఈ మొత్తం కడితే మా పేరున ఇల్లు రిజిస్టర్‌ అవుతుందన్నారు. పింఛన్‌ ఆధారంగా బతికే మేము అంత ఎలా కట్టగలం? - యలవర్తి నవరత్నం

డొక్కు లలితకుమారి


యలవర్తి నవరత్నం


Advertisement
Advertisement