Abn logo
May 22 2020 @ 11:32AM

రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన‌ భార‌తీయ న‌ర్సు.. యూఏఈలో...

యూఏఈ:  మ‌హ‌మ్మారి క‌రోనాతో పోరాడుతున్న యూఏఈలో భార‌తీయ మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స్నేహ‌పూర్వ‌క సంబంధాల దృష్ట్యా భార‌త ప్ర‌భుత్వం యూఏఈకి రెండు వైద్య బృందాల‌ను సైతం పంపించిన సంగ‌తి తెలిసిందే. ఇలా భార‌తీయ వైద్యులు, న‌ర్సులు, మెడిక‌ల్ సిబ్బంది త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి కోవిడ్‌తో పోరాడుతున్న యూఏఈకి అండ‌గా నిలుస్తున్నారు. ఇదిలాఉంటే... యూఏఈలో క‌రోనా బాధితుల‌కు ఫ్రంట్‌లైన్ వైద్య ఉద్యోగులు చేస్తున్న సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారితో 'షేక్ వర్చువల్ మజ్లిస్' పేరిట వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్, ఫ్రంట్‌లైన్ వైద్య ఉద్యోగులు క‌రోనా బాధితుల‌కు చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడుతూ వారికి ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 


ఇలాగే యూఏఈలో ఉండే భార‌తీయ న‌ర్సు అరుణ్ పుల్లికోట్టు ఈపెన్‌కు కూడా క్రౌన్ ప్రిన్స్ వీడియో కాల్ చేసి ప్ర‌శంసించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌డంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు. ఇరుగు పొరుగు వారు ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దీంతో ఈపెన్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... "ఇది జీవితకాలపు అవకాశానికి ఒకసారి దేవుని నుండి వచ్చిన వరం.", "దేవుని ఆశీర్వాదం ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు. హైనెస్ షేక్ మొహమ్మద్‌తో కలిసి సంభాషించడం అనేది అందరి కల" అని అన్నారు. "యూఏఈలో వేలాది మంది నర్సులు ఉన్నారు, ఇప్పటికీ నాకు ఆ అవకాశం లభించింది. ఇది ఫ్రంట్‌లైన్ వైద్య ఉద్యోగులందరికీ గౌరవం. నేను వీడియోను చాలాసార్లు చూశాను." అని ఈపెన్ చెప్పారు. ఇదిలాఉంటే... యూఏఈలో విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 237 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 26,989 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement