Abn logo
Jul 31 2021 @ 00:27AM

నవీన శాస్త్రవిద్యలు తెలుగులో సాధ్యమే

తెలుగులో సాంకేతికవిద్యలు బోధించడం కొందరికి వింతగా అనిపించవచ్చు. సైన్సు తెలుగులో చెప్పేది కాదని అనుకోవడం అమాయకత్వం. విద్యార్థులకు ఇది చాలా హాయిగా ఉంటుంది. మాతృభాషల్లో ఇంజనీరింగ్, వైద్యం మొదలైన చదువులను అందించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మన సమాజాన్ని పునర్నిర్మించుకోవాలి.


‘మాతృభాషలో ఇంజనీరింగ్, వైద్యం లాంటి చదువులను అందించే కళాశాలలు ప్రతి రాష్ట్రంలో కనీసం ఒకటైనా ఉండాలని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం సాహసంతో కూడుకున్న నిర్ణయం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలి, హిందీ భాషల్లో సాంకేతిక విద్యలను అందించాలని ప్రభుత్వం ఆలోచించడం మాతృభాషా ప్రేమికులకు, విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగు మాధ్యమంలో ఉన్న చదువులన్నీ ఆంగ్లంలోకి మారిపోతున్నాయి. ఆ ఆంగ్లమైనా సరిగా వస్తోందా అంటే అదీ లేదు.


ప్రపంచంలోనే అత్యంత అధోస్థాయికి మన విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇటువంటి సంక్లిష్ట సమయంలో పెద్దలకు, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం లేక తీరొక్కవిధంగా ఆలోచిస్తున్నారు. విద్యాప్రమాణాలను పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించటానికి ఉన్న ఏకైక మార్గం మాతృభాషకు మళ్లడమే. ఆంగ్లాన్ని భాషగా మాత్రమే నేర్చుకోవచ్చు, మాధ్యమ భాషగా మన భాషే ఉండాలి. అపుడే ప్రపంచంలో భారత్‌కు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది, ఆత్మనిర్భరం చెందుతుంది.


తెలుగులో చదువుకోవడం అంటే మంచినీళ్లు తాగినట్టుగా ఉంటుంది విద్యార్థుల అనుభవం. అయితే తెలుగులో చదవడానికి ఒప్పించడమే క్లిష్టతరంగా మారుతోంది. ఆధునిక విజ్ఞానం అంతా ఆంగ్లం నుంచి కాదు, ఆంగ్లం ద్వారా వచ్చింది. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ మొదలైన పలు ఐరోపాభాషల వల్ల నూతన విజ్ఞానం వికసించింది. గెలీలియో తన ఖగోళ పరిశోధనలను ఇటాలియన్ భాషలోనే రాశారు. జీవశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన లూయి పాశ్చర్ ఫ్రెంచ్ లోనే రాశారు.


రెండవ భాషలో చదువుకుని సృజన కనపరచినవారి సంఖ్య చాలా తక్కువ. ప్రపంచంలో ఏ అబివృద్ధి చెందిన దేశమూ వారి పిల్లలకు పరాయిభాషలో చదువు చెప్పడం లేదు. బాల్యంలో ఏ భాషతో జీవితాన్ని ప్రారంభిస్తామో ఆ వ్యాకరణాన్ని మెదడు అర్థం, ఆధారం చేసుకుంటుంది. ఆ చట్రం నుంచే ఇతర భాషలను చూస్తుంది. బడి బయట మాట్లాడే భాష కాకుండా రెండో భాషలో ప్రాథమిక విద్య ప్రారంభిస్తే భాషావైకల్యం ఏర్పడుతుంది. ఆ తరువాత దీన్ని సరిదిద్దడం చాలా కష్టం. నేటి తెలుగు పిల్లలకు తెలుగు అక్షరాలు చైనీస్ అక్షరాల్లా కనిపిస్తున్నాయట. సాంస్కృతిక ఆత్మహత్య అంటే ఇదే కదా?


ఔపపత్తిక (pure), అనువర్తిత (applied), సాంకేతిక (technical) శాస్త్రాలను తెలుగులో బోధించడానికి ఎటువంటి భాషాపరమైన సమస్యలు అడ్డురావు. తెలుగు అకాడెమి ఈ రంగంలో గణనీయమైన కృషి చేసింది. ఇప్పటికే తెలుగులో జనరంజక సైన్సు పుస్తకాలు ఎన్నో అచ్చయ్యాయి. నిఘంటువులూ సిద్ధమవుతున్నాయి. కొందరు వైద్యులు ఈ రంగంలో కృషి చేస్తున్నారు. వీరి శ్రమను సంకలనం చేస్తే చాలు.


వైద్యశాస్త్రంలో 70,000కు పైగా వైద్యపారిభాషిక పదాలు ఉంటాయి. డోర్లాండ్ మెడికల్ డిక్షనరీ (32వ ప్రచురణ)లో 36,000 వైద్యపదాలకు అర్థాలు ఇచ్చింది. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వైద్యనిఘంటువుల్లో 15,000 నుంచి 80,000 వరకు సాంకేతికపదాలకు అర్థాలున్నాయి. మారియం వెబ్‌స్టర్ వైద్య నిఘంటువులో 60,000 పదాలున్నాయి. ఇవన్నీ ఏక భాషా నిఘంటువులే. అంటే ఆంగ్ల వైద్యపదాలకు ఆంగ్లంలోనే అర్థాలుంటాయి. వీటిలో శరీర భాగాలు, అవయవాలు, సూక్ష్మనిర్మాణం, జబ్బులు, లక్షణాలు, కణజాలాలు, వాటి భాగాలు, జీవకణాలలో మార్పుల వివరణ, శస్త్రచికిత్సలో పనిముట్ల నుంచి అనేక అంశాలు, ఔషధాల పేర్లు (జనరిక్) అన్నీ కలసి ఉంటాయి. ఎంబిబిఎస్ చదివే పట్టభద్రులు 20,000 వైద్యపదాలు గుర్తించగలిగితే మంచి వైద్యులు కాగలరు.


వివిధ విభాగాలను (శరీర నిర్మాణం, సర్జరీ మొదలైనవి), పలు విశిష్ట అంగాలను (కంటి వైద్యం, పంటి వైద్యం మొదలైన స్పెషాలిటీస్) పరిగణిస్తే అదనంగా మరో 40 నుంచి 50 వేల పదాలు జమ అవుతాయి. వాటన్నింటినీ మనభాషలో సృష్టించుకుని తెలుగులో విశ్వవిద్యాలయ స్థాయిలో వైద్యాన్ని బోధించటానికి అవకాశం ఉంది. మొదటిదశలో 20,000 పదాలను తెలుగులో అర్థం చేసుకోడానికి నేడు సౌలభ్యముంది. ఎంబిబిఎస్ కోర్సుకు ఇవి సరిపోతాయి. సాంకేతిక పదకోశాలు ప్రారంభంలో ఆంగ్లం-–తెలుగు ఉన్నా తరువాతి రోజుల్లో తెలుగు–-తెలుగు నిఘంటువులు తయారయ్యే రోజులొస్తాయి. 


ప్రతి వ్యాధికి లక్షణాలు ఉంటాయి. వీటిని సైన్స్ (signs), సింప్టమ్స్ (symptoms) అని రెండు తరగతులుగా విభజిస్తారు. సైన్స్ అంటే వైద్యుడు పరీక్షించి కనుగొనే లక్షణాలు. సింప్టమ్స్ అంటే రోగి వైద్యుడికి చెప్పే లక్షణాలు. వైద్యశాస్త్రాన్ని తెలుగులో చదవడం వల్ల వైద్యుడు, రోగి ఇద్దరూ లాభపడతారు. సమాచారం తప్పుల్లేకుండా నమోదవుతుంది. రోగులకు కూడా ఇదేదో మాయాప్రపంచం కాదని, తమకూ అర్థమవుతాయని తెలుస్తుంది. విద్యావంతుడయిన రోగికి వైద్యసేవలందించడం వైద్య సిబ్బందికి కూడా చాలా సులువుగా ఉంటుంది. వాస్తవంగా మనం వైద్యసాంకేతిక పదాలనుకున్న వాటిలో 10 నుంచి 20 శాతం అందరికీ తెలిసిన పదాలే ఉంటాయి. వాటి అర్థాల వివరణ చదివితే సులభంగా అర్థమవుతుంది. వైద్యం చదవడంలో వాక్యనిర్మాణం తెలుగులో ఉన్నపుడు, సాంకేతిక పదం ప్రస్తుతానికి ఆంగ్లంలో ఉన్నా, బాగా అర్థమవుతుంది. శాస్త్రం అర్థమయినపుడే వైద్యుని నైపుణ్యం కూడా పెరుగుతుంది.


