Abn logo
Oct 16 2020 @ 05:19AM

పేదల్లో కొందరికే బీమా

Kaakateeya

కుటుంబంలో ఒక్కరికే ధీమా

పరిహారం మొత్తమూ తగ్గింపు

వైఎస్సార్‌ బీమాతో ఒరిగేది లేదు

చంద్రన్న బీమాతో పోలికే లేదు

పెదవి విరుస్తున్న జిల్లా పేదలు


కర్నూలు (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించారు. ప్రభత్వాన్ని ఏర్పాటు చేశాక నిబంధనల పేరిట కొర్రీలు  పెడుతూ పథకాలను దూరం చేస్తున్నారు. దీంతో చాలామంది కొత్త పథకాలకు దూరం అవుతున్నారు. దీనికితోడు గత ప్రభుత్వంలో పొందిన లబ్ధిని కూడా కోల్పోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ బీమా’ పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం పేద ప్రజలకు అరకొర లబ్ధినే చేకూర్చేలా ఉంది. వాస్తవానికి టీడీపి ప్రభుత్వం ‘చంద్రన్న బీమా’ పేరిట అప్పట్లోనే రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు వర్తింపజేసింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని వైఎస్సార్‌ బీమా పేరిట పేరు మారి ప్రజల ముందుకు తెచ్చింది. కొత్త నిబంధనలతో వచ్చిన ఈ పథకంతో లబ్ధిదారులకు లాభం కంటే నష్టమే ఎక్కువే జరుగుతోంది.


గతంలో రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలో 18 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు వారికి ‘చంద్రన్న బీమా’ వర్తించేది. ప్రస్తుత పథకం బియ్యం కార్డుదారుల కుటుంబంలోని సంపాదనాపరుడైన వ్యక్తికి మాత్రమే వర్తిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంపై పేదలు పెదవి విరుస్తున్నారు. చంద్రన్న బీమాతో రేషన్‌ కార్డుదారుల కుటుంబానికి భరోసా ఉండేదని, కుటుంబ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బీమా పథకంతో ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కుటుంబంలో ఒకరికే..

చంద్రన్న బీమా పథకం పేరును మాత్రమే కాదు, నిబంధనలను కూడా మార్చేశారు. గతంలో బియ్యం, పింఛన్లు, స్కాలర్‌ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర  ఫలాలకు తెల్ల రేషన్‌ కార్డును అర్హతగా పరిగణించేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలకు వేర్వేరుగా అర్హత కార్డులను మంజూరు చేసింది. బియ్యానికి కూడా ప్రత్యేకంగా కార్డులు జారీ చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో  రూ.1.44 లక్షల కంటే తక్కువ ఉన్న వారు మాత్రమే బియ్యం కార్డులకు అర్హులు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులు రూపొందించిన జాబితా ప్రకారం జిల్లాలో 12,23,162 కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయి. వీరిలో కుటుంబ పెద్దకు మాత్రమే వైఎస్సార్‌ బీమా వర్తిస్తుంది. బీమా పరిహారం చెల్లింపులో టీడీపీ ప్రభుత్వం అందించిన దానికంటే తక్కువగానే చెల్లించే విధంగా పథకానికి మార్పులు చేశారు. వైయస్సార్‌ బీమాలో 18 నుంచి 50 ఏళ్ళ వయసులోపు వారు సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందినా లేదా అంగవైకల్యం ఏర్పడినా రూ.5 లక్షలు చెల్లిస్తారు. 51 నుంచి 70 ఏళ్ళ వారు సహజంగా మరణిస్తే ఎటువంటి పరిహారం చెల్లించరు. 51 నుంచి 70 ఏళ్ళ వయసులోపు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు చెల్లిస్తారు.


అందరికీ చంద్రన్న బీమా..

తెలుగుదేశం ప్రభుత్వం 2016 అక్టోబరు 2న చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఏడాదికి కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే చాలు. 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు సహజంగా మరణిస్తే బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు, 51 నుంచి 60 ఏళ్ళ మఽధ్య వారికి 30 వేల రూపాయలు, 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం అందేది. 18 నుంచి 70 సంవత్సరాలలోపు వారు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే రెండున్నర లక్షల రూపాయలు అందేది.


వైఎస్సార్‌ బీమా, చంద్రన్న బీమా పథకాల్లో తేడాలు

సభ్యులు సహజ మరణం ప్రమాద మరణం/ పూర్తి అంగవైకల్యం

వయస్సు వైఎస్సార్‌ బీమా చంద్రన్న బీమా వైఎస్సార్‌ బీమా చంద్రన్న బీమా

18-50 రూ. 2 లక్షలు రూ. 2 లక్షలు రూ. 5 లక్షలు రూ. 5 లక్షలు

51-60 పరిహారం లేదు రూ. 30 వేలు రూ. 3 లక్షలు రూ. 5 లక్షలు

61-70 పరిహారం లేదు పరిహారం లేదు రూ. 3 లక్షలు రూ. 5 లక్షలు


(చంద్రన్న బీమా పథకం ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండిన 70 ఏళ్ల లోపు వారందరికీ వర్తించేది. వైఎస్సార్‌ బీమా పథకం ఒక కుటుంబంలో సంపాదన పరుడైన ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది.)


పేదలకు అన్యాయం..

చంద్రన్న బీమా పేరును మార్చినా పరవాలేదు. కానీ ను చంద్రన్న బీమా పథకంలో ఉన్న లబ్ధిని తొలగించడం అన్యాయం. కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే బీమా వర్తించేలా చేయడం సరికాదు. కుటుంబంలోని ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా, మృతి చెందినా గత ప్రభుత్వ పథకం ఆసరాగా నిలిచేది. ప్రస్తుత ప్రభుత్వం కూడా పేదలను ఆదుకునేలా బీమా పథకంలో మార్పులు చేస్తే బాగుంటుంది.

 కె. జయమ్మ, గృహిణి, పాణ్యం  

Advertisement
Advertisement