Abn logo
Sep 22 2021 @ 00:57AM

ఎంపీపీ పదవులకు తీవ్ర పోటీ

తిరుపతి(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల్లో జరగనున్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ఏర్పాటైంది మొదలు ఇప్పటి వరకూ అధికారానికి, పదవులకూ నోచుకోని కారణంగా ఎంపీటీసీలుగా గెలిచిన పలువురు ఈ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు. దీంతో పలు మండలాల్లో అధికార పార్టీలో వర్గ రాజకీయాలు జోరందుకుంటున్నాయి. పదవులకు వున్న డిమాండును దృష్టిలో వుంచుకుని కొన్ని చోట్ల మండల, నియోజకవర్గ స్థాయి కీలక నాయకులు ఆశావహులతో బేరాలకు సైతం దిగుతున్నారు. మరికొన్ని చోట్ల ఆశావహులు బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఇంకొన్ని మండలాల్లో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబాలు సైతం అవకాశాల కోసం పోటీని ఎదుర్కొనాల్సి వస్తోంది.


రామసముద్రంలో పదవి కోసం బేరాలు

రామసముద్రం మండలంలో ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వయింది. పేరుప్రఖ్యాతులున్న ఓ వైద్యుడి సతీమణికి మండలస్థాయి నాయకులు ఎంపీపీ పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చినట్టు తొలి నుంచీ ప్రచారంలో వుంది. ఆ మాట నమ్ముకుని వారు ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. ఆ వైద్యుడు సైతం గతంలో కూడా వైసీపీ తరపున సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఓడిపోయిన కారణంగా పార్టీలోనూ, ప్రజల్లోనూ పుష్కలంగా సానుభూతి కలిగివున్నారు. మరో మూడు రోజుల్లో ఎంపీపీ సీట్లో కూర్చోవడమే తరువాయి అన్న చందంగా నిశ్చింతగా వున్న వైద్యుడి కుటుంబానికి తాజాగా షాక్‌ ఎదురైనట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కీలక నేత తాను మండలంలో పర్యటించినపుడు ఎప్పుడూ తనకు కనిపించలేదంటూ ఇపుడు అభ్యంతరం లేవదీసినట్టు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని మండలంలోని ఓ నాయకుడు రూ. 6 లక్షలు ముట్టజెబితే పదవి ఖరారు చేయిస్తానంటూ బేరాలకు దిగారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


వరదయ్యపాలెంలో క్యాంపు రాజకీయం

వరదయ్యపాలెం మండలంలో ఎంపీపీ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ ఎంపీపీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. మండల పార్టీ కన్వీనర్‌ దయాకర రెడ్డి సతీమణి హేమలత మరదవాడ నుంచీ, మరో మండల ముఖ్యనేత దామోదరరెడ్డి సతీమణి పద్మప్రియ కడూరు నుంచీ ఎంపీటీసీలుగా గెలిచారు. ఈ నేతలిద్దరూ ఎంపీపీ పదవి తన భార్యకు కావాలంటే తన భార్యకు కావాలని పోటీ పడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ వున్న తనకు అవకాశం ఇవ్వాలని దయాకరరెడ్డి కోరుతుండగా పార్టీ కోసం ఆర్థిక భారం మోసిన తనకు ఛాన్సు ఇవ్వాలని దామోదరరెడ్డి కోరుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా గత పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి, ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించినా కూడా మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి దక్కడంతో ఛాన్సు కోల్పోయిన తనకు ఇపుడైనా న్యాయం చేయాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలిసింది. నియోజకవర్గ ముఖ్యనేత అంతర్గతంగా ఓ వర్గానికి మద్దతు ఇస్తున్నప్పటికీ బహిరంగంగా చెప్పే పరిస్థితి లేనందున మీలో మీరే తేల్చుకోండంటూ వారికే వదిలిపెట్టినట్టు సమాచారం. దీంతో దామోదరరెడ్డి మొత్తం 13 మంది వైసీపీ ఎంపీటీసీల్లో పదిమందిని తనవైపు తిప్పుకున్నట్టు చెబుతున్నారు. వారిని స్థానికంగా అందుబాటులో వుంచితే ఏమవుతుందోనన్న భయంతో టూరు పంపినట్టు తెలిసింది. దీంతో ఈ మండలంలో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ జిల్లా మంత్రి జోక్యం అనివార్యం కానుంది.


బంగారుపాలెంలో మాజీ జమీందారు కుటుంబానికి పోటీ

బంగారుపాలెం మండలంలో ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించారు. మాజీ జమీందారు కుటుంబానికి చెందిన జడ్పీ మాజీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కుమారరాజా సతీమణి పద్మావతికి ఎంపీపీ పదవి ఇవ్వాలని నామినేషన్లకు ముందే నియోజకవర్గ ముఖ్యనేత నిర్ణయించినట్టు సమాచారం. అది కూడా పార్టీ సమావేశంలోనే. ఆ హామీతోనే కుమారరాజా నామినేషన్ల దశలోనే 12 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా గెలిపించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో మూడు రోజుల్లో ఎంిపీపీ ఎన్నికలు జరగాల్సివుండగా ఇపుడు పరిస్థితి మారింది. మండలంలో ఓ ముఖ్యనేత పద్మావతికి కాకుండా అదే సామాజికవర్గానికి చెందిన వేరొక మహిళకు ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో నియోజకవర్గ నేత కూడా ప్లేటు ఫిరాయించినట్టు చెబుతున్నారు. దీంతో కుమారరాజా వర్గం ఓ మంత్రిని ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల పట్ల మాజీ జమీందారు కుటుంబం ఆవేదనతో వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొనివుంది. రానున్న రెండుమూడు రోజుల్లో మరెన్ని వివాదాలు పుట్టుకొస్తాయో, వాటి పర్యవసానాలు పార్టీపై ముందుముందు ఎలా వుంటాయోనన్నది వేచి చూడాల్సివుంది.