Abn logo
Jan 20 2021 @ 16:59PM

నందిగ్రామ్ నుంచి సుబేందు పోటీ చేయడం లేదా?

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన బెంగాల్ సీనియర్ పొలిటీషియన్ సుబేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం లేదా? ఆ స్థానంలో వేరే వ్యక్తి ఎవరైనా పోటీ చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. ఆయనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ నుంచి పోటీకి ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా అని మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేయగానే, నందిగ్రామ్‌లో మమతాను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని సుబేందు సవాల్ విసిరారు.


అయితే తాజాగా సుబేందు చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. నందిగ్రామ్ నుంచి సుబేందు పోటీ చేయడం లేదా? మరి నందిగ్రామ్‌లో ఎవరు పోటీ చేయబోతున్నారు? సుబేందు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టికెట్ నాకు రావొచ్చు, ఇంకొకరైనా తీసుకోవచ్చు. కానీ నందిగ్రామ్ నుంచి ఎవరు పోటీ చేసినా వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను’’ అని అన్నారు. దీంతో నందిగ్రామ్ నుంచి సుబేందు పోటీ చేయట్లేదా? బీజేపీ అధిష్టానం ఆ స్థానం నుంచి ఇంకెవరినైనా దింపే ఆలోచనలో ఉందా? లేదంటే సుబేందే అక్కడి నుంచి తప్పుకున్నారా అంటూ పలువరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement