Abn logo
Sep 18 2021 @ 01:42AM

అరాచకాలను ఉపేక్షించం

నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంపై దాడికి నిరసన

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ 

కందుకూరు, సెప్టెంబరు 17: పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో అరాచకాలకు తెరలేపుతున్నాడని కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వందలమంది అనుచరులతో వెళ్లి దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే అరాచకం ఎంతగా రాజ్యమేలుతుందో ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఆయన ఇంటిపై ఎన్నిసార్లు దాడులు చేయాలని ప్రశ్నించారు. పరూష పదజాలాన్ని ఉపయోగించే కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. జోగి రమే్‌షపై కేసు నమోదు చేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో ఎంిపీడీవో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు ఇవ్వకుండా టీడీపీ మాజీ సర్పంచ్‌లు, నాయకులను ఇబ్బంది పెడుతున్నాడని శివరాం ఆరోపించారు. ఎమ్మెల్యే ఆపమన్నాడని ఎంపీడీవో బహిరంగంగా చెబుతున్నాడని ఈ విషయంపై వాస్తవం ఏమిటో ఎమ్మెల్యే మహీధరరెడ్డి స్పందించాలని శివరాం కోరారు. మూడేళ్లక్రితం చేసిన పనులకు కోర్టు మొట్టికాయలతో ఇప్పుడు అరకొరగా ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తున్నారన్నారు. వాటిని చెల్లించకుండా ఆపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కందుకూరు నియోజకవర్గం టీడీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా నాయబ్‌ రసూల్‌ని, యువత అధ్యక్షుడిగా పొడపాటి మహే్‌షని నియమిస్తున్నట్లు ఈ సందర్భంగా శివరాం తెలిపారు. 

దర్శి : టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి.రమేష్‌ అనుచరులతో దాడికి యత్నించటం ధారుణమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా వ్యవహరించిన చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ గుండాలు దాడిచేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే అన్నారు. అదేవిదంగా చంద్రబాబుపై దాడికి ప్రయత్నించటం శోచనీయమని జిల్లా టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ ఒక ప్రకటనలో ఖండించారు. స్ధానిక టీడీపీ కార్యాలయంలో  ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి శోభారాణి, టీడీపీ నాయకులు నారపుశెట్టి మధు, షేక్‌ ఫరీద్‌, జూపల్లి కోటేశ్వరరావు తదితరులు విలేకర్ల సమావేశంలో చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు.

ముండ్లమూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, తన అనుచరులతో రాళ్ల దాడి చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రం ముండ్లమూరులో శుక్రవారం మధ్యాహ్నం రోస్తారోకో నిర్వహించారు. అనంతరం ‘సీఎం డౌన్‌.. డౌన్‌ ’ అంటూ నినాదాలు చేశారు. అద్దంకి - దర్శి ప్రధాన రహదారి కావడంతో ముండ్లమూరులో వాహనాలు రహదారికి ఇరువైపులా నిలిచి పోయాయి.  కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌ మేదరమెట్ల వెంకటరావు, వీరపనేని వీరనారాయణ, మేదరమెట్ల సుబ్బారావు, గణపనేని అంజయ్య, దద్దాల నాగేశ్వరరావు, అచ్చయ్య, వీరపనేని రాంబాబు, కంకణాల వెంకటరావు, వీరపనేని శ్రీనివాసరావు, పిచ్చారావు, వేణు, చిన రోశయ్య, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

లింగసముద్రం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని మండల టీడీపీ అధ్యక్షులు వేముల గోపాలరావు, ఉపాధ్యక్షులు అడపా నర్సయ్య, టీడీపీ నాయకులు బి నాగేశ్వరరావు, అడపా రంగారావు తదితరులు శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు.చంద్రబాబు ఇంటి మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.జోగి రమేష్‌, ఆ పార్టీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులు చేస్తుంటే, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ, టీడీపీ నాయకులపై దాడి చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇలాంటి నియంత్రుత్వ చర్యను ప్రజలు ఖండించాలన్నారు.

వెలిగండ్ల : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడి చేయడం జగన్‌ సర్కార్‌ దౌర్జన్యానికి పరాకాష్ట అని టీడీపీ మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్లలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. పోలీసులే వైసీపీ నేతలను ప్రోత్సహిస్తున్నారని, పోలీసులే బుడ్డా వెంకన్నను కింద పడేడి దాడి చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు చేసే దాడులను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 

వలేటివారిపాలెం : మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అల్లరిమూకలతో దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ మండల అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, కూనిపాలెం సర్పంచ్‌ నవ్వులూరి రాజా రమేష్‌, వలేటివారిపాలెం మాజీ ఎంపీటీసీ వలేటి నరసింహం, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ఘటమనేని చెంచురామయ్యలు తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు నివాసంంపై జోగి రమేష్‌ అల్లరిమూకలతో రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కనిగిరి : శాసన సభ్యులంటే శాసన కర్తలని అలాంటి శాసన సభ్యులే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైనే ఇలాంటి దాడులకు పాల్పడు తున్నారంటే ఇంత కంటే హేయమైన చర్య మరొకటి ఉందా టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రశ్నించారు. వైసీపీ పాల్పడిన ఈ చర్యలకు నిరసనగా టీడీపీ కార్యాలయంలో ప్లకార్డులు చేతపట్టి టీడీపీ శ్రేణులతో కలిసి మోకాళ్ళపై కూర్చుని వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అద్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు బేరి పుల్లారెడ్డి, సీనియర్‌ టీడీపీ నాయకులు వివిఆర్‌ మనోహరరావు, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పామూరులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు కమిటీ తెలుగు రైతు అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ కార్యదర్శి కె సుబాషిణి, జిల్లా అధికార ప్రతినిధి వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్‌డి అమీర్‌బాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.