Advertisement
Advertisement
Abn logo
Advertisement

చ.గ.రూ.35 వేలు

అప్‌సెట్‌ ధర 

ప్రీ బిడ్‌.. విశేష స్పందన

డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల వేలం

రూ.400 - 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా


హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రీ బిడ్‌ సమావేశం సోమవారం జరిగింది. వెంచర్‌లో జరిగిన మీటింగ్‌లో పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు, డెవలపర్లు, రియల్టర్లు వ్యక్తపర్చిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అభివృద్ధి చేసిన వెంచర్‌లో 44 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. నిబంధనలు, ఈఎండీ చెల్లింపు, వేలంలో ఎలా పాల్గొనాలి ఇలా.. తదితర అంశాలను వివరించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్లాట్ల వేలం జరగనుంది. చదరపు గజం ధరను రూ.35 వేలుగా నిర్ణయించారు. అంతకంటే తక్కువ కాకుండా కోట్‌ చేస్తూ కొనుగోలుదారులు వేలంలో పాల్గొనాలి. ప్లాట్‌ దక్కించుకున్నవారు 90 రోజుల్లో నిర్ణీత మొత్తం చెల్లించాలి. అనంతరం 15 రోజులకు వారి పేరిట హెచ్‌ఎండీఏ రిజిస్ర్టేషన్‌ చేస్తుంది. ప్లాట్‌ విలువలో 25 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


సకల సదుపాయాలు

733 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇందులో 250 ఎకరాలను రోడ్లు, పార్కులు, ఓపెన్‌ స్పేస్‌ తదితర మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మధ్య ఉన్న లే అవుట్‌కు నాగోల్‌-పీర్జాదిగూడ లింక్‌ రోడ్‌తో కనెక్టివిటీ ఉంది. ఈ రహదారి మీదుగా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఎల్‌బీనగర్‌ నుంచి వరంగల్‌ జాతీయ రహదారి వైపు, అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌ వైపు వచ్చే అవకాశముంటుంది. అన్నీ సదుపాయాలు అందుబాటులో ఉండేలా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్‌ కమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బహుళ వినియోగం కోసం ప్లాట్లు కేటాయించారు. దీంతో డిమాండ్‌ అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు లే అవుట్‌లో ప్లాట్ల వేలం జరిగింది. చదరపు గజానికి రూ.25 వేలు అప్‌సెట్‌ ప్రైస్‌ నిర్ణయించగా.. రూ.35 వేల నుంచి అత్యధికంగా రూ.72 వేల వరకు కొన్ని ప్లాట్లు ధర పలికాయి. ఈ సారి పెద్ద ప్లాట్లు చ.గ. రూ.80 వేలు, అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతాయని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. 1.35 లక్షల చ.గ.ల విస్తీర్ణంలోని 44 పాట్ల వేలం ద్వారా రూ.400-500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. లే అవుట్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నా.. ఇక్కడి నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతి ఇవ్వనుంది. 

వేలంలో పాల్గొనాలనుకుంటే..రూ.1000 చెల్లించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

కొనుగోలు చేయాలనుకునే ప్లాట్‌ విలువలో (అప్‌సెట్‌ ప్రైస్‌ ప్రకారం) బ్యాంకు రుసుముతో సహా ఐదుశాతం ఈఎండీ చెల్లించి వేలంలో పాల్గొనాలి. 

వేలంలో ప్లాట్‌ దక్కకుంటే ఈఎండీ తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 

దేశంలో నివసించే ఇతర దేశస్తులకు అనుమతి ఉండదు. 

రిజిస్ర్టేషన్‌ సహా మొత్తం ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

మొత్తం 44 ప్లాట్లు వేలం వేయనుండగా.. రెసిడెన్షియల్‌-21, మల్టీ పర్పస్‌ - 15, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌-4, ఎడ్యుకేషనల్‌ 

ఇన్‌స్టిట్యూట్‌లు-2 ఉన్నాయి. 

ప్లాట్లు 150 చ.గల నుంచి 5 వేల చ.గలకుపైగా విస్తీర్ణంలో ఉన్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement