Abn logo
Apr 2 2020 @ 06:44AM

వాహనాల ఫిట్‌నెస్‌, పర్మిట్‌, లైసెన్సుల గడువు పెంపు

  •   జూన్‌ వరకు చెల్లుబాటు  రవాణా శాఖ నిర్ణయం 
  • ఫిబ్రవరి 1 నుంచి జూన్‌ 30 వరకు  గడువు ముగిసిన వాటికి అవకాశం

    ఆంధ్రజ్యోతి, విజయవాడ : వాహనాల ఫిట్‌నెస్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్సుల గడువును జూన్‌ నెలాఖరు వరకు పొడిగిస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం ఫిబ్రవరి 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు గడువు ముగిసిన వాటికి మాత్రమే ఉంటుంది. లారీ రవాణా రంగ వర్గాలు తమకు త్రైమాసిక పన్నులను, లేబర్‌ సెస్‌ రూ.1,000-రూ.1,500ను మినహాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పర్మిట్ల గడువు పెంచడం కొంతమేర వెసులుబాటే. ఇది ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లకు కూడా వర్తిస్తుంది. రిజిస్ర్టేషన్‌ పత్రాలకు కూడా ఈ గడువు వర్తిస్తుంది. ఈ కేటగిరీలో టెంపరరీ రిజిస్ర్టేషన్లు, కొత్త రిజిస్ట్రేషన్లు మాత్రం రావు. కేవలం రెన్యువల్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిపై డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా వాహనాల రాకపోకలను నిలుపుదల చేసిన నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ కొన్ని నిర్ణయాలను తీసుకుందన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాల కాలపరిమితి గడువు పూర్తి అయినప్పటికీ జూన్‌ 30 వరకు చెల్లుబాటులో ఉండేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement