Abn logo
Sep 15 2021 @ 03:49AM

మెట్రోను ఆదుకుంటాం

  • హైదరాబాద్‌కు మెట్రో సేవలు ఎంతో అవసరం
  • అన్ని రంగాల్లాగే మెట్రోపైనా కరోనా ప్రభావం
  • ఆర్థిక నష్టాలు, అప్పుల్లో కూరుకుపోవడం ఇబ్బందే
  • పూర్వ వైభవానికి ప్రభుత్వం తరఫున సహకారం
  • అత్యున్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయిస్తాం
  • కమిటీలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌
  • ఎల్‌అండ్‌టీ కంపెనీ అధికారులకు సీఎం కేసీఆర్‌ హామీ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గడంతో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ మెట్రోను ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇందుకోసం అన్ని అవకాశాలనూ అన్వేషిస్తామని తెలిపారు. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ఎల్‌అండ్‌టీ కంపెనీకి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఎల్‌అండ్‌టీ కంపెనీ ఉన్నతాధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ హామీ ఇచ్చారు. మంగళవారం ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా కారణంగా మెట్రో ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మెట్రో అనతికాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా సేవలందిస్తూ ప్రజాదరణ పొందిందన్నారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి ఉందని అన్నారు. అయితే కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయని పేర్కొన్నారు.


కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం ఇబ్బందేనన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకున్నట్లే మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందని తెలిపారు. మెట్రోకు ఎలా మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అన్నారు. మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేలా అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సభ్యులుగా ఉంటారని తెలిపారు. అన్నిరకాలుగా అధ్యయనం చేసి త్వరగా నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎల్‌అండ్‌టీ సీఈవో అండ్‌ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్‌ రెడ్డి, సంస్థ డైరెక్టర్‌ డీకే సేన్‌, ప్రాజెక్టుల సీఈవో అజిత్‌, హైదరాబాద్‌ మెట్రో సీఈవో కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.