Abn logo
May 21 2020 @ 17:54PM

అమెరికాకు చెందిన 100 కంపెనీలపై భారత్ కన్ను

బీజింగ్: కరోనా మహమ్మారికి చైనానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు చైనాపై మాటల యుద్దం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా చైనాపై టారిఫ్‌లు కూడా భారీగా పెంచేందుకు సిద్దమవుతున్నారు. అమెరికాతో పాటు ప్రపంచదేశాలు కూడా కరోనాకు చైనానే కారణమని నమ్ముతున్నాయి. ఇదే సమయంలో అనేక దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తమ యూనిట్లను చైనా నుంచి వేరే దేశానికి తరలించేదుందుకు సిద్దపడుతున్నాయి. జపాన్‌ ఇప్పటికే అనేక కంపెనీలను చైనా నుంచి వేరే దేశానికి తరలించింది. ముఖ్యంగా అమెరికా - చైనాల మధ్య వైరం ఎక్కువగా ఉండటంతో.. అమెరికన్ కంపెనీలు చైనా నుంచి తమ కంపెనీలను వేరే దేశానికి తరలించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన కంపెనీలను చైనా నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికాకు చెందిన 1000 కంపెనీలపై భారత్ కన్ను వేసినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ మిషన్ల ద్వారా భారత ప్రభుత్వం ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా నుంచి బయటకు వచ్చే తయారీదారులకు ఇన్‌సెంటివ్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ సప్లైయర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో పార్ట్ తయారీదారులకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో దేశంలో పెట్టుబడులు చాలా అవసరమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో.. దేశంలో తక్షణమే ఉద్యోగాలను కల్పించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోపక్క విదేశీ కంపెనీలు భారత్‌లోకి వచ్చేందుకు కార్మిక చట్టాలు అడ్డుపడుతున్నాయి. దీంతో కార్మిక చట్టంలోనూ సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చైనా నుంచి అమెరికా, జపాన్‌లకు కంపెనీలు తరలి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారత్‌కు వస్తే కలిగే ఉపయోగాలను ఆయా కంపెనీలకు వివరిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement