Abn logo
May 7 2020 @ 00:32AM

కష్టకాలంలో నయవంచన..!

దేశంలో లాక్‌డౌన్ మొదలై నలభై అయిదు రోజులైంది. కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు సరికదా రోజురోజూ పెరుగుతోంది. ఈ కారణంగా ఎన్నో కుటుంబాలు పూట గడవని స్థితికి చేరుకున్నాయి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆ కుటుంబాలకు తమ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. కుంటుబడ్డ ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవడానికో మారే ఇతర కారణాలతోనో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ, కరోనా కట్టడికి ఇన్నాళ్లూ పడిన శ్రమ అంతా దీనితో బూడిదలో పోసిన పన్నీరు కాదా? మద్యం అమ్మకాలు మొదలవుతాయని తెలియగానే, షాపుల ముందు ఉదయం నుంచి పడిగాపులు పడటాలు, తోపులాటలు, కోలాహలాలు చూస్తుంటే దీనికోసమేనా ఇన్ని రోజులు ఇండ్లలో ఉన్నది అని బాధ కలుగుతున్నది. మద్యం అమ్ముతున్నది చాలక, ధరలు పెంచడం ద్వారా విక్రయాలను నిరుత్సాహపరుస్తున్నామని పాలకులు మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారు. ధరలు ఎంత పెంచినా జనం లెక్క చేయకపోవడం బాధాకరం. తిండికే కటకటలాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇంట్లో భార్యాపిల్లల శ్రేయస్సును సైతం లెక్కచేయకుండా, సంపాదన లేకపోయినా కూడా ఉన్న డబ్బంతా మందుకు ధారపోయడానికి ఇలా అవకాశమివ్వడం మంచిది కాదు. పోలీసులు రాత్రీపగలు లెక్క చేయకుండా కరోనా విధులు నిర్వహిస్తుంటే, ఆ బాధ్యతలకు తోడు మద్యం దుకాణాల వద్ద కూడా విధులు నిర్వహించాల్సి రావడం చూస్తుంటే అయ్యో అనిపించక మానదు. మద్యం మత్తులో తూగేవారికి సాయం చేయాలని ఏ దాతలకైనా అనిపిస్తుందా? ఈ సంక్షోభకాలంలో మీ కుటుంబం కోసం కొన్ని వ్యసనాలను మానుకుని భార్యాబిడ్డలకు రెండు పూటలా భోజనం పెట్టమంటూ ప్రభుత్వాలు ప్రజలకు హితవు చెప్పాల్సిన సమయం ఇది. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. కరోనా లాంటి విపత్తుల వలన ఏం గుణపాఠం నేర్చుకున్నారంటే చెప్పడానికి కనీసం ఒక్కటైనా సమాజహితమైన కార్యం ఉండాలి కదా! ఇలాంటి కష్ట కాలంలో ప్రజలను సమాజహితం వైపు నడిపించడమే ప్రభుత్వాల బాధ్యత కావాలి. మద్యవిక్రయాలకు సంబంధించిన నిర్ణయాలను ఇప్పటికైనా పాలకులు సవరించుకుంటే మంచిది. 

సింగంపల్లి శేషసాయి కుమార్

Advertisement
Advertisement
Advertisement