Abn logo
May 22 2020 @ 22:40PM

హైదరాబాద్‌ పోలీస్ శాఖలో కరోనా కలకలం.. ఐదుగురిగి పాజిటివ్!

హైదరాబాద్ : కరోనా మహమ్మారిపై పోరాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఖాకీలను కూడా వైరస్ వదలట్లేదు.! ఇప్పటికే కరోనాతో తెలంగాణలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు తెలియడంతో కలకలం రేగింది. తాజాగా.. మరో ఐదుగురు పోలీసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వడంతో విధులకు రావడానికి ఖాకీలు జంకుతున్నారు. హైదరాబాద్‌ పోలీసు శాఖలో ఐదుగురు పోలీసులకు కరోనా సోకింది. ఇవాళ చిలకలగూడ ఎస్సైకి పాజిటివ్ అని తేలింది. ఆ ఎస్సై కుటుంబీకులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలియవచ్చింది. ఆయనతో పాటు నాలుగు స్టేషన్లలో విధులు నిర్వహించే నలుగురు పోలీసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇవాళ మొత్తం ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.


పోలీసు వర్గాల్లో ఆందోళన..!

తాజా ఘటనతో 27 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిసింది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసు వర్గాల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు రాచకొండ పరిధిలోని బాలాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించి.. స్టేషన్‌లో పనిచేసే పలువురు సిబ్బంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ నగరంలో మొత్తం 48 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిసింది. కొందరు లాంగ్‌లీవ్‌లో వెళ్లేందుకు అనుమతివ్వాలని వారిపై అధికారులను కోరుతున్నారట.


కుటుంబాలకు దూరంగా..!

మరోవైపు కరోనా లక్షణాలున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు కుటుంబానికి దూరంగా ఉంటూ అద్దె గదుల్లో ఉంటున్నారని సమాచారం. ఇంకొందరైతే స్టేషన్‌లోనే రాత్రింబగళ్లు గడిపేస్తున్నారట. కంటైన్మెంట్ ఏరియాల్లో విధులు నిర్వహించి పీఎస్‌కు వచ్చిన అనంతరం దుస్తులు వారే డెటాల్‌తో శుభ్రంగా ఉతుక్కుంటున్నారని సమాచారం. ఇలా పలువురు పోలీసులు కుటుంబానికి దూరంగా గడుపుతున్నారని తెలిసింది. అయితే నగరంలో పలువురు పోలీసులకు కరోనా అని తేలినప్పటికీ ఉన్నతాధికారులు బయటపెట్టకుండా గోప్యత పాటిస్తున్నారని తెలుస్తోంది. మానసిక స్థైర్యం కోల్పోవద్దని ఏ మాత్రం లక్షణాలున్నట్లు అనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement