Abn logo
Apr 28 2020 @ 00:15AM

కరోనా పోరులో అలసత్వమా?

కరోనాపై కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రజల ప్రాణాలను రాజకీయాలకోసం బలిపెట్టే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వహరిస్తున్నది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ నెలకొనివున్నదన్న సమాచారం అందుతోంది. కరోనా నెదుర్కొనే విషయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నప్పటికీ అలసత్వం పనికి రాదని ప్రధాని మోదీ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రభుత్వాధినేతగా తన బాధ్యతపై దృష్టి కేంద్రీకరించడం లేదని అర్థమవుతోంది.


పశ్చిమ బెంగాల్‌లో గత ఆదివారం నాడు డాక్టర్ బిప్లబ్ దాస్ కాంతి దాస్ గుప్తా కరోనా వైరస్ వ్యాధి వల్ల మరణించారు. ఆయన సాధారణ డాక్టర్ కాదు. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సర్వీసుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్. సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఇన్‌ఛార్జి. ఆయన ద్వారానే రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు, మాస్కులు, గ్లోవ్స్ సరఫరా అవుతాయి. 9 రోజుల క్రితం ఆయనకు కరోనా వచ్చిందని తేలింది. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చి చివరకు మృత్యువాత పడ్డారు. ఆయన భార్య, ఆయనకు చికిత్స చేసిన కుటుంబ డాక్టర్‌కు కూడా కరోనా సోకింది. ఆయన కుటుంబ సభ్యులే కాదు, ఆయనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఆరోగ్య విభాగానికి సంబంధించిన 17 మంది సిబ్బంది ఇవాళ క్వారంటైన్‌లో ఉన్నారు. డాక్టర్ బిప్లబ్ దాస్ గుప్తా వృత్తి బాధ్యతల్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషిచేస్తారని, ఒక వైద్యుడిగా ప్రజా సేవ చేసేందుకు మారుమూల గ్రామాల్లో కూడా పర్యటించేవారని, ఉచితంగా చికిత్స చేసేవారని.. ఆయన గురించి తలుచుకుంటూ అనేకమంది ఆయన సన్నిహితులు చెప్పారు. ‘మనం ఏ విభాగంలో ఉంటేనేం, ప్రాథమికంగా మనం వైద్యులం. మనం పుట్టిందే ప్రజలకు చికిత్స చేసేందుకు?’ అని డాక్టర్ దాస్ గుప్తా చెప్పేవారని వారు అన్నారు.


ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో ముందుండి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు కరోనాకు గురవుతున్నారంటే ప్రజల్లో కరోనా ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందిందో అన్న విషయం అర్థమవుతోంది. ‘రాష్ట్రంలో మరింత తీవ్రంగా పరీక్షలు జరగాలి. ఆరోగ్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పరీక్షించాలి. సరైన, తగిన వ్యక్తిగత సంరక్షణ కిట్‌లను సమకూర్చాలి. భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శక సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి’ అని పశ్చిమ బెంగాల్ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉన్నదని, వనరులు ఏ మాత్రం సరిపోవడం లేదని, ఇవాళ ఆరోగ్య సంరక్షణలో ఉన్న వారి పరిస్థితి గురించే ప్రత్యేక మెడికల్ బుల్లెటిన్లు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దుర్మార్గమైన పరిస్థితి ఏమిటంటే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం నిన్నమొన్నటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి గురించి వివరాలు బయట ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెడుతూ వచ్చింది. డాక్టర్ బిప్లబ్ దాస్ గుప్తా మరణించేవరకూ అక్కడ వైద్యులకు కూడా ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదన్న విషయం తెలియలేదు. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్నదని వివిధ రాష్ట్రాలనుంచి సమాచారం వచ్చిన ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ శాఖల బృందాన్ని పంపితే దాన్ని కూడా రాజకీయం చేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు. కరోనాపై ఇవాళ కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రజల ప్రాణాలను కూడా రాజకీయాలకోసం బలిపెట్టే దుస్థితికి ఆమె ప్రభుత్వం చేరుకున్నది.


ఇవాళ ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నదన్న సమాచారం అందుతోంది. ఏపీలో కూడా కరోనా వ్యాప్తి సామూహిక స్థాయికి చేరుకోవడంతో వైద్యులకు కూడా కరోనా సోకే పరిస్థితి ఏర్పడింది. రాజ్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో నలుగురికి వైద్య సిబ్బంది ద్వారానే కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వేయిమందికి పైగా కరోనా సోకగా అధిక కేసులు విజయవాడ, కర్నూల్, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నట్లు తేలింది. వైద్యులు, పోలీసులు, హోంగార్డు లు, వాలంటీర్లు, డ్రైవర్లు, హోటల్ యజమానులకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కర్నూలులో ఒక డాక్టర్ కరోనా వల్ల చనిపోతే గుంటూరులో మరో వైద్యుడు ఆసుపత్రి పాలయ్యారు. అనేక చోట్ల వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాడుతున్నారు. కర్నూలులో వైసీపీ ఎంపి కుటుంబంలోనే ఆరుగురికి కరోనా సోకితే వారిలో నలుగురు డాక్టర్లే. అక్కడ మర్కజ్‌కి వెళ్లిన వారికి పరీక్షలు నిర్వహించకుండా స్థానిక ఎమ్మెల్యేనే అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా కరోనా పీడితులను క్వారంటైన్‌లో పెట్టకుండా కాపాడుతున్నారని సమాచారం. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు శ్రీకాళహస్తిలో ఊరేగింపులు జరిపారు.


ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కరోనా ఇంత తీవ్ర స్థాయిలో వ్యాపించడానికి పూర్తిగా మానవ తప్పిదమే కారణమని చెప్పక తప్పదు. ముఖ్యంగా రాష్ట్రానికి సారథ్యం వహించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను అడ్డుకోవడం కష్టతరంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. కరోనాను ముఖ్యమంత్రి చాలా తేలిగ్గా తీసుకోవడమే ఇందుకు కారణం. మొదట్లో ఆయన పారసిటమల్ వేసుకుంటే కరోనా పోతుందని చెప్పారు. కరోనా చైనాలో పుట్టిందని చిన్న పిల్లవాడికి కూడా తెలిసినప్పటికీ ఈ వ్యాధి కొరియా నుంచి పాకిందని చెప్పి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ముఠా రాజకీయాలు చేసే వారికి తన ప్రాంతం, తన ప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవు. అందుకే ఆయన మనసంతా రాష్ట్రంలో ప్రత్యర్థులను ఎలా అణచివేయాలి, అన్ని ప్రాంతాలను కబళించి తన ఆధిపత్యంలోకి ఎలా తీసుకోవాలి అన్న అంశంపైనే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. దేశమంతటా కరోనా వ్యాపిస్తున్న సమయంలో అక్కడ ఆయన స్థానిక ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించడం ఇందుకు ప్రధాన నిదర్శనం. 


కరోనా నెదుర్కొనే విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అలసత్వం పనికి రాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ జగన్ ఒక ప్రభుత్వాధినేతగా తన బాధ్యతపై దృష్టి కేంద్రీకరించడం లేదని అర్థమవుతోంది. రాజకీయాలకోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టడం ఎంతవరకు సరైనది? ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించకుండా రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్నట్లుగా, కూపస్త మండూకంలా ఆలోచించే వైఖరికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎప్పుడు స్వస్తి చెబుతారు? కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశంలో ఏఏ రాష్ట్రంలో ఏఏ పరిణామాలు జరుగుతున్నాయో బాగా తెలుసు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కరోనా తీవ్రంగా పాకుతుందన్న సమాచారం అందిన తర్వాతే కేంద్రం అక్కడకు మంత్రివర్గ బృందాన్ని పంపింది.


ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కేంద్రానికి దాదాపు అదే సమాచారం అందింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తొక్కిపెడుతున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చారు. ఒక పార్టీగా ఏమి చేయాలో, ఒక ప్రభుత్వంగా ఏమి చేయాలో అన్న విషయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాలకు బాగా తెలుసు. బిజెపికి ఏమాత్రం నిలదొక్కుకునే అవకాశం లేదని అందరూ అనుకుంటున్న సమయంలో త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో పార్టీ ఏవిధంగా ఇవాళ వ్యాపించిందో జగద్విదితం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఆయన పరిపాలనను సవ్యంగా సాగించడం తనకు చేత కాదని నిరూపించుకున్నారు. ఇవాళ దేశ పరిపాలనను పూర్తిగా భుజస్కంధాలపై వేసుకున్న నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే సమస్య కాదు. కాని సమస్యలు సృష్టించుకోవడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ పనిచేస్తుంటే వాటిని ఎలా పరిష్కరించాలో కేంద్రంలోని పెద్దలకు బాగా తెలుసు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement