Abn logo
May 14 2020 @ 00:35AM

సాధ్యమేనా?

ఇరవై లక్షల కోట్లు అంటే చాలా పెద్ద సొమ్ము. అంకెల్లో రాస్తే, సున్నాలకు అంతు ఉండదు. కరోనా లాక్‌డౌన్‌ల వల్ల వివిధ రంగాలలో ఉత్పన్నమయిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి ఆలస్యంగా అయినా, దేశనాయకత్వం అతి పెద్ద ఆర్థిక పరికల్పన చేయగడమే సంతోషించదగ్గ విషయం. కేవలం ఉద్వేగపూరితమయిన మాటలు వల్లించడం, చప్పట్లు కొట్టడం, చప్పుళ్లు చేయడం వంటి సంకేతాత్మక చర్యలకు పిలుపులివ్వడం వంటివి కాక, నికార్సయిన, భౌతికమయిన కార్యాచరణలోకి ప్రధానమంత్రి దిగారు. ఈ ప్రత్యేక ప్యాకేజి విధివిధానాలు, దారితెన్నులు ఏమిటో, నెమ్మదిగా తెలుస్తాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రోజుకు కొంత చొప్పున సీరియల్‌గా వెల్లడిస్తారు. బుధవారం నాడు తెలిసిన వివరాల ప్రకారం, సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు సరళమైన పెట్టుబడిసాయం అందబోతున్నది. ఉద్యోగులలో ఒక శ్రేణి వారికి భవిష్యనిధి వాయిదాలను ప్రభుత్వమే మరికొన్ని నెలలు కట్టబోతున్నది. భవిష్యనిధి విషయంలో యాజమాన్యాలకు కూడా కొంత వెసులుబాటు ఇవ్వబోతున్నది. ఇంకా మరికొన్ని రాయితీలు, ఔదార్యాలు తొలివిడతలో వినిపించాయి.


ఇంత పెద్ద ధనం సహజంగానే నిశ్చేష్టులను చేస్తుంది. అందుకే, ఎవరి దగ్గర నుంచి ఏ స్పందనలూ రాలేదు. వివరాల కోసం ఎదురుచూస్తున్నవారు కొందరు, అసంతృప్తులను అణచిపెట్టుకుంటున్నవారు మరి కొందరు. ఈ ప్యాకేజీలోని 20 లక్షల కోట్లలో, దాదాపు 8 లక్షల కోట్లు ఇదివరకే రిజర్వుబ్యాంకు, కేంద్రం ప్రకటించిన వివిధ ప్యాకేజీలలోనివి. కొత్తవి తక్కిన 12 లక్షల కోట్లు మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌ వెంటనే ఆనందంతో ప్రకంపించింది కానీ, ప్రజాస్పందన ఎట్లా ఉన్నదో వెంటనే తెలిసే అవకాశం లేదు. రాష్ట్రప్రభుత్వాలు చాలా కాలంగా కోరుతున్న అంశాల ప్రస్తావన అయితే, ప్రధాని ప్రసంగంలో కానీ, నిర్మలా సీతారామన్‌ తొలి పత్రికాసమావేశంలో కానీ రాలేదు. లాక్‌డౌన్‌ ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవించేది, వాటిని నియంత్రించవలసింది రాష్ట్రాలే.


