Abn logo
Oct 18 2020 @ 14:24PM

అన్నీ సిద్ధంగా ఉన్నా.. కనిపించని కొత్త పరిశ్రమల జాడ

Kaakateeya

ప్రభుత్వ ప్రోత్సాహం లేక ముందుకు రాని పారిశ్రామికవేత్తలు 

ఆల్విన్‌ స్థానంలో పరిశ్రమల ఏర్పాటు జరిగేనా..


రాజంపేట: జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినప్పటికీ అందుకు తగ్గట్టు ప్రోత్సాహం లేకపోవడంతో కొత్త పరిశ్రమలు పెట్టే అవకాశాలు కానరావడం లేదు. మండల కేంద్రమైన నందలూరులో గతంలో రైల్వే లోకోషెడ్‌తో పాటు ఇక్కడ ఆల్విన్‌ కర్మాగారం ఉండేది. ఈ కర్మాగారంలో సుమారు 800 మంది కార్మికులు పనిచేసేవారు. ఇక్కడ తయారు చేసే రిఫ్రిజిరేటర్లు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. 1984వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆల్విన్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 1987వ సంవత్సరంలో ఈ కర్మాగారాన్ని ప్రారంభించారు. మొత్తం 800 మంది సిబ్బంది పనిచేసేవారు. 1983లో దీనిని ప్రభుత్వ రంగసంస్థగా గుర్తించారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల 1999లో వోల్టాస్‌, 2001లో  ఎలకో్ట్రలక్స్‌ వారికి దీనిని అప్పచెప్పారు.


అయితే పరిశ్రమను అనేక కారణాల వల్ల 2004వ సంవత్సరంలో మూసివేశారు. 305 ఎకరాలు స్థలంలో ఆల్విన్‌ కర్మాగారం ఉంది. దివంగత మాజీ మంత్రి బండారు రత్నసభాపతి నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుని ఒప్పించి ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయించారు. పరిశ్రమ ఏర్పాటుతో ఎంతోమందికి ఇక్కడ ఉపాధి లభించడంతో పాటు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఒక చిన్న మండల కేంద్రం పరిశ్రమల ఖిల్లాగా వర్ధిల్లింది. అయితే ప్రతికూల పరిస్థితులలో ఈ పరిశ్రమను 2004లో మూసివేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం బోసిపోయింది. చెన్నై-ముంబై ప్రాంతాలకు ప్రధాన రైలు, రోడ్డు మార్గాలకు అనుసంధానం చేసి ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనేక అవాంతరాల మధ్య దీనిని మూసివేశారు. అయితే ప్రస్తుతం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ ఆల్విన్‌ కర్మాగారాన్ని ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఉన్నారు. అయితే ఆ ప్రైవేటు వ్యక్తులు కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. కొత్త పారిశ్రామిక వేత్తలు ఈ స్థలం కోసం వస్తున్నా ఎక్కువ ధర చెబుతుండటంతో కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రెండేళ్ళ కిందట ఈ ఆస్తిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వినియోగించేందుకు కొందరు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.


కొత్త పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికే ఈ భూమిని అమ్మాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడానికి ఈ స్థలం అమ్మితే ఊరుకునేది లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఇదే స్థలంలో కొందరు కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొత్త పరిశ్రమ పెట్టుకోవడానికి ప్రధానంగా అటు రైలు, ఇటు రోడ్డు మార్గానికి దగ్గరగా వందల ఎకరాల భూమి, అనుకూల వాతావరణం, కార్మికులకు క్వార్టర్లు ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి. మొత్తం భూమికి చుట్టూ ఫెన్సింగ్‌ ఉంది. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు అన్ని హంగులు రెడీగా ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ కాలంలో ఇక్కడ పరిశ్రమను వెనువెంటనే ఏర్పాటు చేయవచ్చు. రాయలసీమ ప్రాంతంలో తగినన్ని పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమలు పోయి చదువుకున్న వారు నిరుద్యోగులుగా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో, రేణిగుంట విమానాశ్రయానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో, కడప విమానాశ్రయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఆల్విన్‌ స్థలం ఉంది. ఇన్ని వసతులున్న నందలూరులో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement