Abn logo
Aug 7 2020 @ 00:38AM

నిండా నీరున్నా.. సాగు కష్టమే!

కళ తప్పుతున్న కోట్‌పల్లి ప్రాజెక్టు 

శిథిలావస్థలో కల్వర్టులు, కాల్వలు 

మూడేళ్ల తరువాత నిండిన ప్రాజెక్టు

అలుగుపారేందుకు అడుగుదూరంలో..  

అయినా పొలాలకు నీరందేది అనుమానమే!


కోట్‌పల్లి ప్రాజెక్టు మూడేళ్ల తర్వాత నిండింది. కానీ ఆ సంతోషం రైతుల కళ్లలో కనిపించడం లేదు. ఎందుకంటే తూములు శిథిలమయ్యాయి.. కాలువలు పూడుకుపోయాయి.. దీంతో ప్రాజెక్టు నీరు వదిలినా పంట పొలాలకు చేరక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి కాలువలను ఆధునికీకరించాలని కోరుతున్నారు. 


పెద్దేముల్‌ : వికారాబాద్‌ జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు నిర్మితమైన తొలినాళ్లలో పంటపొలాలను సస్యశామలం చేసింది. అలాంటి ప్రాజెక్టు రానురాను తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఆయకట్టు మొత్తానికి సాగు నీరందించలేకపోతోంది. ప్రాజక్టు కల్వర్టులు శిథిలమయ్యాయి. కాల్వలు పూడుకుపోయి నీరు వృథా అవుతోంది. ప్రాజెక్టు నుంచి నీటిని వదిలినప్పుడు ఆ నీరు వాగులు, వంకల్లో కలిసి పంట పొలాలకు చేరడం లేదు. ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరందడం లేదు. ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం అటు పాలకులు, ఇటు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. వారి  నిర్లక్ష్యం కారణంగానే ఆయకట్టు తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 రెండు మూడేళ్లుగా వర్షాలు లేక కోట్‌పల్లి ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుత వర్షాకాలం ఆరంభంలో కురిసిన వానలకు మూడేళ్ల తర్వాత ప్రాజెక్టులోకి నీరు పూర్తిస్థాయికి చేరుకుంది. అలుగుపారేందుకు అడుగుదూరంలో ఉంది. అయినా పంటలకు నీరు అందుతుందనే నమ్మకం రైతులకు లేదు. ప్రాజెక్టు కాలువలు పూర్తిగా పాడవడం, శిథిలావస్థలో ఉన్న ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు కేటాయించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. 


వికారాబాద్‌ జిల్లాకే మణిహారంగా నిలిచిన కోట్‌పల్లి ప్రాజెక్టును పెద్దేముల్‌ మండలం కోట్‌పల్లి సమీపంలో నిర్మించారు. 1964లో మాజీ ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి కేవలం మూడేళ్లలో పూర్తిచేశారు. 1967లో ప్రారంభోత్సవం చేశారు. 9,200 ఎకరాలకు నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం 5వేల ఎకరాలకు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. 


మూడు కాలువల ద్వారా నీటి విడుదల

కోట్‌పల్లి ప్రాజెక్టు 1,784 ఎకరాల్లో విస్తరించి ఉంది. నీటి సామ ర్థ్యం 24అడుగులు. ప్రాజెక్టుకు కుడి, ఎడమ, బేబి కెనాల్‌ అనే మూడు కాలువలు నిర్మించారు. వీటి ద్వారా 18గ్రామాల్లోని పంటపొలాలకు నీరందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును నిర్మించారు. కుడి కాలువ కింద 8100 ఎకరాలు, ఎడమ కాలువ, బేబికెనాల్‌ కింద 1,100 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో కుడికాలువ కింద ధారూరు మండలంలోని నాగసమందర్‌, అల్లాపూర్‌, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టెపల్లి గ్రామాలు ఉన్నాయి. పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి, మారెపల్లి, దుగ్గాపూర్‌, రుక్మాపూర్‌, కొండాపూర్‌, ఖానాపూర్‌, రేగొండి, మదనంతాపూర్‌, జనగాం, మంబాపూర్‌, తింసాన్‌పల్లి, బుద్దారం, పెద్దేముల్‌ గ్రామాలు ఉన్నాయి. బేబికెనాల్‌ కింద నాగసమందర్‌, బూర్గుగడ్డ సగభాగం, ఎడమకాలువ కింద రుద్రారం, గట్టెపల్లి సగభాగం నీరు పారుతుండేది. ప్రస్తుతం వీటిలో చాలా గ్రామాలకు నీరందడంలేదు.


పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా సమీపంలోని పలు కళాశాలల విద్యార్థులు విహారయాత్రకు ఇక్కడికి వస్తుంటారు. సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతాయి. ఇక్కడ బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. అయితే కరోనా నేపథ్యంలో 3నెలల నుంచి బోటింగ్‌ నిలిపివేశారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా రూపుదిద్దితే ప్రజలు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి వచ్చిన పర్యాటకులు కోట్‌పల్లి ప్రాజెక్టును తిలకించే అవకాశాలు చాలా ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.


తగ్గుతున్న ఆయకట్టు

కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి రబీకి నీరు వదలకుండా ఖరీఫ్‌కు 7,500 ఎకరాలకు మొదట్లో నీరందించారు. ఆ తరువాత 1996 సంవత్సరం నుంచి బుద్దారం, తింసాన్‌పల్లి గ్రామాల్లోని 1100 ఎకరాలకు నీటిని ఇవ్వలేమని ఆయకట్టు నుంచి తొలగించారు. తరువాత ఆరుతడి పంటలకు 4,600 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలిగారు. ప్రస్తుతం 4వేల ఎకరాలకు కూడా సక్రమంగా నిరందించలేని పరిస్థితి ఏర్పడింది. కాలువలను ఆధునికీకరించక పోవడం వల్లే ఆయకట్టు తగ్గిపోతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రబీలో వేరుశనగకు నీరిచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement