Abn logo
Jun 19 2021 @ 00:52AM

ప్రశ్నిస్తేనే భవిష్యత్తు

‘నీవుఆశించే మార్పునకు నువ్వే ప్రతీక కావాల’ని పౌరుల బాధ్యతను ఎలుగెత్తి చాటారు మహాత్మా గాంధీ. రాష్ట్ర భవితకు, తమ భవితకు యువత కంకణబద్ధులు కావాలి. ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ప్రశ్నిస్తేనే యువతకి భవిత. అసమర్ధత, అవినీతి, అవ్యవస్థ, స్వార్థం వంటి సమస్యలు యువత ముందున్న సవాళ్ళు. యువతలో అత్యధికులు స్వయం ఉపాధికల్పన, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారే. అందుకే దుష్టరాజకీయ శక్తుల పీచమణిచేలా వారు కదం తొక్కాలి. వర్తమానమే కాదు, భవిష్యత్‌ కూడా లేదని గుర్తించి సంఘటిత శక్తిగా యువత సత్తా చాటాలి. కులాలు, మతాలు, వర్గాల పేరుతో ప్రజలను విడదీస్తున్నారు పాలకులు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని తిప్పికొట్టకపోతే పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ప్రస్తుతం యువత డబ్బే ప్రధానంగా చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు గురించి ఆలోచించక పోవడం విచారకరం. కుండలోకి అన్నం, జేబులోకి డబ్బులు వచ్చి చేరడంతో ప్రభుత్వం ఏం చేసినా, చెయ్యకపోయినా ప్రశ్నించడం యువత మానేసింది. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1600 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని క్యాడ్‌ బరీ సంస్థ ఆ మధ్య ప్రకటించింది. మరి ఆ విధంగా చూస్తే లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీ చేసినవారు లక్షా 60 వేల మంది యువత భవిష్యత్తును బలితీసుకొన్నారని అర్థం చేసుకోవాలి. అసమర్ధుల, అక్రమార్కుల, అవినీతిపరుల పాలబడిన భావి నవ్యాంధ్ర నిర్మాణం గాడిలో పడాలంటే పదును, పరిణితితో ప్రశ్నించే యువజనమే కీలకం. గత ఎన్నికల ముందు యువతకు ఎన్నో హామీలిచ్చి, వారిని బులిపించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమను ఉద్ధరించింది ఏమిటని ప్రశ్నించాలి.  


ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం వారి అవసరాలు తీర్చడానికి కాకుండా, దోపిడీ విధానాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆస్తులను సొంత ఆస్తులుగా భావించి అమ్మేస్తున్నది. అయినవారికి కోట్ల విలువ చేసే ఆస్తులు కారుచౌకగా కట్టబెడుతున్నది. తాయిలాల ఉరవడిలో కొట్టుకుపోతున్న యువత విచక్షణ లేకుండా ఓట్లు వేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సామాన్య పౌరులు, మేధావులు, యువత ఎంతో బాధ్యతతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయమిది. సమాజం ఉన్నతంగా, ఉత్తమంగా పరిఢవిల్లడానికి ప్రశ్నల ప్రవాహాన్ని నిరంతరం వారు కొనసాగించాలి. ప్రశ్న సకల జనహితానికి దోహదపడుతుంది. ప్రశ్నే ప్రగతికి పునాది. అజ్ఞానులకు, అసమర్ధులకు, అహంకారులకు ప్రశ్నే విరోధి.                                                                                                                                                         

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కోరుకొనే మేధావులు, రాజకీయాల్లో విలువలు అడుగంటాయని వగచే సంఘాలు ఒకసారి కళ్ళు తెరచి చూడాలి. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలకు నిర్భయంగా చెప్పగలిగే మేధావులు ముందుకు రావాలి. ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక సిద్ధాంత ప్రభావం ఉంటుంది. మేధావులు కూడా తాము కట్టుబడిన సిద్ధాంతానికి అనుగుణంగానే ఆలోచిస్తారు. వారి ఆలోచనలకు విరుద్ధంగా పాలకుల పనితీరు ఉంటే విమర్శించడం సహజం. కానీ ప్రస్తుత పాలకులు విమర్శకులపై ఏదో ఒక ముద్రవేసి వారి నోళ్ళు మూయిస్తున్నారు. ఆ ముద్రలకు భయపడి చాలామంది మేధావులు నోళ్ళు కుట్టేసుకుంటున్నారు. మరికొంతమంది మేధావులు వ్యక్తపరిచే అభిప్రాయాలు చూస్తుంటే వారి వాదనల్లో ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చడం కష్టమవుతుంది. ఇటువంటి కుహనా మేధావుల వల్ల సమాజానికి చేటు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. నిజమైన మేధావులు తాము చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించరు. 


రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సంఘటనలపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు గళం విప్పాలి. సంఖ్యా బలంతో రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలను, పద్ధతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారం పాలన సాగిస్తున్నది. జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించనప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలదే. పౌరులు ఓటు వేసి తమ బాధ్యత తీరినట్లు భావించడం వల్లనే అరాచకం, అహంకారం, స్వార్ధం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయాయి. నిరంతరం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే పరిపక్వత, చైతన్యం ప్రజల్లో ఉండాలి. పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు పాతరేసినప్పుడు పౌరసమాజం, మేధావి వర్గం, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించడంలో చురుగ్గా వ్యవహరించాలి. 16వ లూయి చక్రవర్తి కాలంలో ఫ్రెంచ విప్లవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాజు దాష్టీకాలు భరించలేక, పాలకుల అరాచకం సహించలేక ప్రజలంతా తిరగబడ్డారు స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, హక్కుల సాధన కోసం. కాబట్టి ప్రశ్నించకపోతే ప్రగతి లేదని గుర్తించి ప్రశ్నించడం మొదలుపెట్టాలి


నీరుకొండ ప్రసాద్‌