Abn logo
Dec 2 2020 @ 00:51AM

అమల్లోకి కొత్త మార్జిన్‌ నిబంధనలు

  • తగ్గనున్న ఇంట్రాడే ట్రేడింగ్‌ పరిమాణం


న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీసుకువచ్చిన కొత్త పీక్‌ మార్జిన్‌ ట్రేడింగ్‌ నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇంట్రాడే మార్జిన్‌ ట్రేడింగ్‌ కోసం, బ్రోకర్లు తమ ఖాతాదారులకు అప్పుగా ఇచ్చే మొత్తం గణనీయంగా తగ్గనుంది. ఈ చర్య స్వల్ప కాలంలో ట్రేడింగ్‌ లావాదేవీలను భారీగా దెబ్బతీస్తుందని బ్రోకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెబీ అధికారులు మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్‌ పేరుతో జరిగే భారీ స్పెక్యులేషన్‌ లావాదేవీలకు చెక్‌పెట్టేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. 


కొత్త నిబంధనలు

ప్రస్తుత మార్జిన్‌ నిబంధనలకు, కొత్త పీక్‌ మార్జిన్‌ నిబంధనల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మార్జిన్‌ ట్రేడింగ్‌ చేసే ఒక క్లయింట్‌ ఖాతాలో రూ.10,000 ఉందనుకుందాం. ఇప్పటి వరకు ఆ క్లయింట్‌ ఆ రూ.10,000 నష్టపోనంత వరకు మిగతా మొత్తాన్ని బ్రోకర్లు అప్పుగా ఇచ్చేవారు. దీనివల్ల బ్రోకర్లకు బ్రోకరేజీ రూపంలో దండిగా ఆదాయం వచ్చేది. ఉన్న పొజిషన్ల ఆధారంగా మార్జిన్‌ ఎంత? అనే విషయాన్నీ ట్రేడింగ్‌ రోజు చివర్లో బ్రోకర్లు నిర్ణయించేవారు. మంగళవారం నుంచి సెబీ దీనికి గుడ్‌బై చెప్పింది. ఇక నుంచి ట్రేడింగ్‌ డే మొత్తం మీద స్టాక్‌ ఎక్స్ఛేంజీలే నాలుగు సార్లు ర్యాండమ్‌ పద్దతిలో స్నాప్‌షాట్స్‌ తీసుకుని పీక్‌ మార్జిన్‌ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. 


మరింత భారం 

ప్రస్తుతం 25 శాతంగా ఉన్న పీక్‌ మార్జిన్‌ మొత్తాన్ని నాలుగు దశల్లో 100 శాతానికి పెంచుతారు. అటు ఖాతాదారులతో పాటు బ్రోకర్లకూ ఇది భారం కానుంది. సెబీ నిబంధనల ప్రకారం 2020 డిసెంబరు 1 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు మార్జిన్‌ ట్రేడింగ్‌ చేయాలనుకునే వ్యక్తి ఖాతాలో 25 శాతం అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌ నిధులు ఉండాలి. లేకపోతే అతడి లావాదేవీ పూర్తి కాదు. 2021 మార్చి 1 నుంచి దీన్ని 50 శాతానికి,  జూన్‌ 1 నుంచి 75 శాతానికి, సెప్టెంబరు 1 నుంచి 100 శాతానికి పెంచుతారు. 


Advertisement
Advertisement
Advertisement