గణితంలో ఎబిసి, ఎక్స్‌ వై జడ్, సున్నా నుంచి తొమ్మిది వరకూ అంకెలు మాత్రమే వాడుతూ ఎంతో ప్రగతి సాధించారు. గణితంలో పరిశోధనలకు తెల్ల కాగితాలు, కలాలు చాలు, ప్రయోగశాలలు కూడా అవసరం లేదు. ఈ పని తెలుగులో ఎందుకు చేయలేం? 1936 లోనే ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు 12,000 పదాలతో పత్రికలకోసం తెలుగు సాంకేతిక పదకోశం అచ్చువేశారు. అందులో సైన్సు పదాలు పాత్రికేయులకే కాక సైన్స్ నిపుణులకూ పనికివస్తాయి. 15000కు పైగా వైద్య సాంకేతికపదాలు తెలుగులో లభ్యమవుతున్నాయి. 1960ల నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది వైద్య నిఘంటువులు కూర్చారు, జనరంజక గ్రంథాలు రాశారు. వీటిని సమన్వయపరచి, వారి కృషిని సంకలనం చేయటానికి చాలామంది వైద్యులు సిద్ధంగా ఉన్నారు. రష్యా 1917 తర్వాత రష్యన్ భాషలోనే కృషి చేసి 50 సంవత్సరాలలోనే అమెరికాతో పోటీ పడటం లేదూ? చైనీస్ భాషలోనే చదువుకుని వారు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించటం లేదూ?


తెలుగులో పనిచేయడం ప్రారంభిస్తే సమస్యలు అవే పరిష్కారమవుతాయి. పని ప్రారంభించకుండా తెలుగులో వైద్యం, ఇంజనీరింగ్ బోధించటం అసాధ్యం అని అధిక సంఖ్యాక ఇంజనీర్లు, వైద్యులు భావిస్తారు. నేడు టర్కీలో టర్కిష్‌లో, ఇరాన్‌లో పర్షియన్‌లో వైద్యపుస్తకాలను విద్యార్థులు చదవగలుగుతున్నారు. ఎం‌బిబిఎస్ స్థాయి పుస్తకాలను తెలుగులో రాయడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే 15,000లకు పైగా వైద్య సాంకేతికపదాలు తెలుగులో లభ్యమవుతున్నాయి. తెలుగులో చదువుకోవడమంటే ఆంగ్లం వద్దని కాదు. బహుభాషలు మాట్లాడే చాలా దేశాలలో ‘మాతృభాషపై ఆధారపడ్డ బహుభాషల విద్య (Mother Tongue Based Multi-Language Education)’ను అమలు చేస్తున్నారు.


ఈ పద్ధతిలో సొంతభాష ద్వారా ప్రారంభించి రెండవ, మూడవ భాషలోనూ విద్యార్థి అభిజ్ఞాసంతులనాన్ని (consistency in cognition), ఊహాతర్క -యుక్తులను (reasoning skills) నేర్పి భవిష్యత్‌లో రెండు మూడు భాషల్లో సమాన ప్రతిభ చూపే స్థాయికి తేవడమే దీని ఉద్దేశం. భారత్‌లో విద్యార్థులకు రెండు మూడు భాషలు నేర్చుకునే సౌలభ్యం ఉంది. ప్రధానమైన విద్యలను, నైపుణ్యాలను తల్లిభాషలో మొదట నేర్చుకుని తరువాత ఆంగ్లాన్నో మరే ఇతర భారతీయ లేక ప్రపంచభాషనో నేర్చుకుంటే చాలా ప్రయోజకులవుతారు. మొదటి భాషలో విద్య లభిస్తే మనుషుల మధ్య తరతమ భేదాలు, దుర్విచక్షణ తగ్గిపోతాయి. అహం కూడా కొంత నశిస్తుంది.


తెలుగులో సాంకేతికవిద్యలు బోధించడం కొందరికి వింతగా అనిపించవచ్చు. సైన్సు తెలుగులో చెప్పేది కాదని అనుకోవడం అమాయకత్వం. విద్యార్థులకు ఇది చాలా హాయిగా ఉంటుంది. ఆంగ్లంలో చదివితే కొన్ని స్వలాభాలున్నాయి. ఇతరులను చిన్నచూపు చూడవచ్చు. మన గొప్పదనం ప్రదర్శించవచ్చు. అంతవరకే. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మన సమాజాన్ని పునర్నిర్మించుకోకపోతే మరో శతాబ్ది వరకూ ఇటువంటి సువర్ణావకాశం కలగదు, కలిగినా అప్పటికి మన తెలుగు తెలుగులా ఉండదేమో.


-డాక్టర్ ఆర్యన్