Abn logo
Apr 5 2021 @ 15:34PM

జయా బచ్చన్‌కు స్వాగతం: బీజేపీ నేత

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి రానున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, సినీనటి జయాబచ్చన్‌కు తాను స్వాగతం పలుకుతున్నట్లు భారతీయ జనతా పార్టీ నేత బాబుల్ సుప్రియో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీని ఆమె విమర్శించినప్పటికీ, తనకు వ్యతిరేకంగా ఒక్క మాటైన మాట్లాడబోరని ఆయన అన్నారు. సోమవారం టోల్లిగుంగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘పశ్చిమ బెంగాల్‌లోకి ఆమె స్వాగతం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎవరి తరపునైనా ప్రచారం చేయొచ్చు. బచ్చన్ కుటుంబంతో నాకు ఉన్న సంబంధాల గురించి నేనేమీ మాట్లాడను. కానీ ఆమెకు నేను బాగా తెలుసని మాత్రం చెబుతాను. ఆమె భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ నాకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడరు’’ అని బాబుల్ సుప్రియో అన్నారు.