Abn logo
Jun 4 2020 @ 02:57AM

ఐబీ అధికారి అంకిత్‌ హత్య వెనక పెద్ద కుట్ర!

  • అల్లర్లకు మత రంగు పులిమే యత్నం
  • కోర్టుకు చార్జిషీటు సమర్పించిన పోలీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 3: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత కలహాలలో ఐబీ అధికారి అంకిత్‌ శర్మ దారుణ హత్య వెనక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిఘా అధికారి అంకిత్‌ను పనిగట్టుకుని టార్గెట్‌ చేయడం ద్వారా హిందూ-ముస్లింల మధ్య ద్వేషం, మతకలహాలు పెచ్చరిల్లేలా చేసేందుకు కొందరు పన్నాగం పన్నినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ‘ఆప్‌’కు చెందిన సస్పెండైన కౌన్సిలర్‌ తాహీర్‌ హుసేన్‌ ఐబీ అధికారి హత్యకు పురిగొల్పాడని పోలీసులు స్థానిక కోర్టుకు బుధవారం సమర్పించిన చార్జిషీటులో పేర్కొన్నారు.


చాంద్‌బాగ్‌ పులియా వద్ద అంకిత్‌ శర్మను కొంతమంది దుండగులు కర్రలతో బాది, అనేకసార్లు కత్తిపోట్లు పొడిచి శవాన్ని మురిక్కాలువలో పడేశారు. ఈ దృశ్యాలను సమీపంలోని ఒక మేడ మీద నుంచి నీరజ్‌ కసానా అనే యువకుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. తాహీర్‌ ఇంట్లోనే కూర్చుని అంకిత్‌ను హత్య చేయించేందుకు తన అనుచరులను రెచ్చగొట్టాడు. తాను, తనతోపాటు వచ్చిన కొందరు కలిసి కత్తితో దాడి చేసి అంకిత్‌ను చంపామని ఈ కేసులో నిందితుడు సల్మాన్‌ ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. ఐబీ అధికారిని చంపడం ద్వారా అల్లర్లకు మత కలహాల రంగు ఇచ్చేందుకు తాహీర్‌ ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement