Abn logo
Jan 18 2021 @ 00:29AM

మురుగునీరు తాగేదెలా..?

  1. మురుగునీటి కాలువల్లో పైపులైన్లు
  2. అడుగడుగునా లీకేజీలు
  3. రంగు మారి.. పాచిపట్టిన నీరు
  4. రాంజల చెరువు నుంచి నేరుగా సరఫరా


ఆదోని, జనవరి 17: పురపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాలం చెల్లిన పైపులైన్లకు తోడు తరచూ లీకేజీలు ఇందుకు కారణం. పట్టణంలో పలుచోట్ల మురుగునీటి కాలువల్లో పైపులైన్లు ఉండటం మరింత ప్రమాదకరంగా పరిణమించింది. చాలా ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. కానీ పైపు లైన్ల లీకేజీ ఉన్న ప్రాంతాల్లో వారం నుంచి 15 రోజులకు ఒకసారి నీటిని విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చాలా ప్రాంతాల్లో కొళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఎల్లెల్సీ కెనాల్‌ నుంచి సరఫరా అయ్యే నీటిని నేరుగా పంపింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  పట్టణంలో నీటి సమస్య దీర్ఘకాలంగా ఉన్నప్పటికీ పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. బసాపురం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు సైడ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. మరమ్మతులు కారణంగా నీటిని పంపింగ్‌ చేయలేదు. దీంతో రాంజల చెరువుకు నీరు మళ్లించి ఫిల్టర్‌ చేయకుండానే నేరుగా కొళాయిలకు సరఫరా చేస్తున్నారు. రాబోయే వేసవిలో నీటి ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. 


నీటి సరఫరా వ్యవస్థ

పట్టణ జనాభా : 2011 జనాభా లెక్కల ప్రకారం 1,66,537

పైపులైన్‌ : 300 కిలోమీటర్లు

తుప్పుపట్టిన పైపులైన్‌ : దాదాపు 60 కిలోమీటర్లు

పైప్‌లైన్‌ లీకేజీలు : 25 చోట్ల

నీటి అవసరం రోజుకు : 27 మిలియన్‌ లీటర్లు 

రోజుకు నీటి సరఫరా : 20 నుంచి 22 మిలియన్‌ లీటర్లు

సరఫరా తీరు : సగటున నాలుగు రోజులకు ఒక సారి


వేసవిలో ఎలా..?

ఆదోని పట్టణం లో 19,488 ఇంటి కొళాయిలు ఉన్నాయి. పైపులైన్‌లు లేని కాలనీలకు మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. దగ్గర కాలనీలకు 8 నుంచి 10 ట్రిప్పులు, దూరంగా ఉన్న కాలనీలు 5 నుంచి 6 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. ఎల్లెల్సీలో నీటి సరఫరా నిలిచిపోతే, పట్టణానికి సరపడా నీరు రాంజల చెరువులో లేదు. రెండున్నర లక్షల జనాభా ఉన్న ఆదోనికి బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పూర్తిస్థాయిలో నింపితే 10 నెలలకు సరిపడు తుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.


మురుగు కాలువల్లో..

ఆర్టీసీ కాలనీ, వెంకన్నపేట, భాస్కర్‌ రెడ్డి నగర్‌, హనుమాన్‌ నగర్‌, గౌళిపేట, ఎంఎం కాలనీ, రాయనగర్‌ తదితర ప్రాంతాల్లో మురుగునీటి కాలువల్లో తాగునీటి పైపులైన్లు ఉన్నాయి. లీకేజీల కారణంగా నీరు కలుషితమౌతోంది. మురుగునీటిలో పైప్‌లైన్లు ఉండటంతో లీకేజీలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు వాటిని తాగి రోగాలబారిన పడుతున్నారు. పట్టణంలోని కొన్నిచోట్ల ప్రధాన పైపులైన్లు పగిలిపోయి నీరు వృథా అవుతోంది. రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులు చేయాలంటే విజయవాడ నుంచి సామగ్రి తెచ్చుకోవాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. అదనపు పైపులు లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని సమాచారం.


ప్రజలు చెప్పినా..

పట్టణంలో పైప్‌లైన్ల ద్వారా కలుషిత నీరు వస్తోందని, ఆ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రజలు పలుమార్లు తెలియజేశారు. పాచి నీరు, రంగుమారిన నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తున్నామని చెప్పి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం లేదు. పైపులైన్ల లీకేజీల కారణంగా చాలా కాలనీల్లో ప్రజలకు నీరు అందడం లేదు. 


ఎన్నిసార్లు చెప్పినా..

నీటి సమస్య గురించి అధికా రులకు అనేకసార్లు విన్నవిం చాం. శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నారు. కలుషిత నీరు వస్తోందని వాటర్‌ మెన్‌కు, అధికారులకు చెప్పాం. ఎవరూ  పట్టించు కోవడం లేదు. నీరు తాగితే జ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో భయపడు తున్నాం. నీరు ఇలా ఉంటే మా పరిస్థితి ఏమిటి..? - ముత్తమ్మ, కార్వన్‌పేట


ఎర్రగా వస్తున్నాయి

తాగే నీరు ఎర్రగా వస్తోంది. ఫిల్టర్‌ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. వాటిని తాగి రోగాలబారిన పడుతున్నాం. నీటిని శుద్ధి చేసిన తరువాత కొళాయిలకు వదలాలి. - అంజనాదేవి, అంబేడ్కర్‌ నగర్‌


శుద్ధిచేసిన నీరే ఇస్తాం..

శుద్ధి చేసిన తరువాతే పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తాం. బసాపురం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ సైడ్‌వాల్స్‌ దెబ్బతినడంతో రాంజల చెరువుకు పంపింగ్‌ చేసి అక్కడి నుంచి పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నాం. ఎక్కడా రంగుమారిన నీటిని పంపింగ్‌ చేయం. - ఆర్‌జీవీ కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
Advertisement
Advertisement