Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకటి పూడిస్తే.. మరో రెండు చోట్ల లీకేజీ

ఆందోళనతో తిరుపతి బాట పట్టిన పలువురు పద్మవల్లిపురం గ్రామస్థులు 


రాయలచెరువును పరిశీలించిన కలెక్టర్‌, అర్బన్‌ ఎస్పీ 


రామచంద్రాపురం, నవంబరు 26: రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టకు ఒక లీకేజీ పూడ్చగా.. గురువారం రాత్రి మరో రెండు చోట్ల లీకేజీ అయ్యాయి. దీంతో పద్మవల్లిపురం గ్రామస్థులు సగం మంది సామన్లు సర్దుకుని తిరుపతికి వెళ్తున్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని ఇంజనీర్లతో మాట్లాడారు. లీకేజీ పనులు వేగవంతం చేయాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం రాయలచెరువు లీకేజీ కావడంతో 20 గ్రామాల ప్రజలు ఇల్లు వదిలి పరుగులు తీశారు. ఈ పరివాహ ప్రాంతాల్లోని గ్రామస్థులు ఆందోళన చెందారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌ నిరంతరం పర్యవేక్షించి గండిపూడ్చే పనులను శుక్రవారం కొలిక్కితెచ్చారు. చెరువులోకి వచ్చే వరద నీటిని రెండు మొరవకాలువల ద్వారా బయటకు పంపడంతో ఐదు అఅడుగుల వరకు నీటి మట్టం తగ్గింది. ప్రజలు ఇళ్లకు చేరుకుంటుండగా గురువారం రాత్రి మరో రెండు చోట్ల లీకేజీ కావడంతో ఆందోళన మొదలైంది. కలెక్టర్‌, ఎస్పీ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్‌, ఆఫ్కాన్స్‌ ఇంజనీర్లతో చర్చించారు. మొదట లీకేజీని అరికట్టడంతో నీటి ఒత్తిడితో మరో రెండు చోట్ల లీకేజీ ఏర్పడ్డాయని ఇంజనీర్లు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో అదుపులోకి వస్తాయని తెలిపారు. రాయలచెరువు ప్రధాన కాలువపైన పీవీపురం, సంజీవరాయపురం, పద్మవల్లిపురం గ్రామాలున్నాయి. మరో రెండువంకలు కలసి పద్మవల్లిపురం వచ్చేసరికి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఆ గ్రామంలోని పలువురు శుక్రవారం ఊరొదిలారు. 

కట్ట వద్ద జరుగుతున్న పనులు


పనులను పర్యవేక్షిస్తున్న ఆఫ్కాన్స్‌ ఇంజనీర్లు


Advertisement
Advertisement