Abn logo
Sep 26 2021 @ 00:55AM

సంక్షోభానికి రాజకీయ స్పందన

రేపు భారత్‌ బంద్‌


రాజకీయపార్టీలు తమ చారిత్రక బాధ్యతగా ఒక ప్రత్యామ్నాయ సంక్షేమ కేంద్రిత ప్రజాస్వామ్య అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేయగలవా అన్నది ప్రశ్నార్థకమే. ఈ జరూరు కర్తవ్యాన్ని అవి నిర్వహించకపోతే రైతాంగం, శ్రామికులు, యువత, పేద ప్రజలు ఏ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెస్తారన్నది భారతచరిత్ర ఎదురుచూస్తున్న ప్రశ్న. చరిత్రలో ప్రజల సృజనాత్మక పాత్రను మనం తక్కువ అంచనా వేయలేము.


భారత్‌లో సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అమలై మూడు దశాబ్దాలు దాటుతున్నది. ఇప్పుడు అది ఇంకా తీవ్రతను సంతరించుకుంది. స్వాతంత్య్రం తర్వాత మొదటి మూడు దశాబ్దాలు ప్రజా సంక్షేమం దృష్ట్యా కొంతవరకు విధాన నిర్ణయాలు జరిగేవి. దేశంలో పెట్టుబడి, మార్కెట్‌ తమ విస్తరణ కోసం కూడా రాజ్యవ్యవస్థ మీద ఆధారపడడం వల్ల రాజ్యం విద్య, వైద్యం, రవాణా, కమ్యూనికేషన్స్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ వంటి అన్ని రంగాల-లోనూ బొగ్గు, ఇనుము లాంటి కీలక ముడిపదార్థాల పెంపుదలల్లోనూ చొరవ తీసుకొని ఆర్థికాభివృద్ధికి దోహదపడింది. దీనినే చాలా మంది ‘సోషలిస్టు అభివృద్ధి నమూనా’గా కూడా పరిగణించారు.


వ్యవసాయరంగంలో కూడా భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని, దాంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి లాంటి బాధ్యతలను ప్రభుత్వం చేపట్టింది. అయితే భూసంస్కరణలను నిర్లక్ష్యం చేసింది. వాటితో సమకూరగల దీర్ఘకాలిక ప్రయోజనాలను పట్టించుకోలేదు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు భూసంస్కరణలతోనే అభివృద్ధిని సాధించాయి. అందుకే మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా వృద్ధి రేటు 2.5 శాతం దాటలేదు. రానురాను దేశం వేగంగా అభివృద్ధి చెందడం లేదని ఒకవైపు, అలాగే సమాజంలో ముఖ్యంగా యువతకు తగినన్ని అవకాశాలు రావడం లేదని మరోవైపు అసంతృప్తి పెరిగిన మాట కూడా వాస్తవం.


1980లలో అభివృద్ధి దిశను అందుకోసం మార్చాలని పెట్టుబడిని ప్రోత్సహించాలనే ఆలోచనలు ప్రారంభం కావడంతో దేశీయ మార్కెట్‌ను, అంతర్జాతీయ మార్కెట్‌తో ముడివేస్తే వృద్ధి పుంజుకుంటుందని భావించారు. దిశ మార్చడంతో 1980లలో వృద్ధిరేటు దాదాపు 5.6 శాతానికి చేరుకుంది. వృద్ధిరేటు పెరిగిన దశాబ్దంలోనే దేశీయ ఆర్థికవ్యవస్థ ‘చెల్లింపుల తారతమ్యం’ (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) సంక్షోభంలో పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ తన విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వైవి రెడ్డి తన ఆత్మకథలో బాగా వివరించారు. రిజర్వ్‌బ్యాంక్‌లో నిలువ ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించవలసి వచ్చింది.


ఈ సంక్షోభానికి మూలకారణాలను వెతికే బదులు పెట్టుబడిదారీ అభివృద్ధి తప్ప వేరే మార్గం లేదని, దేశంలో తగినంత పెట్టుబడి లేనందున అంతర్జాతీయ పెట్టుబడిని ఆహ్వానించాలని భావించి అంతకుముందు దేశీయ పెట్టుబడికి ఉన్న రక్షణలన్నింటినీ తొలగిస్తూ వచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యసంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు చాలా షరతులు పెట్టి ఇచ్చినవి. ఈ షరతుల వల్ల అన్ని రంగాలని ప్రైవేటుకు, అంటే మార్కెట్‌కు అప్పచెప్పాలని ఒత్తిడి పెరగడంతో మొదట్లో మూడు దశాబ్దాలు దేశం నిర్మించుకున్న భిన్న రంగాలను ప్రైవేటుకు అప్ప చెప్పారు. వీటితో బాటు సేవారంగం విద్య, వైద్యం, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, టెలికమ్యూనికేషన్‌ రంగాలలో ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించారు. ఆ ప్రక్రియ ఎక్కడా ఆగే సూచనలు కన్పించడం లేదు.


1990లలో పీవీ నరసింహారావు ప్రోత్సహించిన ఈ కార్పొరేటీకరణ 21 శతాబ్దంలో వేగాన్ని పుంజుకుంది. 2004 నుండి 2014 మధ్య దశాబ్దకాలం మార్కెట్‌కు విపరీతమైన స్వేచ్ఛ కల్పించడమే కాక, రాజ్యం మార్కెట్‌కు కావలసిన సదుపాయాలు కల్పిస్తూ, చట్టాలను దానికి అనుకూలంగా మారుస్తూ వచ్చింది. అయినా ఇంకా వేగం పెంచాలని, ప్రభుత్వంలో అవినీతి పెరిగి సత్వర పెరుగుదలకు అడ్డుపడుతున్నదని ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమమే జరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద కార్పొరేట్‌లు మూకుమ్మడి దాడి చేయడంతో 2014లో కాంగ్రెస్‌ ఓడిపోయింది.


కాంగ్రెస్‌ స్థానంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని సమగ్రంగా ఎవ్వరూ విశ్లేషించలేదు. ఆ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని లోతుగా గమనిస్తే, సంక్షేమం నుంచి రాజ్యం తప్పుకోవడంతో దేశంలో పెరిగిన అసంతృప్తి దాని ఓటమికి ఒక బలమైన కారణమని భావించవచ్చు. దీనికి తోడు ఈ అభివృద్ధిలో అసమానతలు విపరీతంగా పెరగడం ఒక అనివార్య పర్యవసానం. కాంగ్రెస్‌ కొన్ని ప్రజానుకూలమైన చట్టాల ద్వారా విద్యాహక్కు కల్పించి గ్రామీణ ఉపాధి పథకం వంటివి అమలు చేసినా ఆ పార్టీ కార్పొరేట్‌ ప్రచార హోరును తట్టుకుని వాటి గురించి ఎన్నికలలో ప్రచారం చేసుకోలేకపోయింది. అంతేకాక కార్పొరేట్‌ పెట్టుబడితో పుంజుకున్న ఎలక్ట్రానిక్‌ మీడియా విపరీతంగా విస్తరించి రాజకీయ ప్రచారాన్ని ఒక కొత్తస్థాయికి తీసుకెళ్లింది.


కార్పొరేటు రంగం తన లాభాల వేటలో వ్యవసాయ రంగాన్ని వదులుకోదు. కార్పొరేట్ల ప్రవేశాన్ని, దాని పర్యవసానాన్ని ఈ దేశ రైతాంగం బాగానే పసిగట్టారు. రైతాంగ ప్రతిఘటన రానురాను అందరినీ ఆశ్చర్యపరచే స్థాయికి చేరుకుంది. పాశ్చాత్యదేశాలలో వ్యవసాయ కార్పొరేటీకరణ చాలా సునాయసంగా జరిగింది. కాని మనదేశంలో సగం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగ పరిస్థితి భిన్నమైంది. అందుకే రైతాంగం కార్పొరేట్‌ అభివృద్ధి నమూనా మూలాలను ప్రశ్నిస్తోంది. రాజకీయపార్టీలు ఏవీ కూడా ఈ సాహసాన్ని చేయలేకపోయాయి. అందుకే మొదటి నుంచి రైతాంగం అన్ని రాజకీయపార్టీలను చాలా దూరంగా ఉంచింది. 


ఒక వైపు రైతాంగం ప్రతిఘటన తీవ్రతరమవుతున్న సందర్భంలోనే కేంద్రప్రభుత్వం అన్ని ప్రభుత్వరంగ సంస్థలను మార్కెట్‌లో దాదాపు అమ్మకానికి పెట్టింది. ఐదారు దశాబ్దాలుగా ఈ దేశ కార్మికులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు తమ శక్తిని ధారవోసి నిర్మించుకున్న సంస్థలు అవి. లక్షలాది మందికి అవకాశాలు కల్పించి దేశ సంపదను, ప్రజా సంక్షేమాన్ని పెంచిన సంస్థలు అవి. వాటిని ఇంత నిర్దాక్షిణ్యంగా అమ్మడం కార్పొరేటీకరణ కీలక దశే కావచ్చు, కానీ దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బలహీనవర్గాల యువతకు రిజర్వేషన్ల ద్వారా సామాజికన్యాయాన్ని అందించి, ప్రజా సంక్షేమానికి తోడ్పడ్డ ఈ సంస్థలను మార్కెట్‌కు అప్పచెపితే ఇప్పటిదాకా కొంతైనా న్యాయం పొందిన బలహీనవర్గాల పరిస్థితి ఏమిటి? సంక్షేమభావన ఏమైనట్టు? 


ఇదీ, ఈ నెల 27న భారత్‌బంద్‌కు ఉన్న చారిత్రక నేపథ్యం. ఇంతకాలంగా దాదాపు ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న రాజకీయపార్టీలు తమలో ఎన్ని అంతర్గత విబేధాలు, వైరుధ్యాలు ఉన్నా వాటిని పక్కకు పెట్టి పందొమ్మిది పార్టీలు కలసి ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణలో ఎనిమిది పార్టీలు కలిసి ప్రతిఘటనకు పిలుపునిచ్చాయి. వాళ్లు ఇలా కలవడమన్నది సమాజ ఒత్తిడి వల్లే అని భావించాలి. 


ముఖ్యంగా రైతాంగం, అలాగే ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, దీనితో బాటు దాదాపు మూడున్నర కోట్ల మంది చదువుకున్న నిరుద్యోగులు ఈ చలనానికి మరో కారణం. కరోనా వైరస్‌ గత జబ్బుల్లా కాక ప్రతి మనిషిని భయపెట్టింది. రాజ్యం వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొన్న భయానక అనుభవం మళ్లీ చరిత్రలో ఎప్పుడూ పునరావృత్తం కాకూడదు. లక్షల మంది చనిపోయారు. ఆరోగ్యానికి ఒక భద్రత కల్పించే వాతావరణమే లేదు. ఇంత తీవ్ర ఆర్థిక అసమానతలు ఉన్న దేశంలో ఇలాంటి భయంకరమైన ఆరోగ్య సమస్యకు, కార్పొరేట్‌ సంస్థలు ఏమీ చేయలేకపోయాయి. చేయాలనే సంకల్పం కూడా వాళ్ళకు లేదు. ప్రధానమంత్రి లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కార్మికులు పడ్డ కష్టాలను కళ్ళారా చూశాం. రాజ్యం తన పాత్రను కుదించుకోవడం వల్ల ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. సమాజం మొత్తం ఒక దుఃఖమయ అనుభవంలో నుంచి ప్రయాణిస్తున్న సందర్భంలో ఈ అసంతృప్తి రాజకీయపార్టీలను ఒక దగ్గరకు తీసుకువచ్చింది. ఒకరకంగా రాజకీయపార్టీలు ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితికి స్పందనగా ఈ ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. 


ఈ మార్పు ఆహ్వానించవలసిందే. కాని రాజకీయపార్టీలు తమ చారిత్రక బాధ్యతగా ఒక ప్రత్యామ్నాయ సంక్షేమ కేంద్రిత ప్రజాస్వామ్య అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేయగలవా అన్నది ప్రశ్నార్థకమే. అత్యవసరమైన ఈ పాత్రను అవి నిర్వహించకపోతే రైతాంగం, శ్రామికులు, యువత, పేద ప్రజలు ఏ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెస్తారన్నది భారత చరిత్ర ఎదురుచూస్తున్న ప్రశ్న. చరిత్రలో ప్రజల సృజనాత్మక పాత్రను మనం తక్కువ అంచనా వేయలేము.


-ప్రొ. జి.హరగోపాల్‌