Apr 17 2021 @ 08:51AM

ఎన్టీఆర్ 30కి త్రివిక్రమ్ కాకపోయినా వాళ్ళు హ్యాపీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అయితే వాస్తవంగా 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా చేయాల్సింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందని గత ఏడాదే వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవడం..కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రకటించారు. కొరటాల శివ టాలీవుడ్‌లో సక్సస్ ఫుల్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో ఉన్నాడు. ప్రభాస్‌తో తీసిన 'మిర్చి' నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన 'భరత్ అనే నేను' సినిమా వరకు కొరటాల చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సస్‌లను అందుకున్నాయి. అటు నిర్మాతలకి భారీగా లాభాలు.. ఇటు హీరోలకి భారీ సక్సస్‌లు ఇచ్చాడు. 

దాంతో టాలీవుడ్ హీరోలు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఆతృతగా ఉంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ ఊపులోనే కొరటాల శివ - ఎన్టీఆర్ 30 ఫిక్సైంది. అయితే ఎన్టీఆర్ 30కి త్రివిక్రమ్ అన్నప్పుడు అభిమానులు ఆనందం అంతా ఇంతా కాదు. అందుకు కారణం 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్‌ని యమా పవర్‌ఫుల్‌గా చూపించడమే. దాంతో మళ్ళీ ఈ కాంబినేషన్ ప్రకటన వచ్చినట్టే వచ్చి క్యాన్సిల్ అయింది. ఈ న్యూస్ తెలిసినప్పుడు కాస్త ఫీలయినప్పటికి తర్వాత నందమూరి అభిమానులు కాంబినేషన్ మారినందుకు డిసప్పాయింట్ అవడం లేదట. ఎందుకంటే కొరటాల సక్సస్ ట్రాక్ కారణం. అదీకాక కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ కాంబోలో భారీ హిట్ గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.