Abn logo
Aug 8 2020 @ 19:16PM

లడఖ్‌తో కలిపితే గిల్గిట్-బాల్టిస్థాన్ అభివృద్ధి సాధ్యం : సెంగే సేరింగ్

వాషింగ్టన్ : భారత దేశంతో కలిస్తే అభివృద్ధి చెందగలమనే నమ్మకం గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజల్లో పెరుగుతోంది. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగానికి చెందిన రాజకీయ ఉద్యమకారుడు సెంగే హెచ్ సేరింగ్ ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పారు. ఆయన ప్రస్తుతం వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న గిల్గిట్-బాల్టిస్థాన్ స్టడీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. 


సెంగే సేరింగ్ మాట్లాడుతూ, తాము జమ్మూ-కశ్మీరులో భాగమని గట్టిగా నమ్ముతున్నామన్నారు. 1947లో మహారాజా హరిసింగ్ తమ చట్టబద్ధ వారసుడని చెప్పారు. యావత్తు జమ్మూ-కశ్మీరు ప్రాంతం ఆయనదేనని చెప్పారు. మహారాజా సరైన న్యాయపరమైన, చట్టపరమైన విధానంలో జమ్మూ-కశ్మీరును భారత దేశంలో కలిపినట్లు తెలిపారు. భారత దేశంలో తన రాజ్యాన్ని కలపడమనేది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఈ ప్రక్రియ అంతా బ్రిటిష్ చట్టాల ప్రకారం జరిగిందని తెలిపారు. 


2019 ఆగస్టు 5న అధికరణ 370ని రద్దు చేసే వరకు తాము జమ్మూ-కశ్మీరు రాష్ట్రానికి చెందినవారమని, ప్రస్తుతం తాము లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవారమవుతామని చెప్పారు. తనకు సాంస్కృతికంగా లడఖ్‌తో అనుబంధం ఉందని చెప్పారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వల్ల అక్కడి ప్రజలకు చాలా అభివృద్ధి అవకాశాలు వస్తాయన్నారు. అదేవిధంగా గిల్గిట్-బాల్టిస్థాన్‌ను భౌగోళికంగా లడఖ్‌తో కలిపితే తమకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. 


పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతోనూ, గిల్గిట్-బాల్టిస్థాన్‌తోనూ తనకు ఉన్న సంబంధాన్ని ప్రపంచానికి చెప్పడం గత ఒకటి, రెండు సంవత్సరాల నుంచి భారత దేశం ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు గిల్గిట్-బాల్టిస్థాన్‌ను పాకిస్థాన్‌లో భాగంగానూ, నియంత్రణ రేఖను సరిహద్దుగానూ భావించేవని తెలిపారు. దీనిపై మరింత గట్టిగా మాట్లాడటానికి భారత దేశానికి మరికొంత కాలం పట్టవచ్చునన్నారు. 


ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్య దేశాలు కూడా గిల్గిట్-బాల్టిస్థాన్ గురించి అర్థం చేసుకున్నాయని, ఇది పాకిస్థాన్‌లో భాగం కాదని తెలుసుకున్నాయని చెప్పారు. 


ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరుకు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని గిల్గిట్-బాల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరుల్లోని రాజకీయ ఉద్యమకారులు స్వాగతించారు. అధికరణ 370 రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత్ అనుకూల కార్యక్రమాలు నిర్వహించారు.


Advertisement
Advertisement
Advertisement