Abn logo
May 2 2020 @ 01:52AM

కష్టకాలంలోనూ ఏకపక్ష వైఖరేనా?

కరోనా విషయంలో కేసీఆర్‌ ఆదినుంచీ అంతులేని నిర్లక్ష్యం చూపుతూ వచ్చారు. హెచ్చరించేందుకు ప్రయత్నించిన వారిని అవహేళన చేశారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే పారాసెటమాల్‌ గోలీ వేసుకుంటే చాలన్నారు. తెలంగాణకు కరోనా రాదన్నారు. అలా ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ నేడు మూతికి మాస్కు కట్టుకుని కనిపిస్తున్నారు. తన భద్రత చూసుకొని ప్రజల రక్షణను పట్టించుకోవడం మానేసిన కారణంగా బాధితుల సంఖ్య రెండింతలూ మూడింతలూ అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 


కరోనా వైరస్ కట్టడిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా వైరస్ బాధితుల సంఖ్య నేడు నాలుగంకెలకు చేరింది. రెండు నెలల కిందట కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మహమ్మారి నేడు రాష్ట్రమంతటికీ విస్తరించింది. వైరస్‌ నియంత్రణలో కీలకమైన వైద్యులు, సీసీఎంబీ, డీఆర్‌డీఏల్ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోకుండా అంతా తనకే తెలుసన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం ఈ దుస్థితికి కారణం. పాలనంటే పోలీసింగ్‌ అనే కేసీఆర్‌ వైఖరి కరోనా నియంత్రణలోనూ అమలు జరగడంతో మొత్తం వికటించింది. ప్రజల ప్రాణాలను హరించే, రాష్ట్ర ఆర్థిక జీవన ముఖచిత్రాన్ని విధ్వంసం చేసే ఈ కనిపించని వైరస్‌తో యుద్ధంలోనూ ఆయన అధికార దర్పాన్ని ప్రదర్శించటమే అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. 


ప్రాణాంతక వైరస్‌లను ఎదుర్కొనటం తెలంగాణ సమాజానికి కొత్త కాదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే నిజాం సర్కారు అనుసరించిన పద్ధతులు, ఆలోచనా విధానాలు ఇప్పటి తరానికీ మార్గదర్శకమే. తనకు రాజకీయంగా అవసరమైనప్పుడు మాత్రమే నిజాం నవాబును ప్రశంసలతో ముంచెత్తడం, లేదనుకున్నప్పుడు ప్రస్తావనే చేయకపోవటం కేసీఆర్‌కు తెలిసిన విద్య. తమకే అంతా తెలుసుననే అజ్జానంతో ఉన్నవారికి ఎదుటివారు చెప్పే మంచి మాటలు ఏమాత్రం రుచించవు. కరోనా విషయంలో కేసీఆర్‌ ఆదినుంచీ అంతులేని నిర్లక్ష్యం చూపుతూనే వచ్చారు. హెచ్చరించేందుకు ప్రయత్నించిన వారిని అవహేళన చేశారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదనీ, పారాసెటమాల్‌ గోలీ వేసుకుంటే చాలన్నారు. తెలంగాణకు కరోనా రాదనీ, ఒకవేళ వచ్చినా మాస్కులు కూడా కట్టుకోకుండా తనతో సహా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకు పరిమితమై వైరస్ నియంత్రణ చేస్తారని అసెంబ్లీలోనే ప్రకటించారు. అలా ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ మూతికి మాస్కు కట్టుకుని కనిపిస్తున్నారు. తన వరకూ భద్రత చూసుకొని ప్రజల రక్షణను పట్టించుకోవడం మానేసిన కారణంగా బాధితుల సంఖ్య రెండింతలూ.. మూడింతలూ అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 


