Abn logo
Jun 4 2020 @ 03:23AM

దళిత ద్రోహి జగన్‌

  • వైసీపీ పాలనలో ఎస్సీలపై పేట్రేగిన దాడులు: చంద్రబాబు


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ఏడాది పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెట్రేగాయి. వైసీపీ అరాచకాలు పెరిగాయి. లిడ్‌క్యాప్‌ భూముల్ని వైసీపీ నాయకులు లాక్కుకున్నారు. దళితుల అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా తీసుకున్నారు. దళిత గడ్డపై రాజధాని ఉండరాదని అమరావతిని తరలించే కుట్రలు పన్నారు. అంబేద్కర్‌ స్మృతివనాన్ని అడ్రస్‌ లేకుండా చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌లో కోతలు పెట్టి, నిధులు దారిమళ్లించారు’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆన్‌లైన్‌లో దళిత నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? పులివెందుల పంచాయితీలతో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తారా? రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేస్తారా? పోలీసుల వత్తాసుతో పేదలపై దౌర్జన్యాలు చేస్తారా? దళితుల ఇళ్లు కూల్చేస్తారా? ఆస్తులు ధ్వంసం చేస్తారా? అత్యాచారాలకు పాల్పడి, ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు చేయిస్తారా? స్నానం చేసే ఆడ బిడ్డలపై వీడియోలు తీసి వేధింపులకు పాల్పడతారా? అమాయకులను ఆత్యహత్యలకు పురికొల్పుతారా?’’ అని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి దళిత ద్రోహి అని విమర్శించారు. జగన్‌ పాలన కోతలరాయుడి పాలనను తలపిస్తోందని ట్విటర్‌లోనూ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
Advertisement