Abn logo
May 7 2020 @ 00:37AM

ఈ విధానం మారకపోతే, కరోనాలే ఖాయం!

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పూర్వం ఏ రోగాలూ ప్రారంభం కాలేదా అంటే, ఆ ఉత్పత్తి విధానాలు ప్రకృతి వాతావరణాన్ని ఇంత తీవ్రంగా తాకినవి కావు. అంతేగాక, అదంతా ప్రకృతి శాస్త్రాలు లేని అగ్న్యానపు కాలం. ఈ నాటి కాలం అటువంటిది కాదు. ఈ నాటి పరిశ్రమలకు లాభాల పెంపుదలలే గానీ, ప్రకృతి వాతావరణాల వంటి ఆలోచనలేవీ అక్కర లేదు. ఈ నాటి ఉత్పత్తి విధానం అంతా, ఎటువంటి వక్ర బుద్ధితో సాగుతోందో, ఎటువంటి ఆపదలకు కారణం అవు తోందో, ఈ విషయాలు గ్రహించకపోతే మనం మానవులం కాలేము.


ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న భయంకర ‘కరోనా’ అంటు రోగం గురించి వినని పూట వుండడం లేదు. ఈ పూట వార్తలు, ప్రతీ దేశంలోనూ కరోనా కేసులూ, మరణాలూ, మొన్నటి కన్నా, నిన్నటి కన్నా, పెరిగి పోతున్నాయి అన్నవే! 


సమాజంలో సాగే ఉత్పత్తి విధానానికీ, రోగాలకీ, సంబంధాలుంటాయనే విషయం గతకాలాల్లో కన్నా, ఈనాడు మరింతగాతెలుస్తోంది. (ప్రకృతి ఇచ్చే పదార్ధాల్ని, మానవులు తమ శ్రమతో జీవితావసర వస్తువులుగా మార్చుకునే విధానమే ఉత్పత్తి విధానం.) ఈ నాటి కరోనా వంటి కొత్త రకపు అంటు రోగాలకీ, ఈనాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికీ, తప్పని సరి సంబంధం కనపడుతోంది. ‘ఏమిటా సంబంధం?’ అనే ప్రశ్నకి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం తన లాభాల కోసం ప్రకృతిని ఎలా ధ్వంసం చేస్తుందో తెలుసుకుంటే జవాబు దొరుకుతుంది.


ఈ కరోనా రోగం పాల బడకుండా బతకాలంటే, ఏ మనిషి అయినా, తన ఇంటి నించి బైటికి రాకుండానూ, రెండో మనిషిని తాక కుండానూ వుండడమే- అని, దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలూ, ఆగ్న్యాపిస్తున్నాయి. ఆ ఆగ్న్యలు సాగాలంటే, భూమి మీద వున్న ప్రతి మనిషికీ ‘ఇల్లు’ అనేది ఉండాలి. అప్పుడు మనుషులంతా ఇళ్ళకు అంటుకు పోగలరు. కరోనా రోగం తెచ్చి పెట్టిన సమస్యలు: వలస కార్మికుల పనుల సమస్యా, వారి అద్దె ఇళ్ళ సమస్యానూ. కార్మిక వర్గంలో, ఒక ముఖ్య భాగం, తమ బ్రతుకుదెరువుల కోసం, ఊళ్ళ వెంట తిరుగుతూ, పనుల్ని వెతుక్కుంటూ, ఇళ్ళ పేరుతో దొరికే ‘అద్దె గుడిసె’ల తో సంతృప్తిపడే అతి నిరుపేదల భాగమే. పరిశ్రమలన్నీ ఆగి పోవడంతో, వలస కార్మికుల పనులన్నీ పోయి, పూట గడవడం గగనమైంది. అందుకే, ఈ కార్మికులు, తమ సామాన్లని కుక్కుకున్న కావిళ్ళతో, చంకల్లో చంటి బిడ్డలతో, నడవగల ఎడ పిల్లలతో, తాము పుట్టి పెరిగిన ఊళ్ళల్లో తెలిసిన మనుషుల మధ్య, కలో గంజో తాగుతూ బ్రతకాలనే ఆశలతో, వందల మైళ్ళ దూరాల వరకూ నడిచి పోవాలని బైల్దేరారు.


పశువుల్ని పాకల్లోకి తోలినట్టు, ఈ నిరుపేద కార్మికుల కోసం, ఏ సదుపాయాలూ లేని షెల్టర్లు ఏర్పరిచి, కడుపు నింపని తిండి పొట్లాలు పంచితే చాలని, ఆ కార్మికులు, ఆ అరకొర సదుపాయాలతో, అక్కడే నెలల తరబడీ జీవించ గలరనీ – ప్రభుత్వాలు భావించాయి. అద్దె నివాసాలు పోయి రోడ్ల మీదకి చేరిన వలస కార్మికుల్ని, వాళ్ళ ఊళ్ళకి చేర్చే బాధ్యతని మొదట్లో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ కార్మికుల నిరసనలు ఎక్కువయ్యేసరికి, డబ్బు లెక్కలు వేసుకుంటూ, ఇప్పుడు అరకొర ఏర్పాట్లు చెయ్యడం మొదలెట్టాయి.


ప్రకృతి వాతావరణం, వెనకటి కాలంలో కన్నా, ఈనాడు అనేక విధాలుగా అతలాకుతలం అవుతోంది. వెనకటి కన్నా, ఈనాడు భూతాపం ఎందుకు పెరిగింది? అడవుల్లో పెరిగే జంతుజాలాలు, ఈ నాడు మనుషుల ఊళ్ళ మీదకీ, ఇళ్ళ మీదకీ ఎందుకు ఎగబడుతున్నాయి? వెనకటి కాలాల్లో, నిర్మలంగా కనపడే నదులూ, సముద్రాలూ, ఈ నాడు మురికెత్తిన కుళ్ళు మడుగుళ్ళా ఎందుకు తయారయ్యాయి? పరిశ్రమల్లో తయారయ్యే రద్దులూ, మురుగులూ, నదుల్లోకీ, సముద్రాల్లోకీ, ఎందుకు ప్రవహిస్తున్నాయి? పెట్టుబడిదారీ మానవులకు, ప్రకృతి పెద్ద శత్రువు అయిపోయింది. ప్రకృతిలో వున్న భూమినీ, అడవుల్నీ, నదుల్నీ, సముద్రాల్నీ, ఏ మాత్రం కలుషితం చేసినా, అది ప్రకృతిని శత్రువుగా చేసుకోవడమే. మనిషి కూడా ప్రకృతిలో భాగమే అయినా, ఆ మనిషి, తన క్షేమాన్ని తను తెలుసుకోక పోతే, ప్రకృతితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోతే, తనకే అర్ధం కాని సమస్యలు తెచ్చుకుంటాడు. ఉదాహరణకి: దక్షిణ అమెరికా ఖండంలో, ఎమెజాన్ అడవుల్ని, 2003కీ, 2015కీ మధ్య, ఏడాదికి 10 శాతం చొప్పున నరికేస్తే, మలేరియా కేసులు 3 శాతం చొప్పున పెరిగాయని ఒక పరిశోధనలో తేలింది. ఇలాంటి ఉదాహరణలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.


ప్రకృతి శాస్త్రవేత్తలు ఏమంటారంటే: అడవులు అనేవి ప్రమాదకరమైన వైరస్సులకీ- మనుషులకీ మధ్య ఒక రక్షణ కవచంగా వుంటాయి.  అటువంటప్పుడు, అడవుల్ని నరికేస్తే, వాటిలో ఉండే అనేక చిన్నా, పెద్దా జంతు జాలం, వాటి నివాస స్తలాలు కుంచించుకుపోవడంతో, ఆహార వనరులు తగ్గిపోవడంతో, మనుషులు నివసించే ప్రాంతాలకి దగ్గిరవుతాయి. వాటికి వుండే రోగ కారక వైరస్సులు గాలి ద్వారానో, ఆహారం ద్వారానో, ఇతర మార్గాలలోనో మనుషులకు అంటుతాయి -అని.


అంతేకాకుండా, కోళ్ళనీ, కుక్కల్నీ, నక్కల్నీ, పందుల్నీ, ఆవుల్నీ, ఎద్దుల్నీ, పాముల్నీ, పిల్లుల్నీ, బల్లుల్నీ– ఇలా ఎన్ని రకాల జంతువులు వీలైతే అన్ని రకాల జంతువుల్ని, భారీ వ్యవసాయ పరిశ్రమల తరహాలో, కృత్రిమ పద్ధతుల్లో పెంచి, వాటిని ఆహార పదార్ధాలుగా అమ్మడం, ఎగుమతి దిగుమతులు చెయ్యడం, ప్రపంచ దేశాల్లో, ఒక భారీ వ్యాపారంగా సాగుతోంది. ఈ రకం వ్యాపారాలవల్ల విపరీతమైన కాలుష్యం వెలువడి రకరకాల రోగాలు వస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెపుతున్నారు.


ప్రకృతి శాస్త్ర వేత్తలు, పర్యావరణ పరి రక్షణ కోసం, అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూనే వున్నారు. అణు విద్యుత్ కేంద్రాలకూ, అడవుల విధ్వంసానికీ, భారీ నీటి పారుదల ప్రోజెక్టులకూ, విచ్చల విడి గనుల తవ్వకాలకూ – వంటి అనేకమైన ప్రకృతి వాతావరణాన్ని కలుషితం చేసే చర్యల్ని వ్యతిరేకించిన కొందరు ఉద్యమనాయకులు హత్యలకు గురి అయ్యారు. అయినప్పటికీ, పర్యావరణ రక్షణ కోసం ఉద్యమాలు జరుగుతూనే వున్నాయి. 2015లో, కేవలం ఒక్క సంవత్సర కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా, 185 మంది పర్యావరణ ఉద్యమకారుల హత్యలు జరిగినట్టు నమ్మదగ్గ వార్తలున్నాయి. ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలు, అనేక నిర్బంధాలకు గురి అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సొంపేటా, ఒరిస్సాలో నియాంగిరీ, ఛత్తీస్ గుడ్‌లో బైలదిలా - మనకి దగ్గిర ఉదాహరణలు. ఇటువంటి దుర్మార్గాలన్నీ ఎవరి వల్ల జరుగు తున్నాయి? కేవలం పెట్టుబడిదారీ పరిశ్రమ దారుల వల్లా, వారి ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వాల వల్లానూ.


పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పూర్వం ఏ రోగాలూ ప్రారంభం కాలేదా అంటే, ఆ ఉత్పత్తి విధానాలు ప్రకృతి వాతావరణాన్ని ఇంత తీవ్రంగా తాకినవి కావు. అంతే గాక, అదంతా ప్రకృతి శాస్త్రాలు లేని అగ్న్యానపు కాలం. ఈ నాటి కాలం అటువంటిది కాదు. ఈ నాటి పరిశ్రమలకు లాభాల పెంపుదలలే గానీ, ప్రకృతి వాతావరణాల వంటి ఆలోచనలేవీ అక్కర లేదు. అయినా, ఈ ఉత్పత్తి విధానం తెచ్చే దుష్ఫలితాల గురించి తెలుసుకోవడానికి మార్క్సూ, ఎంగెల్సుల రచనల దగ్గిరికి వెళ్ళవలిసిందే. ఎందుకంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఎటువంటి స్వభావంతో సాగుతుందో గ్రహించి, మొట్టమొదటి సారి దాన్ని సర్వ సమగ్రంగా పరిశీలించింది ఆ ఇద్దరే కాబట్టి. సర్వ సమగ్రంగా గ్రహించారని ఎందుకు అనాలంటే, కేవలం వడ్డీ, లాభాల కోసం మాత్రమే పోటీలతో సాగే ఈ ఉత్పత్తి విధానాన్ని తిరస్కరించి, మానవులందరి క్షేమం కోసం ప్రకృతితో సామరస్యానికి వీలు నిచ్చే నూతన ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు సూచించారు కాబట్టి. ఈ నాటి కరోనా పేరు వాళ్ళు ఎత్తక పోయినా, ఆ సమాజ శాస్త్ర గ్న్యానం పాఠకులంగా మనం ప్రతీ అంశాన్నీ గ్రహించగలం.


మార్క్సు-ఎంగెల్సులు చెప్పిన విషయాల సారాంశం క్లుప్తంగా: 

సమాజ రూపం ఏదైనప్పటికీ, శ్రమ అనేది, మానవ జాతి మనుగడకి అవసరమైన షరతు. శ్రమ లేకుంటే మానవులకీ,  ప్రకృతికీ మధ్య భౌతికంగా ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండజాలదు. అంటే మనుగడే వుండదు. – కానీ, ఈ దృష్టి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి లేదు. ఉత్పత్తి సాధానాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండడంతో, ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ ప్రకృతిని విచ్చల విడిగా వాడేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ‘‘తక్షణం’’ తమకు ఏది ఎక్కువ లాభమో, దాని గురించే ఆలోచిస్తారు.


పెట్టుబడిదారీ వ్యవసాయంలో సమస్త పురోగతీ, కార్మికుల్ని దోచే కళ లోనే కాదు, భూమిని దోచే కళలో కూడా పురోగతే.


మొత్తం సమాజం గానీ, అన్ని సమాజాలూ కలిసి గానీ, భూగోళానికి యజమానులు కారు. వారు, దానిని కేవలం ‘ఉపయోగించేవారు’ మాత్రమే.


పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో, కలరా, టైఫస్, మశూచీ, టైఫాయిడ్, ఇంకా అనేక తీవ్రంగా దెబ్బదీసే అంటు రోగాలు, నగరాల్లోని కార్మిక వాడల్లో మొదలై, పెట్టుబడిదారులు నివసించే మెరుగైన ప్రాంతాలకూ విస్తరిస్తాయి.


ఈ నాటి ఉత్పత్తి విధానం అంతా, ఎటువంటి వక్ర బుద్ధితో సాగుతోందో, ఎటువంటి ఆపదలకు కారణం అవుతోందో, ఈ విషయాలు గ్రహించకపోతే మనం మానవులం కాలేము

రంగనాయకమ్మ

Advertisement
Advertisement
Advertisement