నాలుగో విడత లాక్‌డౌన్‌ ఎట్లా ఉంటుందో ఇంకా తెలియదు. కేంద్రం ఇప్పుడు నిష్క్రమణ వ్యూహం గురించి, పునరుజ్జీవనం గురించి మాత్రమే మాట్లాడుతున్నది. కానీ, లాక్‌డౌన్‌లకు కారణమైన వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుండడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి గురించిన చర్చ ఉండడం లేదు. దేనికి సమాజం సిద్ధపడాలో, ప్రభుత్వం మనసులో ఏముందో తెలియడంలేదు. ఈ స్థితిలో పునరుజ్జీవన ప్యాకేజి సామాన్యుల మనసుల్లోకి సానుకూలంగా జీర్ణం కావడం కష్టమే. కరోనా వైరస్‌వ్యాప్తి వేగం పుంజుకున్న సమయంలోనే, ఇంతకాలం అనుసరించిన కట్టడులు సడలిపోతుండడంతో దేశప్రజలు అయోమయంలో, కలవరంలో ఉన్నారు. కొవిడ్‌–19 వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పుడు దిగ్బంధనంలో జీవించి, అది ఇప్పుడు వేగం పుంజుకున్న దశలో అనేక కీలకమైన సడలింపులు ఇవ్వడం సామాన్యులకు అర్థం కావడం లేదు. విధాన నిర్ణేతలకు ఒక వ్యూహం ఉండవచ్చు, లేదా ఒక అనివార్యమైన విధానం తప్పనిసరి కావచ్చు. రాబోయే పెనువిపత్తుకు తగినట్టుగా సన్నద్ధం కావడానికి లాక్‌డౌన్‌ అవసరం అయి ఉండవచ్చు. ఇక ఎట్లాగూ వ్యాప్తి జరిగే తీరుతుందని అనుకుంటున్నప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని, ఉపాధి సంక్షోభాన్ని నివారించేందుకు సడలింపులు అవసరం కావచ్చు. మూకుమ్మడి రోగనిరోధకత ఒక్కటే మార్గమని, అందుకోసం వయసురీత్యా, ఆరోగ్యం రీత్యా యోగ్యులంతా కరోనాకు ఎదురు వెళ్లడమే శ్రేయస్కరమని భారత ప్రభుత్వం కూడా అనుకున్నదా? ఆర్థికంగా నష్టం జరుగుతుంది కాబట్టి, కట్టడులు వద్దు అని అమెరికా నేతలు బాహాటంగానే చెప్పారు. ఆరు నుంచి అరవైయేళ్ల వాళ్లు రోగాన్ని ఆహ్వానించాలని, తక్కినవారిని సంరక్షించుకోవాలని ఇజ్రాయిల్‌ బహిరంగంగానే విధాన ప్రకటన చేసింది. మన నేతల మనసులో ఏముందో పారదర్శకంగా తెలియడం లేదు. ప్రాణం ఉంటే ప్రపంచం ఉంటుంది దగ్గర నుంచి, ప్రాణం పోయినా ప్రపంచం ఉండాలి దాకా మన ప్రయాణం వచ్చిందా?


ప్రజాస్పందనలను ముందే అంచనా వేయగలిగినా, వెల్లడైన తరువాత వెంటనే గ్రహించగలిగినా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. వలసకార్మికులను స్వస్థలాలకు పంపడం విషయంలో వెంటనే స్పందించి ఉంటే, ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవ్యాప్తి నివారితమయ్యేది. విమానప్రయాణాలకు ఇచ్చినట్టు, లాక్‌డౌన్‌ ప్రకటన కంటె ముందు మూడు నాలుగురోజుల వ్యవధి ఇచ్చినా పరిస్థితి మరోలా ఉండేది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్న సమస్యలను వెంటనే పరిగణనలోకి తీసుకున్నా బాగుండేది. ఇప్పుడు, గోరంత సమస్యలూ కొండంతలు అవుతున్నాయి. అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఇటువంటి దశలో, స్వావలంబన, స్థానికత వంటి ఉదాత్త నినాదాలు ఫలితాన్నిస్తాయా? అన్నది మరో ప్రశ్న. అంతా బాగున్నప్పుడు, ఇటువంటి ఆశయాల సాధనకు పూనుకోవడం సులభమవుతుంది. కానీ, ఈ ఆశయాల విషయంలో మన పాలకులకు చిత్తశుద్ధి ఉన్నదా? చైనా నుంచి ఖాళీ చేసే కంపెనీలు మన దేశానికి తరలివస్తాయనే ఆశతో ఎదురుచూస్తూ, స్వావలంబన గురించి మాట్లాడడంలో వైరుధ్యం లేదా? ఎన్ని రాయితీలు ఇచ్చినా, తయారీ పరిశ్రమలు ఇప్పుడు ఉన్నట్టుండి గ్లోబల్‌ స్థాయికి ఎదగగలవా? చిన్నతరహా పరిశ్రమలను చిదిమివేసిందీ, వేస్తున్నది ఎవరు? పోనీ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పైకి ఎదగాలనుకుంటే, ఇది నిజంగా అవకాశమేనా? కునారిల్లిపోయిన సమయంలో, కాయకల్పచికిత్స సాధ్యమేనా? ఇవన్నీ ప్రశ్నలే, సందేహాలే. నితిన్‌ గడ్కరీ తాజాగా, కరోనా చైనా తయారీ సిద్ధాంతానికి మద్దతునిస్తున్నట్టు మాట్లాడారు. ఈ సంక్షోభకాలంలో, అమెరికా అధ్యక్ష ఎన్నికల యుద్ధ వ్యూహంలో మనం కూడా చేరబోతున్నామా అన్న అనుమానం కలుగుతున్నది.

Advertisement
Advertisement
Advertisement