Abn logo
Sep 26 2021 @ 16:03PM

చైనా తీరు నిరాశాజనకం : భారత్

న్యూఢిల్లీ : చైనాలో చదువుతున్న, పని చేస్తున్న భారతీయులు, వారి కుటుంబ సభ్యులు కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత దేశంలో చిక్కుకున్నారు. వీరిని తమ దేశానికి అనుమతించే విషయంలో చైనా తాత్సారం చేస్తోంది. వీరిపట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. మానవతావాద అంశంపై అశాస్త్రీయ వైఖరిని చైనా ప్రదర్శిస్తోందని భారత్ నిస్పృహ వ్యక్తం చేసింది. 


చైనాలో చదివే దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు, ఆ దేశంలో వ్యాపారం చేసేవారు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు స్వదేశంలో చిక్కుకున్నారు. 2019లో మొదట చైనాలో కోవిడ్-19 మహమ్మారి కనిపించడంతో వీరంతా భారత దేశానికి వచ్చారు. ఇప్పుడు వీరు తిరిగి చైనాకు వెళ్ళాలనుకుంటున్నారు. అయితే వీసా ప్రాసెస్‌ను, భారత దేశం నుంచి విమానాలను చైనా సస్పెండ్ చేసింది. కోవిడ్-19 మహమ్మారిని సాకుగా చూపుతోంది. 


ఈ నేపథ్యంలో సెప్టెంబరు 23న చైనా-భారత్ సంబంధాలపై వర్చువల్ విధానంలో చర్చ జరిగింది. స్వదేశంలో చిక్కుకున్న భారతీయుల కష్టాలను చైనాకు భారత రాయబారి విక్రమ్ మిస్రి వివరించారు. తక్కువ సంక్లిష్టత కల అంశాల పట్ల మరింత సమతుల్యమైన, సున్నితమైన వైఖరిని ప్రదర్శించాలని కోరారు. ఈ సమస్యలు పూర్తిగా మానవతావాద సంబంధమైనవన్నారు. ద్వైపాక్షిక దౌత్య వైఖరులతో వీటికి సంబంధం లేదన్నారు. ఒకటిన్నర సంవత్సరాల నుంచి భారత దేశంలో చిక్కుకున్న విద్యార్థులు, వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఏర్పడిన విభేదాల ప్రభావం వ్యాపార, వాణిజ్య సంబంధాలపై పడకుండా భారత్ చర్యలు తీసుకుందని చెప్పారు. చైనీస్ వ్యాపారులు భారత దేశానికి వచ్చేందుకు వీసాలను జారీ చేస్తున్నామన్నారు. భారతీయ విద్యార్థులు, వ్యాపారులు, మెరైన్ సిబ్బంది, ఎగుమతిదారులు వంటివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చైనా అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం నిరాశాజనకంగా ఉందని తెలిపారు. 


ఈ వర్చువల్ డయలాగ్‌కు కో-హోస్ట్‌లుగా సిచువాన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అధ్యయనాల స్కూల్, చైనా దక్షిణాసియా అధ్యయనాల కేంద్రం, మనోహర్ పారికర్ రక్షణ రంగ అధ్యయనాలు, విశ్లేషణల సంస్థ వ్యవహరించాయి.