Abn logo
Sep 19 2020 @ 00:05AM

కాయ్‌ రాజా కాయ్‌

నేటి నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం

పందెలు నిర్వహించేందుకు సిద్ధమైన నిర్వాహకులు

ముంబై, హైదరాబాద్‌ బుకీలతో కొందరికి లింకులు

పట్టణాల నుంచి పల్లెలకు మారిన అడ్డాలు

రెండేళ్లలో పాలమూరు, జడ్చర్లలో ఒక్కో కేసు నమోదు

ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు


క్రికెట్‌ ప్రేమికులకు ఐపీఎల్‌ పండుగలాంటిది.. శనివారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండటంతో అంతటా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే, ఈ పోటీలపై బెట్టింగ్‌ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో పట్టణాల్లో కాకుండా, పల్లెల్లో అడ్డాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.. బెట్టింగ్‌లు కాసేవారికి రహస్య ఫోన్‌ నంబర్లతో పాటు కోడ్‌ భాషను ఉపయోగిస్తున్నారు.. దీనికితోడు బెట్టింగ్‌కు పాల్పడే వ్యక్తి ముందుగానే రూ.50 వేల డిపాజిట్‌ చేసేలా నిబంధన పెట్టారు.. కాగా, గతంలో బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.. టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక బృందాలు అడ్డాలను గుర్తించే పనిలో ఉన్నారు..


జడ్చర్ల, సెప్టెంబరు 18 : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పొట్టి క్రికెట్‌ మ్యాచులకు ఎంత క్రేజ్‌ ఉందో, అదే స్థాయిలో బెట్టింగ్‌ కూడా జరుగుతుంది. తాజాగా 13వ సీజన్‌ ప్రారంభం కానుండటంతో, అందరి కన్ను దీనిపైనే ఉంది. ఇప్పటికే బెట్టింగ్‌ నిర్వాహకులు రంగంలోకి దిగగా, పదెం కాసేందుకు యువతతో పాటు వ్యాపారులు రెడీగా ఉన్నారు. అయితే ఇది వరకు మాదిరి కాకుండా, ఈ సారి బెట్టింగ్‌ నిర్వాహకులు తమ రూటును మార్చారు. గతంలో పట్టణంలోనే ఏదో ఒక మూలకు అడ్డాను ఏర్పాటు చేసుకుని, కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగిస్తూ బెట్టింగ్‌లకు పాల్పడేవారు. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో, ఈ విధానానికి స్వస్తి పలికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న పల్లెలకు మకాం మారుస్తున్నారు. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బెట్టింగ్‌ నిర్వాహకుల వివరాలతో పాటు బెట్టింగ్‌లో సొమ్ము పోగొట్టుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించారని తెలిసింది.


బుకీలతో లింక్‌

ముంబై, హైదరాబాద్‌ కేంద్రాలుగా బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలతో ఉమ్మడి జిల్లాలోని కొందరు బెట్టింగ్‌ నిర్వాహకులు లింక్‌ను ఏర్పరచుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడి వద్ద ముందుగానే బెట్టింగ్‌కు పాల్పడే వ్యక్తి ఒక పేటీ (రూ.50 వేలు) డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్‌ చేసిన వ్యక్తికి కోడ్‌తో పాటు నిర్వాహకుల సీక్రెట్‌ మొబైల్‌ నంబర్‌ ఇస్తారు. పొరపాటున ఇతరుల నుంచి కాల్‌ వచ్చినా, కోడ్‌ భాషతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న అంశం బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపాజిట్‌ చేసిన సొమ్ము మొత్తం బెట్టింగ్‌లో పూర్తయితే, వెంటనే మరో పేటీని డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉంటుంది. బెట్టింగ్‌ నిర్విహించే నిర్వాహకుడి అడ్డా వద్దకు ఎవరూ రాకూడదనే నిబంధనతో పాటు ఒప్పందం ప్రకారం ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌కు మాత్రమే ఫోన్‌ చేయాలనే నిబంధనలతో బెట్టింగ్‌ నిర్వహిస్తారు.


ఐపీఎల్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌లో బంతి బంతికి, ఓవర్‌కు, ఫలానా జట్టు గెలుస్తుందని, ఓవర్‌లో వికెట్‌ పడుతుందని ప్రతి అంశంపై బెట్టింగ్‌ కాస్తారు. టీవీ చూస్తూనే బంతి బంతికి కాచే బెట్టింగ్‌కు ఒకటికి పది రెట్లు పందెం కాస్తారు. రసవత్తరంగా సాగే మ్యాచులు, పోటాపోటీగా కొనసాగే మ్యాచ్‌లో ఒటికి 15 రెట్లు బెట్టింగ్‌ కాస్తారు. అయితే, ఈ బెట్టింగ్‌లు కాచి పెద్దమొత్తంలో సొమ్ము పోగొట్టుకున్న వారే అధికంగా ఉన్నారు. అయినా యువకులు, వ్యాపారులు మాత్రం పందెం కాంచేందుకు వెనుకాడటం లేదు. ఐపీఎల్‌ సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.కోటి చేతులు మారుతాయన్న ఆరోపణలున్నాయి.


బెట్టింగ్‌పై నిఘా పెట్టాం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచాం. రెండేళ్లలో మహబూబ్‌నగర్‌, జడ్చర్లలో ఒక్కో కేసు నమోదైంది. బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడిన వారిపై దృష్టి పెట్టాం. టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.

  • - శ్రీధర్‌, డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
Advertisement