Abn logo
Sep 28 2020 @ 03:44AM

ఆస్పత్రికెళితే.. అప్పులే!

Kaakateeya

గ్రామాలపై ‘ప్రైవేటు వైద్యం’ పిడుగు

ఆదాయం అంతంత.. కొవిడ్‌ వస్తే కష్టమే

5 లక్షలు కడితేనే ప్రైవేటులోకి ప్రవేశం

నయమయ్యేసరికి మరో రూ.5 లక్షలు

ఈ ఖర్చుల కోసం అప్పులు చేసి తిప్పలు

పీహెచ్‌సీల్లో బెడ్‌లు వేస్తే కొంత ఊరట


కరోనాతో గ్రామీణ జీవితాలు తలకిందులవుతున్నాయి. పనుల్లేక.. ఆదాయం లేక ఏదోలా నెట్టుకొస్తున్న కుటుంబాలు.. కరోనా సోకితే కల్లోలమైపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు లేక.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితికి లోనవుతున్నాయి. పీహెచ్‌సీల్లో కరోనా వైద్యం అందితేనే వారికి ఊరట.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తికి కొవిడ్‌ సోకింది. అతను చిన్న రైతు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. బెడ్‌లు లేవు అని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేరదామని వెళ్లగా, అడ్మిట్‌ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఐదు లక్షలు కట్టాలని వైద్యులు తేల్చేశారు. ‘అంత డబ్బా!’ అని షాక్‌కు గురవుతుండగానే మరో పిడుగు నెత్తిన వేశారు. మొత్తం చికిత్స పూర్తయ్యేసరికి మరో రూ.తొమ్మిది లక్షలు అవుతుందని తేల్చేశారు. అంటే మొత్తం రూ.14లక్షలు అవుతుంది అని చావుకబురు చల్లగా చెప్పారన్నమాట. అయితే, అతడి మొత్తం ఏడాది సంపాదనే లక్షన్నర, రెండు లక్షలు. దాంతోనే సంసార జీవితం ఎలాగోలా గడుపుతున్నాడు. అలాంటిది అంత డబ్బు కట్టాలంటే, ఉన్న ఎకరం పొలం అమ్మేయాలి... లేకుంటే అప్పు తీసుకురావాలి. ఇతనొక్కడే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితిని చాలామంది ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉన్నదని కాదు. కాకపోతే స్థిరమైన ఆదాయాలు, నెలవారీ జీతాలు, వ్యాపారాలు ఉంటాయి కాబట్టి, పట్టణ వాసులకు కొవిడ్‌ వస్తే కొంతలో కొంత ఆస్పత్రుల ఖర్చులను తట్టుకోగలుగుతారు. సన్నకారు, చిన్నకారు రైతాంగం బతికే గ్రామాల్లో ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు కరోనా నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు బాగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవారికి కొవిడ్‌ వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడ బెడ్‌లు లేకపోయినా, ప్రైవేటు ఆస్పత్రులైతే మెరుగనే ఉద్దేశంతో వెళ్లినా... వైద్యానికి అయ్యే ఖర్చు విని షాక్‌ అవుతున్నారు. దానికి తట్టుకోలేనివారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌ దొరికే వరకు వేచి చూస్తున్నారు. మరికొందరు అప్పోసప్పో చేసి.. ఉన్నది తాకట్టు పెట్టి ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆ అప్పు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సిందే. కరోనాతో పనుల్లేక, ఆదాయం తగ్గి ఏదోలా జీవనం నెట్టుకొస్తున్న తరుణంలో..  పాజిటివ్‌ వస్తే ఆస్పత్రుల్లో చేరి వైద్య ఖర్చులను తట్టుకోలేకపోతున్నారు.


సగటు జీవికి సంకటమే..

దేశవ్యాప్తంగా ఏటా కోటి మంది వైద్య ఖర్చులు తట్టుకోలేక అప్పుల పాలవుతున్నారని ఒక అంచనా. దీనికిప్పుడు కొవిడ్‌ తోడైంది. కొవిడ్‌తో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోనూ అదే తరహాలో కొవిడ్‌ సృష్టించిన విపత్తుతో మధ్యతరగతి ప్రజలు అప్పులపాలవుతున్నారు. మామూలుగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి పెద్దగా ఇబ్బందిలేనివారు ఇళ్లల్లోనే ఉండి మందులు వాడుతున్నారు. ఇలాంటివారికి ఉద్యోగం, పని చేసుకుంటే వచ్చే ఆదాయం రాకున్నా... వైద్య ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం లేదు. కానీ కొవిడ్‌ వల్ల జ్వరం, ఇతర లక్షణాలు ఎక్కువగా ఉండడమే కాకుండా, శ్వాస సమస్య, గతంలోనే బీపీ, షుగర్‌, ఆస్థమా లాంటి సమస్యలున్నవారు కచ్చితంగా ఆస్పత్రిలో చేరాల్సిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌లు ఉన్నపళాన దొరకవు కాబట్టి.. సీరియ్‌సగా ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. ఇదే వారిని, వారి కుటుంబాలను అప్పులపాలు చేస్తోంది. కరోనా నుంచి బయటపడినా.. తెచ్చిన అప్పుల నుంచి మాత్రం సగటు కుటుంబాలు బయటపడలేకపోతున్నాయి. 


‘గుండే’ చిన్నదాయె..

సాధారణంగా ఇప్పటివరకు గుండె సమస్య అన్నది పెద్దదిగా కనిపించేది. గుండె ఆపరేషన్‌, బైపాస్‌ సర్జరీ అంటే అబ్బో అంత పెద్ద ఖర్చా... అని గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వాపోయేవారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి బీమా, ఆరోగ్యశ్రీ లాంటి సౌకర్యాలుంటే... చేతిలో ఒక 25-50వేలు పెట్టుకుంటే అయిపోయేది. ఒకవేళ బీమా, ఆరోగ్యశ్రీ సదుపాయం లేకుంటే, ఒక లక్షన్నర నుంచి మూడు, నాలుగు లక్షల వరకు ఖర్చులు అయ్యేవి. దానికే విలవిల్లాడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కరోనాతో ఆ ఖర్చులన్నీ దాటిపోయాయి. ఐదు నుంచి 10లక్షలు ఖర్చుపెట్టాల్సి వస్తోందంటే కొవిడ్‌ వల్ల సగటు మానవుడి ఆర్థిక పరిస్థితి ఎంత అస్తవ్యస్తం అవుతుందో ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని బెడ్‌లు ఏర్పాటుచేస్తే... ప్రతి గ్రామంలోను ఉన్న ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, కమ్యూనిటీ హాలు...ఇలా ఎక్కడో ఒకచోట కొన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా ఏర్పాటుచేసి చికిత్స అందించే సౌకర్యం కల్పిస్తే సగటు మానవుడికి భరోసా దొరుకుతుంది. సాధారణ రైతు, మధ్యతరగతి మానవుడు ఆదుర్దాగా అప్పు చేసి ప్రైవేటు ఆస్పత్రికి పరిగెట్టాల్సిన అవస్థలను, డబ్బు లేక ఆస్పత్రిలో చేరలేని విపత్కర పరిస్థితులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement
Advertisement
Advertisement