Abn logo
Sep 21 2021 @ 23:52PM

ఇల్లు కట్టేది ఎలా?

జలుమూరు మండలం టెక్కలిపాడులో నిలిచిన పనులు


- ముందుకు కదలని జగనన్న ఇళ్ల నిర్మాణం

- వర్షాలు, పెరిగిన ధరలతో పనుల్లో జాప్యం 

- ఇసుక కొరతతో లబ్ధిదారులపై అదనపు భారం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండడం... నిర్మాణ సామగ్రి సకాలంలో సరఫరా కాకపోవడంతో పనులు మందగించాయి.  ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం చాలక.. బయట అప్పులు చేస్తున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.  చేతిలో డబ్బులు లేక.. రుణాలు మంజూరు కాక ఎలా ఇళ్లు నిర్మించాలో తెలియక సతమతమవుతున్నారు. 

- జిల్లాలో జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం 91,138 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 1,067 లేఅవుట్‌లలో సొంత జాగాలు లేనివారికి సెంటు చొప్పున పట్టాలు అందజేశారు. పాతపట్నం, పాలకొండ, రాజాం నియోజకవర్గం వంగర మండలంలో కొన్ని గ్రామాలకు రూరల్‌ పరిధిలో ఉన్నందున తొలి దశ ఇళ్లను మంజూరు చేయలేదు. ఈ నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు కేవలం 17,463 ఇంటి పనులు మాత్రమే ప్రారంభమైనట్లు అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. పునాది స్థాయిలో కూడా నిర్మాణ పనులు పూర్తి కానివి దాదాపు 50,161 ఉన్నాయి. పునాది స్థాయి పూర్తి చేసిన లబ్ధిదారులు 6,877 మంది ఉన్నారు. రూఫ్‌లెవెల్‌కు వచ్చినవి కేవలం 1,908 మాత్రమే. రూ్‌ఫ్‌లెవెల్‌ పూర్తయిన నిర్మాణాలు 1,267 ఉన్నాయి. కేవలం 48ఇళ్లు మాత్రం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.64 కోట్లు వ్యయం చేసింది. ఇప్పటికే పనులు పూర్తయిన  వాటికి సంబంధించి రూ.18కోట్లకుపైగా ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. వాస్తవానికి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకమే. 

 పెట్టుబడి భారమై..  

జిల్లాలో ప్రస్తుతం పది శాతం మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షల చొప్పున ఇస్తోంది. లబ్ధిదారులు సిమెంట్‌, ఇనుము, ఇసుక సమకూర్చుకుంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తుంది. గృహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మాణ సామగ్రిని పొందేందుకు అంగీకారం  చేసుకుంటే..  సిమెంట్‌, ఇసుక, ఇనుము దశల వారీగా గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు పంపిణీ చేస్తున్నారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా చాలామంది గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మాణ సామగ్రి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ప్రభుత్వం కేటాయించిన యూనిట్‌ ధర.. నిర్మాణ సామగ్రికే సరిపోతుండడంతో లబ్ధిదారుల చేతికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మరోవైపు మేస్ర్తీలు, కూలీల ధరలు పెరగడంతో.. లబ్ధిదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇసుక కొరతతో డిమాండ్‌ పెరగడంతో అదనపు భారం మోస్తున్నారు. ఈ క్రమంలో నత్తనడకన పనులు సాగుతున్నాయి. నరసన్నపేట మండలంలో 1,916 ఇళ్లు మంజూరు కాగా...1,617 ఇళ్లు వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఇదే మండలంలో అధికారులు మోడల్‌ కాలనీగా ఎంపిక చేసిన జమ్ములో సామగ్రి అందక నిర్మాణాలు నెమ్మదించాయి. జలుమూరు మండలంలో 36 లేఅవుట్‌లు వేయగా... భూ వివాదాల కారణంగా ఆరు లేఅవుట్‌లలో పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియని దుస్థితి నెలకొంది. 847 మందికి పట్టాలు పంపిణీ చేయగా... 510 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. టెక్కలిపాడులో తొలుత నిర్మాణాలు వేగంగా సాగినా..  వర్షాలు, ఇసుక కొరత కారణంగా కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనులు నిలిపేశారు. ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపడతామని అధికారులు  తెలిపారు.