Abn logo
Sep 15 2021 @ 03:04AM

జగన్‌ మీడియా కోర్టు ధిక్కరణ కేసులో సీబీఐ కోర్టు తీర్పు నేడు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించకముందే.. జగన్‌ మీడియా సామాజిక మాధ్యమాల్లో ‘బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత’ అంటూ వార్తను ప్రచురించిన అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన సీబీఐ కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇది జగన్‌ మీడియా అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ నిర్వహించే ఉద్యోగి తప్పిదమని ఆ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు వివరించారు.


బెయిల్‌ రద్దు పిటిషన్‌ కేసు తీర్పు వాయిదా పడిందని తెలిసిన వెంటనే దాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించామని తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ ఉద్యోగి రాజీనామా చేశారని వెల్లడించారు. ఆ వార్తను జగన్‌ మీడియా ఉద్దేశపూర్వకంగా పోస్టు చేయలేదని.. అందుచేత కోర్టు ధిక్కరణ కింద పరిగణించవద్దని అభ్యర్థించారు. వార్తను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి మానసిక ఆనందం పొందారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకటేశ్‌ కోరారు.


ఇదిలా ఉండగా, జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ1 జగన్‌, ఏ2 విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏషియా తదితర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలని కోర్టును సీబీఐ కోరింది. మంగళవారం లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఏపీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.