Abn logo
May 2 2020 @ 01:54AM

ఆర్థిక విపత్తును ఎలా ఎదుర్కొవాలి?

మన దేశంలో పొదుపు రేటు 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఆదాయ వనరులు ఒకవైపు తగ్గిపోతుంటే విలాస వ్యయాలు పెరిగిపోవటం ఇందుకు కారణం. ‘వ్యయం మీద అదుపు, ఆదాయంలోంచి పొదుపు’ అనే సూత్రమార్గంలోకి మళ్లీ మనం వెళ్లాలి. పాశ్చాత్య తరహా జీవన విధానంలోంచి, వాణిజ్య తరహా భావజాలంలోంచి బయటపడగలగాలి. మన జీవితంలో భారతీయాత్మ ప్రతిబింబించాలనేది మహాత్ముడి కల. సంక్షోభ సమయంలో అదే మనకు రక్ష!


కరోనా సృష్టించిన విలయానికి మించిన ఆర్థిక సంక్షో భం మున్ముందు ప్రపంచాన్ని ఆవహించబోతోంది. ఈ అలజడి ఇంకా ముగియక మునుపే కరువు  ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది మహమ్మారిని మించిన ప్రమాదకారి. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అగ మ్య గోచరం. ఇది ఒకరోజుతో ముగిసే వ్యవహారం కాదని, సుదీర్ఘకాలం దీని చెడుప్రభావం ఉంటుందంటున్నారు. అధిక జనాభా కలిగిన భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడితే జీవితం దుర్భరం కావచ్చు. మనల్ని మనం సంస్కరించుకుని, జీవన విధానంలో ఆర్థిక క్రమశిక్షణతో కూడిన మార్పులు తెచ్చుకోవలసిన పరిస్థితి ఆసన్నమైంది.!


‘యుక్తాహార విహారస్య యుక్తా చేష్టస్య కర్మసు/యుక్తా స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః’అని గీతాకారుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుందాం. హితకరమైన ఆహార విహారాలు గలవారికీ, ఇతరులకు మంచి చేసే విధ ంగా ప్రవర్తించే వారికీ, రోజువారీ నిద్రాహార విధుల్ని పాటించే వారికి దుఃఖం కలగదని, వ్యాధులు రావనీ భగవద్గీత చెప్తోంది. దుఃఖాలను బాపుకునే యోగం సిద్ధించాలంటే మనం అందుకు అర్హులం కావాలనేది దీని తాత్ప ర్యం. రోగనిరోధక శక్తి రాత్రికి రాత్రి వచ్చేది కాదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్బు పారేసి రోగనిరోధక శక్తిని కొనేద్దాం అంటే చెల్లదు. హితకర పదార్థాలు తినే వారికి, అహితకర పదార్థాలు మానిన వారికి రోగనిరోధక శక్తి త్వరగా పెరుగుతుందని శాస్త్రం! ‘సమాజ ధర్మం’ పాటించిన వారికి శారీరక ఆరోగ్యం దండిగా ఉంటుందని దీని భావం. 2000 మిలీనియం సంవత్సరం తరువాత ఈ 20 యేళ్ల కాలంలో మన జీవితాలలో విశేషమైన మార్పులొచ్చాయి. వాణిజ్య సంస్కృతి విపరీతంగా ప్రబలింది. లాభాపేక్ష తప్ప మరొక ధ్యాస లేకుండా పోతోంది. ‘యథాలాభ సంతుష్టి’ అంటే, ప్రాప్తించిన దానితో సంతృప్తి చెందే లక్ష ణం ఒకప్పుడు మనకు ఆదర్శంగా ఉండేది. దాని స్థానంలో అధిక లాభాపేక్ష, అధిక ధనార్జన, అధిక భోగాభిలాష చేరాయి. వ్యామోహం కొద్దీ ఈ తరహా పాశ్చాత్య జీవన విధానాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాం. తద్వారా శారీరక, మానసిక, సామాజిక అవ్యవస్థల్ని పెంచి పోషిస్తోన్నాం. వ్యాధులకు త్వరగా తలుపులు తెరిచే పరిస్థితులివి. 


ఈ రోజు ఇంత నాగరికతను, వైఙ్ఞానికతను సాధించానని ఘనంగా చెప్పుకుంటున్న మనిషికి చేతులు కడుక్కోవటం ఎలాగో టీవీల్లో చూపించి నేర్పాల్సి వస్తోందంటే మనం పురోగమించామా లేక తిరోగమించామా అనే సందేహం కలుగుతోంది. ‘ఎంత పేదవాడైనా తన గుడిసెను ఊడ్చుకోకుండా, వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లకుండా ముగ్గులు దిద్దకుండా ఉండరు. ఇంటిని పరిశుభ్రంగానూ, చూడచక్కగానూ తీర్చిదిద్దుకోవటం మన సాంప్రదాయం...’ అంటారు గాంధీజీ! అన్ని కులాలవాళ్ళు, మతాలవాళ్లు కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్లేవారు కాదా రోజుల్లో. వాటిని మనం ఛాందస భావాలుగా కొట్టి పారేశాం. ఇప్పుడు అవే శరణ్యం అయ్యాయి. ఇంటిని, వంటినీ, దేశాన్నీ, దేహాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుచి అనేది మన జీవితంలో భాగం కావాలి. భవిష్యత్తులో ఏ మహమ్మారీ మన జోలికి రాలేని రీతిలో సమాజ ధర్మాన్ని మనం పాటించాలి.


కరోనా ఉన్న వ్యక్తి బహిరంగంగా తుమ్మితే చుట్టూ ఉన్న పదిమందికి సోకుతుంది. సామాజిక అధర్మానికి ఇదొక ఉదాహరణ మాత్రమే! వ్యాధిని మరొకరికి చేర్చటానికి మనం వాహకులుగా మారకూడదనేది లాక‍డౌన్‌లో రహస్యం. మన నుండి ఇతరులకు దగ్గు, తుమ్ము తుంపర్లు చేరకుండా ఉండటానికే మనం ముఖపట్టీ (Facial mask) వాడుతున్నాం! ఇతరుల కోసం జీవించటం అంటే ఇదే! మన జీవితానికి అది పరమ లక్ష్యం కావాలి. ప్రజలకే కాదు పాలకులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.


కొన్ని సందర్భాల్లో ఇది కరోనా మీద పోరాటంగా కాకుండా ప్రజలమీద చేసే పోరాటంగా మారుతోంది. పనుల కోసం పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రాలకు తరలి పోయిన వలస కార్మికుల విషయం ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా ఈ అర్థరాత్రినుంచీ లాక్‌డౌన్ అని రాత్రి 8 గంటలకు ప్రకటిస్తే, చేస్తున్న పనులు ఆగిపోయి, ఎక్కడికి పోవాలో అర్థం కాక, ఏం తినాలో తెలీక దిక్కు తోచని కార్మికులు ‘ఎవరికి పుట్టిన బిడ్డలు’ అన్నట్టుగా మారారు. ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిస్థితి. లాక్‌డౌన్ ఘట్టం చరిత్రలో వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వానికి సాక్ష్యంగా, ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. వేల మైళ్లు కాలినడకన ఇళ్ళకు పోవటానికి వాళ్లు ప్రయత్నించటం, దారిలో కొందరు ప్రాణాలు కోల్పోవటం హృదయవిదారకం. ‘ఆ అవ్వే మరణిస్తే/ఆ పాపం ఎవ్వరిదని/వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది’ అనే శ్రీ శ్రీ వాక్యాలు అక్షరాలా ఇక్కడ వర్తిస్తాయి.


పాలనా వ్యవస్థలు తామొక్కరే కరోనా మీద పోరాటం చేస్తున్నామన్న భావనలో ఉన్నాయి. నిజానికి పోరాడవల్సిన వారు ప్రజలు. వారికి సహకరించ వలసింది ప్రభుత్వాలు.‘ప్రజాసుఖే సుఖం రాఙ్ఞాః ప్రజానాం చ హితే హితం నాత్మప్రియం హితం రాజానాః ప్రజానాం తు ప్రియం హితం’ అనేది కౌటిల్యుడి రాజనీతి సూత్రం. ‘ప్రజా సుఖంలోనే పాలకుడి సుఖం ఇమిడి ఉంటుంది. ప్రజల సంక్షేమంలోనే పాలకుడి సంక్షేమం కూడా ఇమిడి ఉంటుంది. తనకు మాత్రమే సంతోష దాయకమైన విషయాలను కాక, తన ప్రజలకు సంతోషం కలిగించే అం శాలు ఎక్కువ లాభదాయకంగా ఉంటా’యంటాడు కౌటిల్యుడు. ప్రజాహితాన్ని కేవలం నోటిమాటగా భావించే పాలకులకు ఈ వాక్యాలు కంటితెరుపు కావాలి.  


పాకిస్థాన్‌తో యుద్ద సమయంలో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆహార ధాన్యాల కొరత తీరటానికి సోమవారం ఒక పూట భోజనం మానేయాలని ప్రజలను కోరితే భారతీయులందరూ శాస్త్రీజీ మాట శిరోధార్యంగా భావించారు.రాజకీయ నిర్ణాయక శక్తి బలంగా, నిష్కల్మషంగానూ ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వాలతో పాటు నడుస్తారు. నాయకత్వ లేమి అనేది దేశానికి ఒక పెద్ద సమస్య కాకూడదు. నాయకత్వంలో ప్రజాహితం ప్రధాన అంశం కావాలి. అదే చివరికి రాజకీయ ప్రయోజనాలను తెచ్చి పెడ్తుందనే విషయాన్ని మరచిపోవటం ఒక కొత్త పరిణామం. రాజకీయ ప్రయోజనాల పేరుతో తోచినది చేయటం వలన అపకారం జరుగుతుంది. అమెరికాలో ఈ పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం.


ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజాధనాన్నీ, ప్రజాభిమానాన్ని పణంగా పెట్టి కరోనా పై విజయం సాధించగల మనుకోవటం అపోహ. జవాబుదారీ తనం అనేది నిర్ణయాత్మకంగా ఉండాలి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో నిధుల వినియోగం విషయంలో మహాత్ముడు అనుసరించిన పారదర్శకత, మంత్రిగా ఉన్నప్పుడు సొంతానికి ప్రభుత్వ వాహనం కూడా వాడని లాల్‘ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తుల ప్రభావం సమకాలీన ప్రజల మీద ఎంత సానుకూలంగా ఉండేదో మనకు తెలుసు. రాజకీయ వ్యవస్థ ప్రజలను తప్పక ప్రభావితం చేస్తుంది. అది ధర్మబద్ధంగా ఉంటే ఆ ప్రభావం ప్రజల్ని శారీరక, మానసిక ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. 


నానాటికీ పెరిగిపోతున్న ప్రభుత్వ దుబారా పోకడలు, ప్రజాధన వినియోగం పట్ల నిర్లక్ష్య ధోరణులు రానున్న ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచేవిగానే ఉంటాయనిపిస్తోంది. అధికార గణం స్వల్ప ప్రయాణాలకు ప్రత్యేక విమానాలు, ప్రభుత్వ అతిథి గృహాలకు బదులుగా 5 నక్షత్రాల విలాస నివాసాలు ఇవన్నీ ప్రజా ధనానికి జవాబుదారీ లేని తనానికి సాక్ష్యాలు. ఇది దేశంలో అన్ని చోట్లా దర్శనం ఇస్తున్న వాస్తవమే! ప్రైవేటు కంపెనీల యజమానుల్ని లాక్‘డౌన్ సమయంలో తమ సిబ్బందికి పూర్తి జీతాలివ్వాలని శాసిస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వోద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితిలో పడటం విచిత్రం. సంక్షోభ సమయంలో ముఖ్యమైంది ఆర్థిక క్రమశిక్షణ. దాన్ని ఆచరణలో చూపించి ప్రజల్ని సన్నద్ధుల్ని చేయటాన్ని పాలనా వ్యవస్థ మరిచింది. 


పాలకులు ప్రజలకు రక్షకులుగా నిలబడాలని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో రాశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధిక సంఖ్యాకుల మెప్పుతోనే అధికార పీఠం ఎక్కుతారు. కానీ, పరిపాలన కొచ్చేసరికి కొద్దిమంది ఇష్టమైన వారి కోసమే అధికారంలోకి వచ్చామనే రీతిలో పాలన సాగకూడదు. ఆర్థిక సంక్షోభం వస్తే మీ వెనుక మేమున్నామనే భరోసా ప్రభుత్వం ప్రజలందరికీ ఇవ్వగలగాలి. సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటి కష్టాలు, నష్టాలు అనుభవించేది ప్రజలే! ప్రజల పరంగా తీసుకోవలసిన నష్ట నివారణ చర్యల గురించి కూడా మనం మాట్లాడుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. 2020 ఏప్రిల్ 10న వచ్చిన ఒక నివేదిక భారత దేశంలో పొదుపు రేటు 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని చెప్తోంది. ఆదాయ వనరులు ఒకవైపు తగ్గిపోతుంటే విలాస వ్యయాలు పెరిగిపోవటం ఇందుకు కారణం. ‘వ్యయం మీద అదుపు, ఆదాయం లోంచి పొదుపు’ అనే సూత్రమార్గంలోకి మళ్లీ మనం వెళ్లాలి. పాశ్చాత్య తరహా జీవన విధానం లోంచి, వాణిజ్య తరహా భావజాలం లోంచి బయటపడగలగాలి. మన జీవితంలో భారతీయాత్మ ప్రతిబింబించాలనేది మహాత్ముడి కల. సంక్షోభ సమయంలో అదే మనకు రక్ష! 

మండలి బుద్ధప్రసాద్

ఆంధ్రప్రదేశ్ పూర్వపు ఉపసభాపతి

Advertisement
Advertisement
Advertisement