Abn logo
Jun 1 2020 @ 20:49PM

కరోనా వైరస్ తన శక్తిని కోల్పోతోంది: ప్రముఖ ఇటలీ శాస్త్రవేత్త

మిలాన్: వ్యాధిని కలిగించే శక్తిని కరోనా వైరస్ కోల్పోతోందని, వైరస్ వల్ల ప్రాణాహాని కలిగే అవకాశం చాలా వరకూ తగ్గిందని ఇటలీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోలిస్తే రోగుల నుంచి ఇటీవల సేకరించిన శాంపిళ్లలో వైరస్ కణాల సంఖ్య భారీగా పడిపోయిందని మిలాన్‌లోని శాన్ రఫేల్ ఆస్పత్రి చీఫ్ ఆల్బర్టో జాంగ్రిల్లో తెలిపారు. వాస్తవంగా వైద్యపరిభాషలో చెప్పాలంటే ఇటలీ నుంచి వైరస్ మాయమైనట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మరణాల పరంగా ఇటలీ ప్రపంచలోనే మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21 అక్కడ కరోనా అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ ఇటలీలో 33 వేల పైచిలుకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కేసుల పరంగా చూస్తే 2 లక్షల పైగా పాజిటివ్ కేసులతో ప్రపంచంలో ఇటలీ ఆరవ స్థానంలో ఉంది. మేనెలలో ఇటలీలో కరోనా మరణాలు, కొత్త కేసులు నమోదవడం నెమ్మదించడంతో దేశంలో ఆంక్షలు ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంపై కరోనా రెండో సారి విరుచుకుపడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అనవసరంగా ఆందోళన చెందుతున్నట్టు ఆల్బర్టో వ్యాఖ్యానించారు. వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ రాజకీయ నాయుకులు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement