Abn logo
Sep 14 2021 @ 01:10AM

జ్వరాలతో విలవిల..!

పీహెచసీ, సీహెచసీల్లో అందని వైద్యం

జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్న దుస్థితి

కిక్కిరిసిపోతున్న సర్వజనాస్పత్రి

12 రోజుల్లో వెయ్యి మందికిపైగా అడ్మిషన

డెంగీ బాధితులు 103 మంది

పారాసిటమాల్‌తో సరిపెడుతున్న వైనం

యాంటీబయాటిక్‌ మాత్రలు కరువు

ఆరోగ్యశ్రీ పరిధిలోకి జ్వరాలు.. 

అయినా అందని వైద్యం

ప్రైవేటులో యథేచ్ఛగా దోపిడీ

అధికారులు తీరుపై విమర్శలు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు13 జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా.. జ్వరం.. జ్వరం.. ఏ ఊరికెళ్లినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. జ్వరాలు.. జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. నెల రోజులుగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.  దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచసీ)లు, కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రాలు (సీహెచసీ)లు, పట్టణ హెల్త్‌ సెంటర్‌లున్నా.. జ్వర బాధితులకు వైద్యం అందడం లేదు. జిల్లా ఆస్పత్రికి బాధితులను రెఫర్‌ చేస్తుండడంతో పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సర్వజనాస్పత్రి జ్వర పీడితులతో కిక్కిరిసిపోతోంది. రోజూ వివిధ రోగాలతో బాధపడుతున్న వారు 1500 మందికిపైగానే ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో ఇటీవలిగా వందల మంది జ్వర బాధితులే ఉంటున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అధికారిక రికార్డుల మేరకే ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 13 రోజుల్లో 19,945 మంది ఆస్పత్రికి వచ్చి, వైద్య సేవలు పొందారు. ఇందులో 40 శాతం మంది నెల రోజులుగా వివిధ జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు చూపుతున్నారు. ఈ 13 రోజుల్లోనే 1091 మంది ఆస్పత్రిలో జ్వర బాధితులు అడ్మిట్‌ అయ్యారు. అంటే రోజుకు వంద మంది వరకు జ్వర బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ అడ్మిషన పొంది, చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


పారిశుధ్యంపై కనిపించని చిత్తశుద్ధి

విష జ్వరాల విజృంభణకు పారిశుధ్యం అధ్వానంగా ఉండటమే కారణమని చెప్పొచ్చు. వానలు కురుస్తుండడంతో పట్టణాలు, గ్రామాలు, కాలనీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా మురికి గుంటలు నిండి, మురుగునీరు రోడ్లపై పారుతోంది. మురికినీరు నిల్వ ఉంటుండడంతో దుర్వాసనతోపాటు దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సీజనలో పారిశుధ్యంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ దిశగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పట్టణ, పల్లె ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జనం.. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాల బారిన పడాల్సి వస్తోంది. జ్వర బాధితులు బెంబేలెత్తుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దోమల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలువల్లో పూడిక తీయాలి. నీరు నిల్వ లేకుండా చూడాలి. లార్వాను నాశనం చేయడానికి ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. చెత్తాచెదారం లేకుండా రోజూ శుభ్రం చేయించాలి. ఇళ్లలో తాగే, అవసరాలకు ఉపయోగించే నీటిని వారం రోజుల కన్నా.. ఎక్కువ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూ ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలి. అప్పుడే దోమలను నివారించి, రోగాలను అరికట్టే అవకాశం ఉంటుంది. కలెక్టర్‌, జేసీలు సమీక్షలు పెట్టి, ఆదేశాలివ్వడానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్యంలో ఎలాంటి పురోగతి లేదు. ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే జ్వరాలు మరింత విజృంభించే ప్రమాదం లేకపోలేదు.


కాకి లెక్కలతో తక్కువ..

జిల్లా వైద్యాధికారులు కాకిలెక్కలతో జ్వర బాధితుల సంఖ్య తక్కువ చూపుతున్నారు. ఇందుకు జిల్లా సర్వజనాస్పత్రి అధికారిక జ్వరాల లెక్కలే నిదర్శనం. ఈనెల 1వ తేదీ నుంచి జిల్లా ఆస్పత్రిలో అడ్మిషన అయిన వారి లెక్కలు చూస్తే అధికారుల మాయాజాలం బయటపడుతోంది. మొత్తం 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 2121 మంది జ్వర బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇందులో 1091 మంది అడ్మిషన కాగా.. వీరిలో 103 మంది డెంగీ బాధితులున్నారు. మలేరియా బాధితులు 23 మంది, టైఫాయిడ్‌ బారిన పడిన 12 మంది అడ్మిషన పొందారని రికార్డులు చూపుతున్నాయి. వైద్యశాఖాధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 117 డెంగీ, 14 మలేరియా కేసులు మాత్రమే న మోదయ్యాయని లెక్కలు చూపుతున్నారు. సర్వజనాస్పత్రిలోనే 13 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో జ్వర బాధితులు చికిత్స పొందితే.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది  వైద్యం చే యించుకున్నారో అర్థమవుతుంది.


జ్వరాలకు వర్తించని ఆరోగ్యశ్రీ

రాష్ట్ర ప్రభుత్వం జ్వర బాధితులకు ఉచిత చికిత్స అందించాలని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు పొందవచ్చని జిల్లా అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినా బాధితులకు మాత్రం ఉచిత వైద్య సేవలు అందడంలేదు. ప్రభుత్వాస్పత్రులకు వస్తే మందుల కొరత వెంటాడుతోంది. పారాసిటమాల్‌తోనే నెట్టుకొస్తున్నారు. యాంటీబయాటిక్‌ మాత్రల కొరత తీవ్రంగా ఉంది. నిధులు లేక ఉన్న మందులనే రోగులకు సర్ది, చికిత్స అందిస్తున్నామని జిల్లా ఆస్పత్రి వైద్యులే అంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా దోపిడీ సాగిస్తూ.. రూ.వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నాయి. బాధితులకు వారే ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు చేయించి, డెంగీ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయని భయపెడుతున్నారు. వాస్తవానికి ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనూ డెంగీ నిర్ధారణ పరీక్షలకు వసతులు లేవు. ఎలీసా విధానంలోనే పరీక్షలు చేసి, డెంగీ నిర్ధారించాలి. జిల్లాలో వైద్య కళాశాల (జిల్లా ఆస్పత్రి), హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రమే ఎలీసా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులు కిట్‌ పద్ధతిలో పరీక్షలు చేస్తూ డెంగీ అని చెప్పి, అడ్మిట్‌ చేసుకుని, వేలకు వేల రూపాయలు ఫీజులు దండుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం డెంగీ లక్షణాలున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే వైద్యశాఖకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేటు ఆస్పత్రులు అలా చేయకుండా.. సొంత పరీక్షలు నిర్వహిస్తూ డెంగీ లక్షణాల పేరు చెప్పి, బాధితులను అడ్మిట్‌ చేసుకుంటున్నాయి. అందుకే ఆ బాధితులకు ఆరోగ్యశ్రీ కూడా వర్తించకుండా పోతోంది. వర్తించాలంటే ఎలీసా పరీక్ష చేయించి, నిర్ధారించాల్సి ఉంటుంది. బాధితుల భయాన్ని ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి.