Abn logo
Dec 2 2020 @ 00:20AM

రోడ్డెక్కిన రైతులకు ఆర్థిక సాయం ప్రకటించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్

బెర్లిన్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ఇప్పటికే రైతుల నిరసనకు మద్దతు తెలిపి ప్రభుత్వం కొత్త చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇదే నేపథ్యంలో జర్మనీలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కూడా రైతులకు తమ సంఘీభావాన్ని తెలిపింది. అంతేకాకుండా ఉద్యమంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ‘రైతుల ఆసుపత్రుల ఖర్చులు, వారి పిల్లల చదువు, మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇందుకోసం మా సోషల్ మీడియా మెంబర్ల సాయం కోరాం. అందరం కలిపి రూ. కోటిని విరాళం ఇవ్వాలని డిసైడ్ అయ్యాం’ అని ఐఓసీ జర్మనీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ తెలిపారు. కాగా.. హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చెందిన రైతు సంఘాల నేతలతో మంగళవారం కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. డిసెంబర్ 23న రైతులతో మరోమారు భేటీ కానున్నట్టు నరేంద్ర సింగ్ తోమార్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement