Abn logo
Apr 22 2021 @ 03:59AM

రైజర్స్‌ ఎట్టకేలకు..

బౌలర్లు భళా

బెయిర్‌స్టో (56 బంతుల్లో 63 నాటౌట్‌)

హైదరాబాద్‌ తొలి గెలుపు


చెన్నై: కొంచెం ఆలస్యమైనా ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత విజయాన్ని అందుకున్నది. బుధవారంనాటి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో పంజాబ్‌ను చిత్తుచేసింది. పేసర్లు, స్పిన్నర్లు భళా అనిపించడంతో మొదట పంజాబ్‌ను 19.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూల్చింది. మయాంక్‌ అగర్వాల్‌ (22), షారుక్‌ఖాన్‌ (22) టాప్‌ స్కోరర్లు. ఖలీల్‌ అహ్మద్‌ (3/21) మూడు, అభిషేక్‌ శర్మ (2/24) రెండు వికెట్లు సాధించారు. అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో కేవలం వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బెయిర్‌స్టో (56 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 నాటౌట్‌), వార్నర్‌ (37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37) రాణించారు. 


వార్నర్‌, బెయిర్‌ స్టో దూకుడు : ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో మరోసారి జట్టుకు అద్భుత ఆరంభం ఇచ్చారు. ఫోర్‌తో వార్నర్‌ ఖాతా తెరవగా..రెండో ఓవర్లో 4,6తో అలెన్‌కు బెయిర్‌స్టో స్వాగతం పలికాడు. షమి ఓవర్లో వీరు చెరో ఫోర్‌ బాదగా..హెన్రిక్స్‌ బంతిని బెయిర్‌స్టో సిక్సర్‌గా మలిచాడు. మరోవైపు అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఫోర్‌ కొట్టడంతో  పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ 50/0తో నిలిచింది. కానీ 11వ ఓవర్లో వార్నర్‌ను అలెన్‌ అవుట్‌ చేయడంతో 73 పరుగుల మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సీజన్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన కేన్‌ విలియమ్సన్‌ బెయిర్‌స్టోకు జత కలిశాడు. మధ్య ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు ఒకింత పరుగులను నియంత్రించగా..18వ ఓవర్‌ మొదటి బంతిని ఫోర్‌గా బాదిన బెయిర్‌స్టో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తదుపరి ఓవర్లో మరో భారీ సిక్సర్‌ కొట్టిన బెయిర్‌స్టో జట్టును విజయానికి చేరువ చేశాడు. విలియమ్సన్‌ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


హైదరాబాద్‌ బౌలర్ల కట్టడి: టాస్‌ గెలిచిన పంజాబ్‌ మరో ఆలోచన లేకుండా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి షాట్లు ఆడడమే పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. అదిరిపోయే ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను నాలుగో ఓవర్లో అవుట్‌ చేసిన భువనేశ్వర్‌ ప్రత్యర్థికి ఝలక్‌ ఇచ్చాడు. అగర్వాల్‌-గేల్‌ రెండో వికెట్‌కు 24 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఏడో ఓవర్లో అగర్వాల్‌ పెవిలియన్‌ చేరగా పూరన్‌ (0) గోల్డెన్‌ డకౌటయ్యాడు.. గేల్‌ (15)ను రషీద్‌ఖాన్‌ ఎల్బీగా బలిగొన్నాడు. హూడా (13), ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ (14) కొద్దిసేపు హైదరాబాద్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆపై..స్థానిక హీరో షారుక్‌ఖాన్‌ ఒకట్రెండు భారీ షాట్లతో అలరించాడు. 


కోహ్లీ రికార్డు దాటేసిన రాహుల్‌

విరాట్‌ కోహ్లీ రికార్డును పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బద్దలుగొట్టాడు. టీ20ల్లో వేగంగా ఐదు వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ ఘనత అందుకున్నాడు. ఈ మైలురాయిని  రాహుల్‌ 143 ఇన్నింగ్స్‌లో చేరుకోగా.. కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లో ఆ పరుగులు సాధించాడు. 


స్కోరుబోర్డు

పంజాబ్‌ : కేఎల్‌ రాహుల్‌ (సి) కేదార్‌ (బి) భువనేశ్వర్‌ 4, మయాంక్‌ (సి) రషీద్‌ (బి) ఖలీల్‌ 22, గేల్‌ (ఎల్బీ) రషీద్‌ 15, పూరన్‌ (రనౌట్‌/వార్నర్‌) 0, దీపక్‌ హూడా (ఎల్బీ) అభిషేక్‌ 13, హెన్రిక్స్‌ (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) అభిషేక్‌ 14, షారుక్‌ఖాన్‌ (సి) అభిషేక్‌ (బి) ఖలీల్‌ 22, అలెన్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 6, ఎం.అశ్విన్‌ (సి) బెయిర్‌స్టో (బి) కౌల్‌ 9, షమి (రనౌట్‌-శంకర్‌/బెయిర్‌స్టో) 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం 19.4 ఓవర్లలో 120 ఆలౌట్‌. వికెట్లపతనం: 1/15, 2/39, 3/39, 4/47, 5/63, 6/82, 7/101, 8/110, 9/114, 10/120. బౌలింగ్‌: అభిషేక్‌ శర్మ 4-0-24-2, భువనేశ్వర్‌ 3-0-16-1, ఖలీల్‌ అహ్మద్‌ 4-0-21-3, సిద్ధార్థ్‌ కౌల్‌ 3.4-0-27-1, విజయ్‌ శంకర్‌ 1-0-6-0, రషీద్‌ ఖాన్‌ 4-0-17-1


హైదరాబాద్‌: వార్నర్‌ (సి) మయాంక్‌ (బి) అలెన్‌ 37, బెయిర్‌స్టో (నాటౌట్‌) 63, విలియమ్సన్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 18.4 ఓవర్లలో 121/1. వికెట్‌పతనం : 1/73. బౌలింగ్‌: షమి 2-0-16-0, ఫాబియన్‌ అలెన్‌ 4-1-22-1, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.4-0-31-0, హెన్రిక్స్‌ 1-0-7-0, మురుగన్‌ అశ్విన్‌ 4-0-22-0, దీపక్‌ హూడా 4-0-22-0.

Advertisement
Advertisement
Advertisement