Abn logo
Aug 7 2020 @ 03:55AM

పురిట్లోనే ‘చంపేశారు’

  • సృష్టి కుంభకోణంలో తాజాగా మరో చీకటి కోణం

మహారాణిపేట(విశాఖ సిటీ), ఆగస్టు 6: పండంటి బిడ్డను దాచేశారు. పురిట్లోనే ఆ బిడ్డ పోయిందని కన్నతల్లిని నమ్మించారు. ఆ తరువాత కొన్ని లక్షల రూపాయలకు పిల్లలు లేని దంపతులకు అమ్మేసుకొన్నారు. ‘సృష్టి’ పసికందుల విక్రయం కేసులో తాజాగా వెలుగుచూసిన మరో చీకటి కోణం ఇది! ఈ వ్యవహారంలో విశాఖపట్టణం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి ఎండీ పద్మజతోపాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను గురువారం విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిసినదాని ప్రకారం.. విశాఖ జిల్లా పీ భీమవరానికి చెందిన వెంకటలక్ష్మి(25) గర్భవతి. చోడవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెకప్‌ కోసం ఆమె వచ్చిపోతుండేవారు. ఈ క్రమంలో ఆ ఆస్పత్రి నర్సు నేమాల నూకరత్నం పరిచయం అయ్యారు. సృష్టి ఆస్పత్రి గురించి వెంకటలక్ష్మికి ఆమె చెప్పారు. అక్కడ ప్రసవం బాగా చేస్తారని,  ఒకవేళ సిజేరియన్‌ చేయాల్సి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా.. అంతా వారే చూసుకొంటారని నమ్మించారు. ఇది నిజమేనని వెంకటలక్ష్మి నమ్మారు. నూకరత్నం, సృష్టి ఆస్పత్రి మధ్యవర్తి రామకృష్ణ.. గత జనవరి 29వ తేదీన వెంకటలక్ష్మిని సృష్టి ఆస్పత్రిలో కాన్పు కోసం చేర్పించారు.


అక్కడ ఆమెకు ప్రీ డెలివరీ అయింది. దీంతో ఆపరేషన్‌ చేయాలంటూ వెంకటలక్ష్మిని సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి తరలించారు. అదే నెల 31వ తేదీన ఆ ఆస్పత్రి ఎండీ చేకూరి పద్మజ పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరిగింది. బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పడంతో, పుట్టెడుదుఃఖంతో ఫిబ్రవరి 3న వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లింది. కానీ, ఆమెకు పుట్టిన బిడ్డ(ఆడ)ను విజయనగరానికి చెందిన దంపతులకు రూ.13 లక్షలకు అమ్ముకొన్నారు. సృష్టి కుంభకోణం ఇటీవల బయటపడటంతో అనుమానంపై వెంకటలక్ష్మి గతనెల 30వ తేదీన విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తుచేసిన పోలీసులు, ఈ కేసులో పద్మజ ఆస్పత్రి పద్మజ, నర్సు నూకరత్నంను అరెస్టుచేసినట్టు సీపీ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement