Abn logo
Jun 10 2021 @ 00:27AM

విలువల తోడు ఉంటే వెన్నెముక ఉన్నట్టే!

ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుందని, చెట్టును బతికిస్తే అది మనల్ని బతికిస్తుందని చెబుతుంటారు కదా, అట్లాగే, విలువలను మనం కాపాడితే, అవి తిరిగి మనలను కాపాడతాయి. ఒక సమాజం నిలకడైన, నికార్సైన పోరాటం చేసి సాధించుకున్న విజయాలు, సమకూర్చుకున్న విలువలు ఆ, సమాజాన్ని ఎంతగా రక్షిస్తాయో తమిళనాడును చూస్తే అర్థం అవుతుంది. ద్రావిడ ఉద్యమం కాలక్రమంలో పతనం కాలేదని కాదు, వెలిసిపోలేదని, లొంగిపోలేదని కూడా కాదు. కానీ, మూలధాతువు ఏదో మిగిలిపోయి, మళ్లీ మళ్లీ పోరాటపు గ్రంథిని పునరుజ్జీవింపజేస్తుంది. సిద్ధాంతాన్ని బలహీనపరచి సినీ జనాకర్షణతో అధికారంలోకి వచ్చిన అన్నా డిఎంకె కూడా ప్రజలు గీసిన కొన్ని లక్ష్మణరేఖలను దాటలేకపోయింది. శ్రీలంక టైగర్లు అంటేనే విరుచుకుపడే జయలలిత, ఆమె పార్టీ కూడా రాజీవ్ హత్య కేసు నేరనిర్ధారితుల ఉరిశిక్ష రద్దును, విడుదలను డిమాండ్ చేయవలసి వచ్చింది. ప్రధాని హత్యకు కుట్ర పేరుతో దేశవ్యాప్తంగా మేధావులను, హక్కుల కార్యకర్తలను విచారణ లేకుండా సంవత్సరాల తరబడి నిర్బంధిస్తుంటే ముఖ్యమంత్రులెవరికీ నోరు పెగలదు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం ఒక మాజీప్రధాని హత్యకేసులో దోషుల విడుదలకు రాష్ట్రపతికి లేఖ రాయగలడు. ఒక్కోసారి దక్షిణదిక్కు ధిక్కారానికి గర్వంగా ఉంటుంది. అంతలోనే, తెలుగువారి దౌర్భాగ్యానికి దిగులూ కలుగుతుంది. 


ఎం.కె. స్టాలిన్ తండ్రిలాగా ద్రావిడ ఉద్యమం పాదుల నుంచి నడిచివచ్చినవాడు కాదు. బాల కార్యకర్తగా డిఎంకెలో జీవితంలో మొదలైనప్పటికీ, ఎమర్జెన్సీలో పోలీసు హింస అనుభవం ఉన్నప్పటికీ, రాజకీయపు తొలిరోజుల్లో అతనికి ఏమంత సజ్జనుడన్న పేరు లేదు. తరువాత తరువాత కాలంలో, సుదీర్ఘ నిరీక్షణలో ఉన్న వారసుడిగా చాలా నేర్చుకోగలిగాడు. అయినా, కరుణానిధి వాగ్ధాటి కానీ, సాహిత్య స్పర్శ కానీ అతనికి అంటలేదు. కానీ, పోయిన నెలలో మొదటి సారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి, అతను తన లోపాలను భర్తీచేసుకోవడానికి, ద్రవిడ ఉద్యమం నుంచి తీసుకోవలసిన దోహదాలను తీసుకుంటున్నాడు. తండ్రి లేని లోటును, ఉద్యమ సిద్ధాంతాలను తలకెత్తుకోవడం ద్వారా పూరించుకుంటున్నాడు. తమిళనాడును తీవ్రజాతీయవాదం నుంచి, దాని వల్ల కలిగే ఉత్పాతాల నుంచి రక్షించుకుని, తమకే పరిమితమయ్యే ఒక రక్షిత జనావరణంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజకీయ అనివార్యతల నుంచే కావచ్చు, కానీ, స్టాలిన్ తీరు అతనికీ, తమిళనాడుకు, దేశానికీ కూడా ప్రత్యేకమైన రాజకీయమార్గాన్ని సూచిస్తున్నది. 


‘ఓండ్రియ అరసు’ అన్న మాట, తెలుగువాళ్లు వినే అవకాశం లేదు. తమిళనాడులో కూడా యాభై ఏళ్ల కింద బాగా వాడుకలో ఉండేది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి స్టాలిన్, ఆయన మంత్రివర్గ సహచరులు ‘ఓండ్రియ అరసు’ అన్న మాటనే వాడుతున్నారు. ఇది రాష్ట్ర బిజెపి నాయకులకు బాగా అసహనం కలిగిస్తోంది. ‘ఓండ్రియ అరసు’ అంటే, ‘సమాఖ్య ప్రభుత్వం’, ఇంగ్లీషులో యూనియన్ గవర్నమెంట్. మొన్నటి దాకా ‘మత్తియ అరసు’ అనేవారు. అంటే, ‘కేంద్ర ప్రభుత్వం’, సెంట్రల్ గవర్నమెంట్. స్టాలిన్ కేంద్రప్రభుత్వాన్ని రద్దుచేసి, సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారన్నమాట, కనీసం భాషలో. రాజ్యాంగం ప్రకారం, భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్ర ప్రభుత్వం అనేది లేదు. సమాఖ్య ప్రభుత్వం మాత్రమే ఉన్నది-అన్నది వివరణ. అన్నాదురై కాలంలోను, కరుణానిధి హయాం తొలిరోజుల్లోనూ ‘ఓండ్రియ అరసు’నే ఉపయోగించేవారు. తరువాత కాలంలో, పట్టింపు తగ్గిపోయి, ఇంగ్లీషులో సెంట్రల్ గవర్నమెంట్ అన్న వాడుక పెరిగిన తరువాత తమిళంలో కూడా ‘మత్తియ అరసు’ అనే మాటను వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పనిగట్టుకుని సమాఖ్య ప్రభుత్వం అని వ్యవహరించడం ద్వారా డిఎంకె ప్రభుత్వం కేంద్రప్రభుత్వపు పరిమితులను సూచిస్తోంది. ముఖ్యమంత్రులు, మంత్రులు తమ అధికారిక వ్యవహారాల్లో కొత్త పదబంధాన్నే ప్రయోగిస్తూ ఉండడం వల్ల, పాత్రికేయుల భాషలోనూ ఆ ప్రయోగం వేగంగా వచ్చిచేరింది. ఈ మధ్య వివాదాస్పదమైన గోవా జిఎస్‌టి సమావేశంలో చేసిన ప్రసంగంలో తమిళనాడు ఆర్థికమంత్రి ‘ఓండ్రియ అరసు’నే ఉపయోగించారు. 


తెలుగువారి దురదృష్టమేమిటంటే, మనకు ఓండ్రియమూ లేదు, మత్తియా లేదు. సమాఖ్య అన్నా, కేంద్ర అన్నా రెండూ సంస్కృతమే. ఆ రెంటి మధ్య ఉన్న తేడా గురించి కూడా మనకు ఏ పట్టింపూ లేదు. అన్నిటికీ తెలుగుమాటలుండాలన్న ఆదర్శం అసలు లేదు. ఎన్‌టి రామారావు అధికారంలోకి వచ్చిన మొదట్లో కేంద్రం మిథ్య అన్నారు. అదేదో వేదాంతపు ప్రకటన అనుకున్నవాళ్లే ఎక్కువ మంది. అన్నాదురై వంటి వారు ఏ అర్థంలో అన్నారో ఎన్టీయార్ కూడా అదే అర్థంలో అన్నారు. తమిళనాడులో వలె, బ్రాహ్మణవాద వ్యతిరేక, కేంద్రాధిపత్య వ్యతిరేక, భాషాభిమాన సిద్ధాంతాలను ఎన్టీయార్ కూడా ఆశ్రయించారు కానీ, మూడునాలుగేళ్ల పాలన తరువాత నిలకడగా ఆ వైఖరిని అనుసరించలేకపోయారు. అందువల్ల, తెలుగుదేశం ప్రాంతీయపార్టీగా మనుగడ సాగించగలిగినా, ప్రాంతీయ వాద సిద్ధాంతాలకు మాత్రం ఆ పార్టీ విధానాల్లో ప్రాధాన్యం తగ్గిపోయింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు రావడం, ప్రాంతీయ పార్టీలకు భాగస్వామ్యం లభించడం కూడా అందుకు కారణం కావచ్చును. భాషా ప్రాంతీయ పార్టీగా ఉండిన తెలుగుదేశం ప్రతిపత్తిని, భౌగోళిక ప్రాంతీయపార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి కుదించగలిగింది. ఏ ఉద్యమాలూ సిద్ధాంతాలూ లేకపోయినా, వైఎస్ ప్రతిష్ఠ, కాంగ్రెస్ పునాది నుంచి అధికారం దక్కించుకున్న జగన్మోహనరెడ్డి పార్టీ కూడా భౌగోళిక ప్రాంతీయపార్టీయే. టిఆర్ఎస్‌కు, వైసిపికి సిద్ధాంతాల బరువు లేకపోవడం వల్ల కేంద్రంతో చెట్టపట్టాలు వేసుకోగలుగుతున్నారు. అనేక మార్లు సంకీర్ణాలలో భాగమైనప్పటికీ, రెండు సార్లు తమ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ తోను, ద్రవిడ వాదానికే వ్యతిరేకమైన బిజెపితోను మైత్రి చేయవలసి వచ్చినప్పటికీ, డిఎంకెకు, తెలుగు అధికారపార్టీల లాగా, ఇప్పుడు కేంద్రంతో ‘మంచి’గా ఉండగలిగే ఆస్కారం లేదు. తమిళనాడు ప్రజలు అందుకు అంగీకరించేలా లేరు. బిజెపి తలపెట్టిన రాజసూయం నుంచి తనను తాను రక్షించుకోవడానికి డిఎంకెకు ఏది కావాలో, తమ ప్రత్యేకతను ప్రతిపత్తిని నిలుపుకోవడానికి తమిళప్రజలకూ అదే కావాలి. అందుకే, పాతపడింది అనుకోకుండా ఫెడరలిజాన్ని డిఎంకె ప్రభుత్వం ఆయుధంగా అందుకున్నది. ఒక్క తమిళాన్నే కాదు, రాజ్యాంగంలో గుర్తించిన భాషలన్నిటిని అధికారిక భాషలుగా ప్రకటించాలని కొత్తగా డిమాండ్ చేసింది. ఇద్దరు తెలుగువీరులు, ఒక్కరన్నా అడగగలరా? 


ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడతారు, కానీ, ఇవి డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట్లాడుతున్న మాటలు. అధికారం చేపట్టిన వెంటనే స్టాలిన్ తన ట్విట్టర్ పరిచయంలో ‘‘ద్రవిడ జాతికి చెందినవాడిని’’ అన్న మాటలు ఉంచారు. ఈ మాటలు అన్నాదురై ఒకనాడు పార్లమెంటులో అన్నవి. ‘‘భారతదేశంలో తాము భాగమే అయినప్పటికీ, ద్రవిడ జాతికి చెందినవారము’’ అని ఆయన 1960ల మొదట్లో అన్నారు. అన్నాదురైను తరచు స్టాలిన్ సాయం తెచ్చుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో అయితే, పెరియార్ సాయం కూడా తీసుకున్నారు. 


మూడేళ్ల కిందటనే ద్రవిడస్థాన్ ప్రస్తావనను స్టాలిన్ తీసుకువచ్చారు. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిజెపికి వ్యతిరేక వైఖరి తీసుకుని, ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలంటే, దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య ఏర్పడాలని అన్నారు. రాజ్యంగ బద్ధంగానే, భారతదేశంలో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల హక్కులను, ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి అటువంటి సమాఖ్యను చంద్రబాబు ప్రతిపాదించారు.. చంద్రబాబు, స్టాలిన్ మాటలను కలిపి విశ్లేషణలు చేసినవారున్నారు. ఆ సమయంలోనే, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు, చర్చాంశాలపై సంప్రదింపులు జరపడానికి తిరువనంతపురంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి, అన్నాడిఎంకె అధికారంలో ఉన్న తమిళనాడు నుంచి ఎవరూ పాల్గొనలేదు. 


ప్రశాంత్‌ కిశోర్ సలహాపై నాస్తికాన్ని పలచన చేసి మేనిఫెస్టో ప్రవేశపెట్టిన స్టాలిన్, అధికారానికి వచ్చాక మరెంతగా తగ్గిపోతారో అని అనుకున్నారు. కానీ, తనకు, రాష్ట్రానికి ఎదురయ్యే ప్రమాదాన్ని నివారించడానికి సిద్ధాంత ఆయుధం కావలసిందేనన్న గ్రహింపు ఆయన పార్టీకి వచ్చింది. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబపార్టీలే అయినట్టు, డిఎంకె కూడా ప్రాంతీయపార్టీగా మారింది. ఒకసారి ప్రాంతీయపార్టీగా మారాక, వ్యక్తి ఆకర్షణ, కేంద్రీకృత నాయకత్వం ఆధారంగా సంస్థ నడుస్తుంది. కానీ, డిఎంకెలో, వారసత్వం సరే, అనేక శ్రేణుల నాయకులు కూడా ఉంటారు, వారికి ప్రాముఖ్యం ఉంటుంది. ద్రవిడవాదాన్ని అధ్యయనం చేసే సిద్ధాంతులూ, మేధావులూ ఉంటారు. వారు ప్రభుత్వానికి, పార్టీకి దిశానిర్దేశం చేస్తారు. విధాన రచనలో వారికి భాగస్వామ్యం ఉంటుంది. సిద్ధాంతాలను ప్రోత్సహిస్తే, అవి తమ కంటె ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయేమోననే భయం, ఉద్యమానికి విలువ ఇస్తే తమ ఉనికికి ప్రమాదమన్న బెదురూ ఆ పార్టీలో ఉన్నట్టు లేదు రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకోవడానికి కానీ, భాషాసంస్కృతులు కాపాడుకోవడానికి కానీ, ఇప్పుడు తెలుగు ప్రాంతీయపార్టీలకు ఏ సిద్ధాంతమూ లేదు. పోరాడవలసివస్తే ఏ వ్యూహమూ లేదు. కప్పం కట్టడానికి తహతహలాడే సామంతరాజుల వలె ఢిల్లీ దర్బారులో దాసోహం అనడం తప్ప, చర్చించవలసిన చట్టాలకు జై కొట్టడం తప్ప, ఈ బాలరాజుల వల్ల ఏ ఉపయోగమూ లేదు.

కె. శ్రీనివాస్