Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐఎంఎఫ్‌‌లో నెం.2గీతా గోపీనాథ్‌

ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియామకం

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకనామిస్ట్‌ గీతా గోపీనాథ్‌కు అదే సంస్థలో ఉన్నత పదవి వరించింది. ఆమెను ఐఎంఎఫ్‌ ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ప్రస్తుత మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే కనివిని ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఏర్పడిన స్థూల ఆర్థిక సవాళ్ల నుంచి సభ్య దేశాలు బయటపడడానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను మరింత ఉన్నత పదవిలో నియమించినట్టు ఐఎంఎఫ్‌ ప్రకటించింది. వాస్తవానికి ఆమె జనవరిలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిలోకి తిరిగి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ ఈ పదవికి నియమితురాలు కావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జియోఫ్రే ఒకమోటో వచ్చే ఏడాది ప్రారంభంలో పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆమె ఆ పగ్గాలు చేపడతారని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జీవా ప్రకటించారు. ప్రస్తుత సమయంలో ఆమె సేవలు ఐఎంఎ్‌ఫకు అవసరమని తాము భావించామని ఆమె చెప్పారు. ఇండో అమెరికన్‌ సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ (49).. 2019 నుంచి ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనామి్‌స్టగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Advertisement
Advertisement