Abn logo
Oct 9 2021 @ 23:58PM

పెరిగిన తీవ్రత!

జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో, బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

జిల్లాలో పెరిగిన జ్వరాల తీవ్రత

భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

పీహెచ్‌సీల పరిధిలో లేని సిబ్బంది

కలెక్టర్‌ ఆధ్వర్యంలో జ్వరాలపై సమీక్ష

ప్రజలకు అవగాహన కల్పించేందుకు సబ్‌ సెంటర్ల వారీగా బృందాల ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

నిజామాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో జ్వరాలు, వ్యాధుల తీవ్రత పెరిగింది. డెంగ్యూ, టైఫాయిడ్‌తో ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ ముందుగా అప్రమత్తం కాకపోవడం, స్థానిక సంస్థల్లో దోమల నివారణ చేపట్టకపోవడం వల్ల జ్వరాలు బాగా పెరిగాయి. రెండేళ్ల తర్వాత డెంగ్యూ కేసులు పెరగడంతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో పీహెచ్‌సీల పరిధిలో చర్యలు చేపట్టకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కేసులు బాగా పెరగడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చికిత్స అందించడంతో పాటు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

నెలన్నర రోజులుగా పెరిగిన తీవ్రత

జిల్లాలో గడిచిన నెలన్నర రోజులుగా వ్యాధుల తీవ్రత భారీగా పెరిగింది. జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్‌తో పాటు ఇతర వ్యాధుల బారినపడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో దోమలు పెరగడం వల్ల జ్వర తీవ్రత పెరగడంతో ఎక్కువ మంది ఆసుపత్రులపాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కొంతమందికి జ్వరాలు వచ్చిన సమయంలో గుర్తించకపోవడం, చికిత్స సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగి ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయి. చికిత్స కోసం ఇలాంటి వారికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు వేలాదిమందికి జ్వరాలు వచ్చాయి. డెంగ్యూ కేసులు కూడా ఈ సంవత్సరం భారీగా పెరిగాయి. జిల్లాలోని గ్రామాలకంటే నిజామాబాద్‌ నగరం పరిధిలోనే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. డెంగ్యూతో పాటు టైఫాయిడ్‌ కేసులు నిజామాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా డెండ్యూ కేసులు 264 నమోదయ్యాయి. వీటిలో 160 కేసులు నిజామాబాద్‌ నగరం పరిధిలోనే వచ్చాయి. నగరంలోని అర్సపల్లి, సారంగపూర్‌, చంద్రశేఖర్‌కాలనీ, సీతారాంనగర్‌, ఎడపల్లి, పోచంపాడ్‌, కమ్మర్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువ వచ్చాయి. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు వచ్చాయి. గత సంవత్సరంకంటే ఈ సంవత్సరం కేసుల తీవ్రత పెరిగింది. జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు కేసులు ఎక్కువ రావడంతో నిత్యం ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. పీహెచ్‌సీల పరిధిలో కూడా జ్వరాలతో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో డెంగ్యూ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలో పర్యటించిన ఎంటమాలజిస్ట్‌లు

జిల్లాలో జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో రాష్ట్ర ఎంటమాలజిస్ట్‌లు జిల్లాలో పర్యటించారు. నగర కార్పొరేషన్‌ బోధన్‌, పోచంపాడ్‌, కమ్మర్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో శాంపిళ్లు సేకరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో ఎడిస్‌ దోమలు ఎక్కువగా ఉన్నాయని, వీటి లార్వాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదించారు. గడిచిన నెలన్నరగా కేసులు పెరుగుతున్నందున సత్వర చర్యలు చేపట్టకుంటే కేసులు పెరిగే అవకాశముందని ప్రభుత్వనికి నివేదించారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

వైద్యాధికారులతో కలెక్టర్‌ సమీక్ష

జిల్లాలో కేసులు తగ్గకపోవడం, రోజురోజుకూ డెంగ్యూతో పాటు జ్వరాల తీవ్రత పెరుగుతుండడంతో కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో 15 రోజుల పాటు ప్రత్యేక సేవలు అందించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందితో సబ్‌ సెంటర్‌ల వారీగా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దోమల నివారణతో పాటు వ్యాధులు వచ్చిన వారికి ప్రత్యేక చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం నుంచి సబ్‌ సెంటర్‌ల వారీగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. నగరం, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మున్సిపల్‌ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు వ్యాదుల తీవ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. దో మలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని గ్రామాల పరిధిలో సబ్‌ సెంటర్‌లలో ప్రత్యేక బృందాలను నియమించారు. ఆయా గ్రామాల పరిధిలో వ్యాధులపైన అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ జ్వరాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను వివరిస్తున్నారు. డెంగ్యూ వచ్చినా ఆందోళన చెందకుండా చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు. డెంగ్యూకు సంబంధించిన పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో జ్వరాలను గుర్తించి అక్కడే చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. జ్వరాలు వచ్చిన వారికి కావాల్సిన మందులను అందిస్తున్నారు. జిల్లాలో 15 రోజుల పాటు ఈ బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. 

త్వరలో వైద్య శాఖలో బదిలీలు?

వైద్య ఆరోగ్యశాఖలో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలకమైన అధికారులను మార్చడంతో పాటు పనిచేసేవారికి పోస్టింగ్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదికను జిల్లా నుంచి పంపించారు. ఒకటి రెండు రోజుల్లో కీలకమైన అధికారులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆయా డిపార్ట్‌మెంట్‌లకు ఇన్‌చార్జిగా ఉన్నవారు సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్ల శాఖ గాడితప్పడంతో పాటు డిప్యూటేషన్‌ల పేరిట సిబ్బందిని ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల పీహెచ్‌సీలో కనీస సిబ్బంది లేని పరిస్థితిని నివేదికలో పొందుపర్చినట్టు తెలిసింది. 

భారీ వర్షాల వల్లే పెరిగిన వ్యాధుల తీవ్రత

-డాక్టర్‌ తుకారాం, జిల్లా మలేరియా అధికారి 

జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల జ్వరాల తీవ్రత పెరిగింది. జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్‌తో పాటు ఇతర వైరల్‌ ఫీవర్‌లు ఎక్కువగా ఉన్నాయి. నగరం పరిధిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని సబ్‌ సెంటర్‌ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జ్వరాలపై అవగాహన కల్పించడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.