Abn logo
Apr 1 2021 @ 16:38PM

ఇంత చెత్త ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు: మమత

కోల్‌కతా: ప్రస్తతం పశ్చిమ బెంగాల్‌‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు. తన జీవితంలో ఇంత చెత్త ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు. గురువారం పోలింగ్ జరుగుతున్న నందిగ్రామ్‌లో నెలకొన్న పరిస్థితుల అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై మమత మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో విజయం మనదే. అందుకే నేను మీకు విజయ చిహ్నం ‘వీ’ చూపిస్తున్నాను. అంతే కాదు, ఎన్నికల సంఘానికి, అమిత్ షాకు నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీ గూండాలను అదుపులో పెట్టుకోండి. వారు మహిళా జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను. వారిని దుర్భషలాడుతున్నారు. గవర్నర్‌తో నేనేం మాట్లాడనో భయటపెట్టను. ఇది చాలా గోప్యంగా ఉంటుంది’’ అని అన్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల సరళిపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంత చెత్త ఎన్నికలను నా జీవితంలో చూడలేదు’’ అని మమత అన్నారు.


బెంగాల్‌లో కొనసాగుతున్న రెండవ దశ పోలింగులో భాగంగా నందిగ్రామ్‌లో ఉన్న పోలింగ్ బూత్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ‘‘సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వడం లేదు. ఉదయం నుంచి నేను ప్రచార పర్వంలో ఉన్నాను. దయచేసి ఈ సమస్యపై దృష్టి సారించండి’’. అంటూ సీఎం మమత ఫోన్‌లో గవర్నర్‌ను కోరారు. యూపీ, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్ బూత్‌ ముందు నానా హంగామా సృష్టిస్తున్నారని దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హంగామా సృష్టించడానికే వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చారని ఆరోపించారు. నందిగ్రామ్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 7 లోకి ప్రజలెవ్వర్నీ సీఆర్పీఎఫ్ జవాన్లు రానివ్వడం లేదని మమత ఆరోపించారు.