కరోనా వైరస్‌ విదేశాల నుంచి వ్యాప్తి చెందిందని తెలిసిందే. అప్పట్లోనే విదేశాల నుంచి, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చినవారికి అక్కడే పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌ ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రాలకు, నెగిటివ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్కు పంపి ఉంటే పరిస్థితి చేజారేది కాదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అయా రంగాల్లో నిష్ణాతులైన వారి సూచనలు, విపక్ష నాయకుల సలహాలు తీసుకోవటం, సంప్రదింపులు చేయటం పరిపాటి. కరోనా నియంత్రణ కోసం అంతర్జాతీయ ప్రమాణాలున్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్, కిమ్స్, అపోలో వంటి ఆసుపత్రుల సీనియర్‌ డాక్టర్లతో సమావేశమై సమీక్షించాల్సి ఉంది. కానీ, ముఖ్యమంత్రి అలాంటిదేమీ చేయలేదు. వారి సలహాల మేరకు వైద్య రంగానికి సంబంధించి అవసరమయ్యే పరికరాలు సమకూర్చడంపై దృష్టి సారించకుండానే లాక్‌డౌన్ ప్రకటించేశారు. ఈరోజు అనధికారికంగా ఎన్ని వేల పాజిటివ్‌ కేసులు ఉన్నాయో తెలియని స్థితిలో పరిస్థితి. ఆకస్మిక లాక్‌డౌన్‌తో ప్రజలకు నిత్యావసరాలు సమీకరించుకోవటం కష్టమైంది. లాక్‌డౌన్‌లోనూ వారు రోజూ నిత్యావసరాల కోసం రోడ్లమీదకు రావాల్సిన పరిస్ధితి నెలకొని, దాని లక్ష్యం చెదిరిపోయింది.


హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన ఉద్యోగుల సంఖ్య గణవీయంగా ఉంది. వలస కార్మికులూ అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారి గురించిన ఆలోచనే ప్రభుత్వం చేయలేదు. వారంతా ఇక్కడ చిక్కుకుపోయారు. సదుపాయాలు లేకపోవడంతో వలన కూలీలు తమ గ్రామాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళేందుకు కూడా వలస కార్మికులు సిద్ధమయ్యారంటే వారిలో ఎంత ఆవేదన గూడుకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. పేదవాడికి రేషన్ బియ్యం పంపిణీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే చూపింది. ఈసారి పంటలు బాగా పండాయని వ్యవసాయ శాఖ ముందుగానే గుర్తించినా అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేయలేదు. ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ఎప్పుడు వెళ్లాలో చిట్టీలు ఇచ్చే ప్రక్రియ ఆచరణ సాధ్యం అయ్యే పనేనా అన్నది ప్రభుత్వం పట్టించుకోని ఫలితంగా కల్లాల్లో ధాన్యం రాసులున్నా అమ్ముకోలేని ధైన్యం రైతుల్లో నెలకొంది.


కరోనా వైరస్ దేశంలోకి, రాష్ట్రంలోకి అమాంతంగా ఊడి పడలేదు. చైనా, సింగపూర్‌, ఇటలీ, బ్రిటన్, అమెరికాలను దాటుకొని మనదేశంలోకి ప్రవేశించింది. కరోనా వైరస్ తీవ్రతకు చైనా తల్లడిల్లుతున్న సమయంలోనే సింగపూర్ సోషల్ డిస్టెన్స్‌, లాక్‌డౌన్ విధానాలతో వైరస్ సోకకుండా కట్టడి చేసుకోగలిగింది. భారత్‌కూ మినహాయింపులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వీటిని పార్లమెంటు సమావేశాల సమయంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, ముందన్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. రాష్ట్రంలోనూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం కరోనా వైరస్‌ నియంత్రణకు కార్యాచరణను సిద్ధం చేయాలంటూ కేసీఆర్‌ సర్కార్‌కు సూచించింది. అయితే కేసీఆర్‌ దీనిని గేలి చేశారు. కరోనా వైరస్ 26 డిగ్రీల వేడికి చస్తుందనీ, గోలీ వేసుకుంటే సరిపోతుందనీ చులకనగా మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే వారిని పరీక్షించాలన్న సూచనలనూ చులకన భావంతోనే చూశారు. ఇప్పుడు వైరస్ ఆకస్మికంగా వచ్చిందంటూ బుకాయిస్తున్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్షం సూచనలను ఆయన విశ్వాసంలోకి తీసుకుని ఉంటే, తెలంగాణ సమాజానికి ఈరోజు ఈ దుస్థితి దాపురించి ఉండేదికాదు. పేదవారిని ఆదుకునేందుకు వీలుగా బియ్యం, పప్పు ధాన్యాల వంటి నిత్యావసరాలను సమీకరించుకుని, ప్రతి ఇంటికీ రేషన్ ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేసుకుని ఉంటే ఈరోజు అందరికీ రేషన్ ముంగిట వద్దకే చేరేది.


ప్రభుత్వమే ఉద్యోగుల జీత భత్యాల్లో కోత విధిస్తే, ప్రైవేటు సంస్ధలు ఏం చేస్తాయన్న జ్ఞానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల్లో కోత పడేది కాదు. లాక్‌డౌన్‌లో అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతే దినసరి కూలీల గతేమిటని ఆలోచించి ఉంటే ఉపశమన చర్యలు తీసుకునేవారు. వ్యవసాయోత్పత్తుల దిగుబడికి అనుగుణంగా వాటి కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను, లారీలను, గోడౌన్లను ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పటికైనా కేసీఆర్‌ సర్కార్ భేషజానికి పోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే కాస్తయినా ఉపశమనం దక్కుతుంది. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ రేషన్ అందించే ప్రక్రియ ప్రారంబించాలి. బియ్యమే కాకుండా కందిపప్పు ఇత్యాది నిత్యావసరాలు అందించాలి.ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల్లో కోత తక్షణమే విరమించుకోవాలి. దీనిని బూచిగా చూపి ప్రైవేటు సంస్ధలూ జీతాల్లోనూ ఉద్యోగాల్లోనూ భారీ కోత విధిస్తున్న సత్యాన్ని గ్రహించాలి. తమకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్రం తన బాధ్యతనూ గుర్తించి తక్షణమే ఉద్దీపన చర్యలు చేపడితే రేపు తమ బతుకెట్లా అన్న ఆందోళన నుంచి ప్రజలు విముక్తులవుతారు.నిపుణులు, ముఖ్యులు చెప్పే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొనే లక్షణం అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంథీ ప్రమాద ఘంటికలు మోగబోతున్నాయని ఫిబ్రవరి 12వ తేదీనే హెచ్చరించారు. రాహుల్ హెచ్చరికకు నరేంద్ర మోడీ స్పందించకపోగా, ట్రంప్‌ మెప్పు కోసం అదేనెల 24న నమస్తే ట్రంప్ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు.


మార్చి 23 వరకు కొనసాగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎక్కడా సోషల్ డిస్టెన్స్, థర్మల్ స్క్రీనింగ్ అమలు కాలేదు. మాస్కులు సానిటైజర్లు ఏర్పాటు చేయలేదు. ప్రపంచ దేశాలను కరోనా కబళిస్తున్న వార్తలను పత్రికలు పతాక శీర్షికన ప్రచురిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి మార్చి 6వ తేదీన శాసనసభా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి 16వ తేదీ వరకు కొనసాగించారు. ఈ సమావేశాల్లో స్క్రీనింగ్ మిషన్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచకపోగా కరోనా గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యులను గేలి చేస్తూ మాట్లాడారు. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ సమావేశానికి విదేశీయులు పాల్గొనేందుకు అన్ని అనుమతులూ ఇచ్చింది కేంద్రమే. కానీ, కరోనా ఉపద్రవం అప్పటికప్పుడే ముంచుకొచ్చినట్టుగా నరేంద్రమోదీ మార్చి 22న జనతాకర్ఫ్యూ, మరో రెండురోజుల్లో దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. ఇలా, కరోనా విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి, నియంత్రణలో విపరీతమైన జాప్యం చేసిన మోదీ, కేసీఆర్‌లు ఇప్పుడు తామే చాంపియన్లమని చాటుకుంటూ ప్రజలను నమ్మమంటున్నారు. ప్రభుత్వ చర్యల్లో లోపాలు ఎత్తిచూపితే, విపత్తు సమయంలో రాజకీయాలా అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇస్తే, మీకు కరోనా వచ్చుగాక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అన్నీ నాకే తెలుసనుకొని, ఎవరి సలహాలు, సూచనలు స్వీకరించని ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలటం దౌర్భాగ్యం.

భట్టి విక్రమార్క 

(సీఎల్పీ నాయకులు)

Advertisement
Advertisement
Advertisement